ఎట్టకేలకు మరమ్మతులు
ఆగిరిపల్లి: ఆగిరిపల్లి నుంచి తోటపల్లి రహదారికి ఎట్టకేలకు అధికారులు మరమ్మతులు చేశారు. 9 నెలల క్రితం ఆగిరిపల్లి నుంచి తోటపల్లి వరకు పాత రోడ్డును తొలగించి కంకర పోసి వదిలేశారు. దీంతో వాహనదారులు, ప్రజలు రోడ్డుపై లేచిన కంకరరాళ్లతో, దుమ్ము, ధూళితో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత నెల మార్చి 5న ‘కంకర రోడ్డుపై కష్టాలు’ పేరిట సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు ఆగిరిపల్లి నుండి తోటపల్లి వరకు రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయడంతో ప్రజలు ఊపిరి పిలుచుకున్నారు.
దూరవిద్య ఇంటర్ ప్రాక్టికల్స్‌కు 89 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ కోర్సు 2024–25 విద్యా సంవత్సరానికి జరుగుతున్న పబ్లిక్ పరీక్షల్లో మంగళవారం నిర్వహించిన భౌతికశాస్త్రం పరీక్షకు 40 మందికి 30 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరయ్యారు. రసాయన శాస్త్రం పరీక్షకు 40 మందికి 32 మంది హాజరు కాగా 8 మంది గైర్హాజరయ్యారు. జీవశాస్త్రం పరీక్షకు 40 మందికి 27 మంది హాజరు కాగా 13 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలో డీఈసీ కమిటీ ప్రయోగపరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారని, జిల్లాలో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
ఉపాధి కూలీల బకాయిలు చెల్లించాలి
ఏలూరు (టూటౌన్): మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు గత జనవరి 15 నుంచి వేతనాలు విడుదల చేయలేదని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ.రవి విమర్శించారు. మంగళవారం ఏలూరు మండలం చాటపర్రులో ఉపాధి కూలీలతో కలిసి నిరసన తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం వేతన బకాయిలు నేటికీ విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. 15 రోజులకు ఒకసారి వేతనాలు ఇస్తామని చెప్పడం, నెలల తరబడి పెండింగ్‌లో పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక పక్క ఉపాధి కూలీలకు వేతనాలు పెంచామని ప్రచారం చేయడం తప్ప పెంచింది ఏడు రూపాయలే అన్నారు. వేతనాలను విడుదల చేయకపోగా ధరలు పెంచుతుంటే పేదలు ఏ విధంగా బతకాలని ప్రశ్నించారు.
చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (టూటౌన్): చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చేనేత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారపు పేట వీవర్స్ కాలనీలో ధర్నా నిర్వహించారు. ధర్నా ఉద్దేశించి జిల్లా కార్యదర్శి పిచ్చుక ఆదిశేషు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే చేనేత పరిశ్రమను రక్షిస్తామని వాగ్దానం చేసినా నేటికీ అమలు చేయలేదన్నారు. చేనేత కార్మికులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేయాలని కోరారు. నేతన్న నేస్తం మగ్గం నేస్తున్న ప్రతి కార్మికుడికి ఇవ్వాలని... బోగస్ చేనేత సహకార సంఘాలను రద్దు చేయాలని కోరారు. చేనేత మహిళలకు ప్రసూతి సమయంలో ఆర్థిక సహకారం చేయాలని.. చేనేతకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్‌లు కచ్చితంగా అమలు చేయాలన్నారు. చేనేత కార్మికులకు వెల్ఫేర్ ఫండ్ బోర్డు ఏర్పాటు చేయాలని, సహకార సంఘాల అప్పులు రద్దు చేయాలని, డిమాండ్ చేసారు. ధర్నాలో గుత్తి పోతురాజు, ఎన్ విజయలక్ష్మి, యర్ర సాంబశివరావు, మువ్వల అన్నపూర్ణ, పేరిక చిన్న వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
జేఈఈ మెయిన్స్‌కు 128 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో మంగళవారం నిర్వహించిన జేఈఈ మెయిన్స్ సెషన్–2 పరీక్షలకు 128 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరిగిన పరీక్షకు 133 మందికి 128 మంది హాజరయ్యారు.
ఎట్టకేలకు మరమ్మతులు
ఎట్టకేలకు మరమ్మతులు


