పిల్లల దొంగలంటూ ఆస్పత్రిలో కలకలం
తణుకు అర్బన్ : తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పిల్లలను దొంగిలించే మహిళలు దిగారన్న వార్త కలకలం రేపింది. నిమిషాల వ్యవధిలోనే పిల్లల దొంగలు ఆస్పత్రిలో ఉన్నారనే విషయం ఆనోట ఈనోట విన్న బాలింతలు, తల్లులు బెంబేలెత్తిపోయారు. కామెర్లు, ఇతర సమస్యలతో ఎన్‌సీయూ విభాగంలో ఉంచిన తమ బిడ్డ ఉందా అనే భయంతో బాలింతల బంధువులు వార్డు వద్దకు పరుగులు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సుమారు 10 గంటల సమయంలో ఆస్పత్రి మూడో అంతస్తులోని ఏసీ వార్డులో ఉన్న బాలింతల వద్దకు వచ్చిన ఒక మహిళ తన ఫోన్ చార్జింగ్ పెట్టుకుంటానని అడిగి చార్జింగ్ పెట్టుకుంది. పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఒక బాలింత మంచంపై ఉన్న కవల పిల్లల్లో ఒక బిడ్డను ఎత్తుకుంటానని అడగ్గా ఆ తల్లి ఒప్పుకోలేదు. అయితే సదరు మహిళ అనుమానాస్పదంగా కనిపించడంతో బాలింత వార్డులోని నర్సుకు సమాచారం ఇచ్చారు. నర్సు ఇచ్చిన సమాచారంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణ సెక్యూరిటీ విభాగాన్ని అప్రమత్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది రావడం చూసిన మహిళ పరిగెత్తుతూ పారిపోతున్న పరిస్థితుల్లో ఆస్పత్రి గేటు వద్ద అదుపులోకి తీసుకుని సూపరింటెండెంట్ వద్దకు తీసుకువెళ్లి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ దశలో మరోమారు పారిపోయేందుకు ప్రయత్నించినా సెక్యూరిటీ విభాగ సూపర్‌వైజర్ సాయి, మహిళా సెక్యూరిటీ రేణుక ఆ మహిళను పట్టుకుని తిరిగి లోపలకు తీసుకువెళ్లారు. తణుకు పట్టణ స్టేషన్ ఏఎస్సై రాజ్యలక్ష్మి, కానిస్టేబుల్ మురళి వచ్చిన తరువాత మహిళను ప్రశ్నించగా సమీపంలో ఉన్న ఆమె బంధువుకు ఫోన్‌చేసి రప్పించారు. అయితే ఇద్దరూ కలసి నిడదవోలు మండలం కంసాలపల్లి నుంచి వచ్చామని సామాన్లు కొనుక్కునేందుకు వచ్చి ఫోన్ చార్జింగ్ పెట్టుకోడానికి ఆస్పత్రికి వచ్చానని చెప్పడంతోపాటు పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో ఇద్దరు మహిళలను పోలీసువర్గాలు పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే కొవ్వూరు మండలం శెట్టిపేటకు చెందిన గ్రామ పెద్దలు వచ్చి మహిళలు అటువంటి వారు కాదని ఆధార్ కార్డులు చూపించి సొంత పూచీకత్తుపై మహిళలను స్టేషన్ నుంచి తీసుకువెళ్లారని పోలీసులు తెలిపారు.
ఫోన్ చార్జింగ్ పెట్టుకోవడానికి ఆస్పత్రికి వచ్చానన్న మహిళ
పొంతన లేని సమాధానాలతో ఇద్దరు మహిళలను పోలీస్ స్టేషన్‌కు తరలింపు


