సంక్షోభంలో సాగు
అన్నదాతకు అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయి.. ఆరుగాలం శ్రమించినా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.. పంట దిగుబడులు రాక.. గిట్టుబాటు ధరలు లేక.. సిండికేట్‌ల మాయాజాలం.. అంతర్జాతీయ పరిణామాలు రైతులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మద్దతు ధరల కోసం రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నా కూటమి సర్కారుకు పట్టడం లేదు. రైతులకు నామమాత్రపు సాయం కూడా అందడం లేదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రొయ్యలు, కోకో, మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కోలుకోని కోకో
జిల్లాలో కోకో సాగు 36,150 ఎకరాలు విస్తరించి ఉంది. రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణం ఉన్న జిల్లాగా ఖ్యాతి గాంచింది. ఏటా జిల్లాలో 12 వేల టన్నుల కోకో గింజల దిగు బడి ఉంది. గతేడా ది ఏప్రిల్, మే నెల ల్లో కిలోకు అత్యధికంగా రూ.1,050 ధర పలకగా ప్రస్తు తం రూ.500కి చేరింది. అంతర్జాతీయంగా కోకోకు మంచి డిమాండ్ ఉన్నా వ్యాపారులు సిండికేట్‌గా మారి నాణ్యత, ఇతర కారణాలు చూపుతూ తక్కువ ధరకు కొంటున్నారు. దీంతో రాష్ట్ర కోకో రైతుల సంఘం నెల రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈనెల 12న రాష్ట్రవ్యాప్తంగా రైతుల రా స్తారోకోలు, 15న ఉద్యాన శాఖ కమిషనర్ కార్యాల య ముట్టడికి పిలుపునిచ్చారు. మద్దతు ధర కల్పి స్తామని గత నెలలో వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించినా కనీసం స్పందన లేకపోవడంతో ఆందోళనలు తీవ్రతరం చేశారు.
మామిడి.. దిగుబడి తడబడి
ఏలూరు జిల్లాలో 45 వేల ఎకరాల్లో మామిడి సాగు విస్తరించి ఉంది. నూజివీడు మామిడి అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచింది. ఈ ఏడాది డిసెంబర్, జనవరిలో పూత సమయంలో నల్ల తామర రావడంతో 70 శాతానికిపైగా దిగుబడి తగ్గిపోయింది. గతంలో మామిడి రైతులకు నష్టం వాటిల్లిన క్రమంలో ప్రభుత్వం ఆర్థిక సాయంతో ఆదుకుంది. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవతో సహా ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకపోవడంతో రైతులు ఆర్థిక ఊబిలో కూరుకుపోయారు. ఎన్నికల సమయంలో మామిడి పరిశ్రమ అభివృద్ధికి ప్రాసెసింగ్ యూనిట్లు, జ్యూస్, పల్ప్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని హామీలిచ్చిన చంద్రబాబు గద్దెనెక్కాక కనీసం మామిడి సాగు స్థితిగతులపై దృష్టి సారించకపోవడం గమనార్హం.
అన్నదాత.. గుండెకోత
● ఆర్థిక గండాలతో సతమతం
● ట్రంప్ దెబ్బకు రొయ్యల ధరలు పతనం
● గిట్టుబాటు ధర కోసం కోకో రైతుల ఆందోళన
● మామిడి తోటల్లో తగ్గిన దిగుబడి
● ఆక్వాలో క్రాప్ హాలిడే దిశగా అడుగులు
● ఆదుకోని కూటమి సర్కారు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : వాణిజ్య పంటలు, ఆక్వా కు రాష్ట్రంలోనే ఖ్యాతి గాంచిన జిల్లాలో మద్దతు ధర కోసం రైతులతో పాటు ఆక్వా సాగుదారులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రధానంగా జిల్లాలో 60 శాతానికిపైగా కోకో ధరలు పతనం కావడం, ఆక్వా ధరలు పూర్తిగా తగ్గిపోవడం, మామిడి దిగుబడి లేకపోవడం వంటి ప్రధాన సమస్యలతో లక్షలాది మంది రైతులు తీవ్ర అగనాట్లు పడుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు మొదలు లోకేష్ వరకూ జిల్లాను ఆక్వా హబ్‌గా మారుస్తాం, కోకో సాగుకు మహర్దశ తీసుకువస్తాం, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లతో మామి డి హబ్‌గా మారుస్తామని హామీలిచ్చారు. తీరా గద్దెనెక్కిన తర్వాత వీటి ఊసే ఎత్తడం లేదు. శుక్రవారం నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్న క్రమంలో అన్నదాతలకు ఇచ్చిన హామీలపై అంతటా చర్చ జరుగుతోంది.
గత ప్రభుత్వంలో రూ.1,830 కోట్ల పెట్టుబడి సాయం
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో వరితో పాటు వాణిజ్య పంటలు ఆక్వా, మత్స్య సాగు అధికంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉన్న ఆయిల్‌పామ్, కోకో, పొగాకు వంటి వాణిజ్య పంటలు పండిస్తున్నారు. పూర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఇక్కడ వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతుభరోసా పథకం కింద జిల్లాలో 2,35,847 మంది రైతులకు రూ.1,830.24 కోట్ల పెట్టుబడి సాయం కింద అందించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్నా అన్నదాత సుఖీభవ పథకం అమలు కాని పరిస్థితి.
రొయ్య ‘వెల’ విల
జిల్లాలోనే ఆక్వా సాగు సుమారు 2.59 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉంది. రాష్ట్రంలో అత్యధిక సాగు జరిగే జిల్లాగా ఉమ్మడి పశ్చిమ నిలిచింది. ఏటా 3 లక్షల టన్నుల రొయ్యల దిగుబడి ఉంది. ఆక్వా పరిశ్రమకు అనుబంధంగా 40కు పైగా ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఇతర పరిశ్రమలు ఉన్నాయి. అమెరికా పన్నుల ఆంక్షలు సాకుగా చూపించి వ్యాపారులు రొయ్యల ధరలు తగ్గించారు. 100 కౌంట్ కిలో రూ.235 ఉండగా రూ.40 తగ్గించి కొంటున్నారు. నెల క్రితం 100 కౌంట్ రూ.260 పలకగా ప్రస్తుతం రూ.190కి చేరింది. దీంతో టన్నుకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు నష్టపోతున్నామంటూ ఆక్వా రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పాలకొల్లులో రాస్తారోకో నిర్వహించారు. వ్యాపారుల సిండికేట్‌తో ధరలు పతనమవుతున్నాయని ప్రభుత్వం జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలంటూ పాలకొల్లు, ఆచంట, నరసాపురం నియోజకవర్గాల్లో జూన్ నుంచి ఆక్వా క్రాప్ హాలిడేకు పిలుపునిచ్చారు. ఇదే బాటలో మిగిలిన నియోజకవర్గాల్లో రైతులు సన్నద్ధమవుతున్నారు. ఆక్వా రైతుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన అప్సడా పూర్తిగా సమస్యలను విస్మరించడంతో పాటు షెడ్యూల్ ప్రకారం జిల్లాలో జరగాల్సిన రైతుల సదస్సులను గాలికి వదిలేసింది.
సంక్షోభంలో సాగు
సంక్షోభంలో సాగు
సంక్షోభంలో సాగు


