ఆటో బోల్తా.. 10 మందికి గాయాలు
చింతలపూడి: కూలీలతో వస్తున్న ట్రక్ ఆటో బోల్తా పడ్డ సంఘటన చింతలపూడి మండలం, ఆంథోనీ నగర్ సమీపంలో శుక్రవారం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా దుద్దుపూడి గ్రామానికి చెందిన కూలీలు చింతలపూడి మండలం వెలగలపల్లిలో మొక్కజొన్న ఫ్యాక్టరీలో గురువారం రాత్రి పనికి వెళ్లి ట్రక్ ఆటోలో తిరిగి వస్తుండగా ఆటో పంక్చర్ కావడంతో ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కనపర్తి లక్ష్మికి తీవ్ర గాయాలవడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు తరలించినట్లు వైద్యులు తెలిపారు.
నలుగురు కూలీలను కాపాడి మేస్త్రి మృతి
గన్నవరం: శ్లాబ్ నిర్మాణ పనుల్లో జరిగిన ప్రమాదంలో నలుగురు మహిళలను రక్షించే క్రమంలో కాంక్రిట్ లిఫ్ట్ గడ్డర్ల కింద పడిన ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటనపై శుక్రవారం గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన పిల్లిబోయిన కొండలు(35) కాంక్రీట్ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గన్నవరం మండలం మాదలవారిగూడెంలో ఓ భవనానికి శ్లాబ్ నిర్మాణ నిమిత్తం గురువారం కొంత మంది కూలీలను తీసుకుని వెళ్లారు. శ్లాబ్ నిర్మాణం జరుగుతున్న సమయంలో కాంక్రీట్‌ను పైకి లిఫ్ట్ చేసే యంత్రంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో లిఫ్ట్ బాక్స్ వైర్లు ఒక్కసారిగా తెగి ఐరన్ గడ్డర్లు కింద పడిపోవడం గమనించిన కొండలు అక్కడే ఉన్న మహిళలను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఆ నలుగురు మహిళలను పక్కకు నెట్టివేసిన కొండలు మాత్రం బరువైన లిఫ్ట్ బాక్స్ గడ్డర్లు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆర్టీసీ బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి
టి.నరసాపురం: ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి గుండెపోటు రావడంతో మృతి చెందాడు. రాజపోతేపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కె.జగ్గవరానికి చెందిన కొక్కుల సోమేశ్వరరావు(60) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శుక్రవారం భార్యను వెంటబెట్టుకొని జగ్గవరం నుంచి ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో హాస్పటల్‌కు బయల్దేరాడు. మధ్యలో రాజుపోతేపల్లి సెంటర్ వద్దకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా గుండెపోటు రావడంతో బస్సులో అక్కడికక్కడే మృతి చెందాడు.


