సొంతవారికే సోపానం! | - | Sakshi
Sakshi News home page

సొంతవారికే సోపానం!

Published Thu, Apr 10 2025 12:48 AM | Last Updated on Thu, Apr 10 2025 12:48 AM

సొంతవ

సొంతవారికే సోపానం!

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చంద్రన్న స్వయం ఉపాధి సోపానం పథకం ద్వారా బీసీ, కాపు, ఈడబ్ల్యూఎస్‌కు చెందిన నిరుద్యోగులకు ఉపాధి రుణాలు అందించే కార్యక్రమం సొంతవారికే కట్టబెట్టేలా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు వేలల్లో వచ్చినా రుణాలు ఇచ్చేది కొందరికే కావడం ఒక వంతైతే తమ పార్టీ కార్యకర్తలు, నేతలు చెప్పిన వారికే రుణాలు ఇచ్చే కార్యక్రమానికి స్థానిక పచ్చ నేతలు శ్రీకారం చుట్టారు. అర్హత ప్రామాణికంగా ఇవ్వాల్సిన సబ్సిడీ రుణాలను తమకు నచ్చిన వారికి కట్టబెట్టే ప్రహసనంలా మార్చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరేమనుకుంటే మాకేంటి.. అధికారం మాది.. మమ్మల్ని అడిగే వారు ఎవరూ లేరనే ధీమాతో టీడీపీ నాయకులు తమకు నచ్చిన విధంగా చేసుకుపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి మొత్తం 5,847 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను ఈ నెల 3, 4 తేదీలలో స్థానిక ఏఎస్‌ఆర్‌ స్టేడియం సమీపంలోని ముస్లిం షాదీఖానాలో దరఖాస్తుల పరిశీలించి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇదంతా తూతూ మంత్రంగా నిర్వహించారే తప్ప నిజంగా కార్పొరేషన్‌ అధికారులు, బ్యాంకు అధికారులకు తమకు నచ్చిన వారికి, అర్హత ఉన్నవారికి సబ్సిడీ రుణాలు ఇచ్చే అవకాశం లేకుండా పోయింది. అంతా స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం నుంచే చక్రం తిప్పారనే విమర్శలు ఉన్నాయి. తమ పార్టీకి చెందిన వారికి, తమకు నచ్చిన వారికే సోపానం పథకంలో రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

రుణాల కేటాయింపులు ఇలా..

నేరుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచే రుణాలను కేటాయించినట్లు స్వయంగా టీడీపీ నాయకులే చెబుతున్నారు. ఏలూరు కార్పొరేషన్‌ పరిధిలో మొత్తం 5,847 దరఖాస్తులు రాగా మొత్తం రుణాలు 407 కేటాయించారు. ఒక్కో డివిజన్‌కు సగటున 8 రుణాలు అందించాల్సి ఉంది. ఈ సబ్సిడీ రుణాలు నేరుగా బీసీ కార్పొరేషన్‌ ద్వారా లబ్ధిదారులకు అందజేస్తారు. ఇక్కడే నాయకులు తమకు నచ్చిన వారి పేర్లతో కూడిన లిస్టును తయారు చేసి సంబంధిత అధికారులకు నేరుగా పంపించినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది నేరుగా జోక్యం చేసుకుని రుణాలను తమదైన శైలిలో పంచారనే వాదనలు ఉన్నాయి.

ఒక్కో ఇన్‌చార్జికి మూడు రుణాలు

ఏలూరు నియోజకవర్గంలోని మొత్తం 50 డివిజన్లకు సంబంధించిన టీడీపీ ఇన్‌చార్జిలు ఒక్కొక్కరికి మూడు చొప్పున రుణాలు కేటాయించారు. మిగిలిన ఐదింటిలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి.. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి చేరిన వారికి, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోని నాయకులకు నచ్చిన వారికి ఇచ్చేందుకు అట్టే పెట్టుకున్నారనేది సమాచారం.

అర్హులకు మొండిచేయి?

నిరుద్యోగ యువత తమ కాళ్ల మీద తాము నిలబడి స్వయం ఉపాధి సాధించేందుకు చంద్రన్న స్వయం ఉపాధి సోపానం పేరుతో సబ్సిడీ రుణాలును రాష్ట్ర వ్యాప్తంగా మూడు స్లాబుల్లో అందిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం పేర్కొంది. వాస్తవంగా అదంతా ఉత్తుత్తిదేనని తేలిపోయింది. పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అండగా ఉంటామని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తామని చెప్పి.. సొంత కార్యకర్తలకు ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏలూరు నగరంలో ఇవ్వనున్న సబ్సిడీ రుణాలు 407

ఒక్కో డివిజన్‌కు అందుబాటులో 8 ‘సోపానం’ రుణాలు

డివిజన్‌ టీడీపీ ఇన్‌చార్జికి 3 చొప్పున కేటాయింపు

మిగతావి ఎమ్మెల్యే ఆఫీసు నుంచి టిక్‌ పెడితేనే

అర్హత ఉన్నవారికే ఇవ్వాలి

రుణాలను నిబంధనల మేరకు అర్హత ప్రామాణికంగానే ఇవ్వాలి. దానికి భిన్నంగా తమ పార్టీ కార్యకర్తలకు, తమకు నచ్చిన వారికి, టిక్‌ పెట్టిన వారికే ఇవ్వడం విడ్డూరంగా ఉంది. యువత స్వయం ఉపాధి రుణాల్లోనూ పచ్చ నేతల జోక్యం చేసుకోవడం దారుణం. అధికారుల నిర్ణయానికి వదిలేస్తే అర్హులకు న్యాయం జరుగుతుంది.

– జి.సూర్యకిరణ్‌, జిల్లా కార్యదర్శి, డివైఎఫ్‌ఐ, ఏలూరు జిల్లా

పప్పు బెల్లంలా పంచుకుంటున్నారు

నిరుపేదలకు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు ఉద్దేశించిన స్వయం ఉపాధి సోపానం రుణాలను అధికార పార్టీ నాయకులు పప్పు బెల్లంలా పంచుకోవడం హాస్యాస్పదంగా ఉంది. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న చందంగా కూటమి ప్రభుత్వం తీరు ఉంది. అధికారులను డమ్మీలుగా చేసి ప్రజా ప్రతినిధులు మొత్తం చక్రం తిప్పడం ఎంత వరకు కరెక్టో పాలకులకే తెలియాలి. – కాకి నాని, జిల్లా అధ్యక్షుడు, పీడీఎస్‌యూ

సొంతవారికే సోపానం!1
1/2

సొంతవారికే సోపానం!

సొంతవారికే సోపానం!2
2/2

సొంతవారికే సోపానం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement