టోల్‌ప్లాజా వద్ద జనసేన నేత దౌర్జన్యం
సాక్షి టాస్క్‌ఫోర్సు: ఉంగుటూరు మండలం జనసేన నేత స్థానిక టోల్‌ప్లాజా వద్ద తన అనుచరులతో దౌర్జన్యానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి లభించిన కారేటి జ్యోతి భర్త అయ్యప్ప తనకు చెందిన లిక్కర్ మినీ లారీని టోలు లేకుండా పంపమని ప్లాజా నిర్వాహకులను కోరారు. యెల్లో బోర్డు ఉంటే కుదరదు అని చెప్పగా తన అనుచరులు సుమారు 15 మందితో వచ్చి దౌర్జన్యంగా గేటు తీసేసి వాహనాన్ని పంపించారు. టోలు సిబ్బందిని ఇష్టం వచ్చినట్లు తిట్టి దౌర్జన్యం చేసినట్లు సమాచారం. దీంతో టోలు ప్లాజా సిబ్బంది చేబ్రోలు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం ఎమ్మెల్యే ధర్మరాజు దృష్టికి వెళ్ళినట్లు సమాచారం.
కాలువలో వ్యక్తి మృతదేహం లభ్యం
అత్తిలి: గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం అత్తిలి కాలువలో ఆదివారం కొట్టుకొచ్చింది. బల్లిపాడు శివారు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహంపై ఎలాంటి దుస్తులు లేకపోవడంతో కాలువలోకి స్నానానికి దిగి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని అత్తిలి పోలీసులు బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు 60 ఏళ్లు ఉంటుందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పి.ప్రేమరాజు చెప్పారు.
బ్రహ్మోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ
భీమవరం (ప్రకాశంచౌక్): హౌసింగ్ బోర్డు కాలనీలో శ్రీపద్మావతి వేంకటేశ్వరస్వామి మందిర 14వ వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాల బ్రోచర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు, కల్యాణం, రథోత్సవం, వైభవోత్సవం, ఊరేగింపు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని మందిర అధ్యక్షుడు కంతేటి వెంకటరాజు తెలిపారు. కార్యక్రమంలో మందిర సభ్యులు పాల్గొన్నారు.
టోల్‌ప్లాజా వద్ద జనసేన నేత దౌర్జన్యం


