ఏలూరు (టూటౌన్): రాపిడో, ఊబర్, ఓలా సంస్థల అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరులో ఆటో డ్రైవర్లు గళమెత్తారు. శుక్రవారం పాత బస్టాండ్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఏపీ ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్ అహ్మద్ మాట్లాడుతూ ర్యాపిడో, ఊబర్, ఓలా సంస్థలు కాల్ సెంటర్‌ను ఏర్పాటుచేసుకుని కోట్లాది రూపాయలు ఆటో డ్రైవర్ల ఆదాయాన్ని కొల్లగొడుతున్నాయని మండిపడ్డారు. కేరళలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సవారీ యాప్ ద్వారా ఆటో, టాక్సీ డ్రైవర్లకు 6 శాతం కమీషన్‌కు సేవలందిస్తోందని, అయితే మన రాష్ట్రంలో రాపిడో వంటి సంస్థలు 25 నుంచి 30 శాతం కమీషన్లు గుంజుతున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం పేదలను ఉద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు దోచిపెడుతోందని ధ్వజమెత్తారు. రవాణా రంగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేరళ, తమిళనాడు తరహాలో ప్రయాణికులు, ఆటో డ్రైవర్లకు లబ్ధి చేకూరేలా ఆన్‌లైన్ యాప్ తయారు చేయాలని డిమాండ్ చేశారు. రాపిడో, ఊబర్, ఓలా సంస్థలను నిషేధించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతాయని హెచ్చరించారు. సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు బి.సోమయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డీఎన్‌వీడీ ప్రసాద్, ఆర్.లింగరాజు ఆటో డ్రైవర్లకు మద్దతు తెలిపారు. జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ అమర్‌కుమార్, జె.గోపి నగర అధ్య క్ష, కార్యదర్శులు అడ్డాల రాజు, బి.చంద్రశేఖర్ నా యకత్వంలో పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు తమ ఆటోలతో ర్యాలీలో పాల్గొన్నారు.


