దళితులపై దౌర్జన్యాలు అరికట్టాలి
జంగారెడ్డిగూడెం: దళితులపై కూటమి నాయకుల దౌర్జన్యాలు అరికట్టాలని కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.ప్రాన్సిస్ డిమాండ్ చేశారు. వేగవరంలో సీపీఎం, కేవీపీఎస్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాన్సిస్ మాట్లాడుతూ దళిత మహిళ గంజి మరియమ్మ 30 ఏళ్లుగా వేగవరంలో అరటిపండ్లు, కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ జీవిస్తోందన్నారు. షాపు తీసివేయాలని కూటమికి చెందిన జనసేన నాయకులు అనిశెట్టి వెంకన్నబాబు, దాకవరపు భానుమూర్తి, మోటేపల్లి దదార్ల, దాకవరపు వీరనాగయ్య కొందరితో కలిసి ఆమైపె దౌర్జన్యం చేశారన్నారు. తమ జీవనోపాధిని కూలగొట్టద్దని మరియమ్మ వేడుకున్నా షాపులను తొలగించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. కూటమి నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ప్రాన్సిస్ డిమాండ్ చేశారు. సీపీఎం మండల కార్యదర్శి ఎం.జీవరత్నం మాట్లాడుతూ వేగవరంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని జీవిస్తున్న దళితులపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్న కూటమి నాయకులపై చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో చలో వేగవరానికి పిలుపునిచ్చి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాధితులు కె.సుబ్బారావు, గంజి మరియమ్మ, కృష్ణ, రామారావు, బుడుపుటి నిర్మల కుమారి, నంబూరి వసంతరావు తదితరులు పాల్గొన్నారు.


