యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
పెదవేగి : మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పెదవేగి మండలంలోని రాయన్నపాలెం చెరువులో పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి అక్రమంగా తవ్వి ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండి పడుతున్నా మామూళ్ల మత్తులో జోగుతూ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ప్రభుత్వం తరుఫున మట్టి తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేకపోయినా అధికారులకు మామూళ్లు ముట్టజెప్పి గ్రామంలోని ఓ టీడీపీ నాయకుడు ఈ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని, అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని రాయన్నపాలెం ప్రజలు కోరుతున్నారు.


