15న కోకో రైతుల చలో గుంటూరు
పెదవేగి : కోకో గింజల కొనుగోలు, ధర సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం పెదవేగి మండలం విజయరాయి గాంధీ నగర్‌లోని సీతారామ కళ్యాణ మండపంలో ఏపీ కోకో రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షతన కోకో రైతుల సంఘం రాష్ట్ర సమావేశం నిర్వహించారు. కోకో గింజల కొనుగోలు కంపెనీల మోసాలు, కొనుగోలు ధరల తగ్గింపుపై ఈనెల 12న కోకో సాగు చేస్తున్న అన్ని జిల్లాల్లో రాస్తారోకో కార్యక్రమాలు, 15న కోకో రైతుల చలో గుంటూరు ఉద్యాన శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర సమావేశం తీర్మానించింది. కోకో రైతులందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని సమావేశం పిలుపునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు.
అనుమానాస్పద మృతి కేసులో తనుశ్రీ భర్త అరెస్ట్
ముదినేపల్లి రూరల్ : వడాలికి చెందిన తనుశ్రీ అనుమానాస్పదస్థితి మృతి కేసులో ఆమె భర్త అనిల్‌కుమార్‌ను డీఎస్పీ శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో ముదినేపల్లిలో బుధవారం అరెస్టు చేశారు. గుండాబత్తిన తిరుపతయ్య కుమార్తె తనుశ్రీని అదే గ్రామానికి చెందిన బెజవాడ అనిల్‌కుమార్ ఐదు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకోగా ఈ నెల 7న తనుశ్రీ అనుమానాస్పద స్థితిలో మరణించింది. దీనిపై తనుశ్రీ బంధువులు, గ్రామస్తులు ఆగ్రహించి భర్త అనిల్‌కుమార్ హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని, వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వడాలిలో మంగళవారం మూడు గంటలపాటు ధర్నా నిర్వహించారు. స్పందించిన డీఎస్పీ సిబ్బందితో అనిల్‌కుమార్‌ను స్థానిక సహాయమాత స్కూల్ వద్ద బుధవారం అరెస్టు చేసి మధ్యవర్తుల సమక్షంలో పంచనామా చేసి కై కలూరు కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో నెల్లూరు జిల్లా జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
15న కోకో రైతుల చలో గుంటూరు


