వరి నేలవాలి.. రైతులు విలవిల్లాడి
● ఈదురుగాలులతో బెంబేలు
● వర్షంతో తడిసిన ధాన్యం
గణపవరం/ఆకివీడు: వాతావరణం రైతులను కలవరపెడుతోంది. రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో మబ్బులు కమ్మి ఈదురుగాలులు వీస్తూ చిరుజల్లులు పడుతున్నాయి. అయితే గురువారం రాత్రి భారీ వర్షం కురవడంతో కోతలకు సిద్ధమైన వరి చేలు నేలనంటాయి. గణపవరం మండలంలో సుమారు 14 వేల ఎకరాల్లో రబీ పంట వేయగా ఇప్పటికే 2 వేల ఎకరాల్లో మాసూళ్లు పూర్తయ్యాయి. 25 శాతం పంట కోత దశలో, మిగిలిన పైరు కోతకు సిద్ధంగా ఉంది. ఈ దశలో వర్షాలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నేలవాలిన పైరును శుక్రవారం రైతులు నిలబెట్టి కట్టలు కట్టారు. చేలల్లో చేరిన నీటిని బయటకు తరలిస్తున్నారు. కోతలు పూర్తయి ధాన్యాన్ని రోడ్ల మీదికి చేర్చిన రైతులు ఎండ బెట్టుకుంటున్నారు. ధాన్యం రాశులు తడవకుండా బరకాలు, టార్పాలిన్‌లు కప్పి కాపాడుకుంటున్నారు. నె లాఖరు వరకూ వాతావరణం అనుకూలిస్తే గ ట్టెక్కుతామని రైతులు అంటున్నారు. ఆకివీడు, భీమడోలు తదితర మండలాల్లో తడిసిన, యంత్రాలతో కోసిన ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు.


