చెరువు గట్టుపై చెట్లు అమ్మేశారని ఫిర్యాదు
ద్వారకాతిరుమల: మండలంలోని తిరుమలంపాలెంలో నారప్ప చెరువు గట్టుపై ఉన్న ఎన్నో ఏళ్ల నాటి చెట్లను కొందరు అక్రమార్కులు నరికివేసి, అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. దీనిపై భీమడోలుకు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త కొత్తపల్లి చంద్రమౌళి గురువారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక నారప్ప చెరువు గట్టుపై ఉన్న దశాబ్దాల కాలం నాటి 15 చెట్లను కొందరు వ్యక్తులు వారం రోజుల క్రితం అక్రమంగా నరికివేసి, పంగిడిగూడేనికి చెందిన ఒక వ్యక్తికి రూ. 2.80 లక్షలకు విక్రయించినట్టు చంద్రమౌళి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీ అధికారులకు, నీటి సంఘం అద్యక్షుడికి తెలిసే జరిగిందని ఆరోపించారు. దీనిపై పంచాయితీ కార్యదర్శి నాగదేవిని వివరణ కోరగా ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్టు చెప్పారు. చెట్లు నరికి చాలా రోజులు అయినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయని, ఆరు చెట్టు కొమ్మలు మాత్రమే అక్కడ ఉన్నట్టు గుర్తించామన్నారు. దీనిపై స్థానిక పోలీస్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.


