వివాదాస్పదంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
పెనుమంట్ర: నత్తారామేశ్వరం గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం వివాదస్పదంగా మారింది. ఇక్కడ పాత చిన్న విగ్రహం స్ధానంలో పూర్తి విగ్రహం ఏర్పాటు చేసే విషయంలో గందరగోళం నెలకొంది. నూతన విగ్రహ ఏర్పాటుకు దళిత సంఘాల నేతలు కొన్నిరోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటివరకు అధికారులు ఎటువంటి అధికారిక ఉత్తర్వులు ఇవ్వకపోవడంపై దళితులు నిరసన తెలిపారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైటాయించి నిరసన ప్రదర్శన చేశారు. కొందరు నాయకులు ఒత్తిడిలకు తలొగ్గి అధికారులు ఉద్దేశపూర్వకంగానే విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. అనంతరం రోడ్డుపై రాకపోకలు నిలుపుదల చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. దీంతో పెనుమంట్ర ఎస్సై కె స్వామి జోక్యం చేసుకుని నాయకులకు నచ్చచెప్పారు. కొద్దిసేపు తర్జనభర్జనల అనంతరం ఎస్సై సమక్షంలో తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ కేవీవీ సుబ్బారావుకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం పెనుమంట్రలోని అంబేద్కర్ సెంటర్‌లో దళిత సంఘాల నాయకులు మరోసారి నిరసనకు దిగారు. అక్కడ కూడా ఎస్సై జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో నిష్క్రమించారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వచ్చి ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. కాగా దళితులు ఎట్టకేలకు తాము అనుకున్న విగ్రహం కాకుండా మరో విగ్రహాన్ని తీసుకువచ్చి పీఠంపై నెలకొల్పి ఆవిష్కరించారు.
వివాదాస్పదంగా అంబేడ్కర్ విగ్రహావిష్కరణ


