తృటిలో తప్పిన ముప్పు
యలమంచిలి: మండలంలోని అడవిపాలెం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని ధ్వజ స్తంభం ఆదివారం రాత్రి భారీ ఈదురుగాలులకు నేలకొరిగింది. ధ్వజ స్తంభం అడుగు భాగంలో చెక్క పొట్టుగా రాలడం వల్లే నేలకొరిగిందని భావిస్తున్నారు. ధ్వజ స్తంభం కూలిన శబ్దానికి స్థానికులు భయంతో పరుగులు తీశారు. ధ్వజస్తంభం పక్కనే ఉన్న రైతు భవనంపై పడడంతో ఏ ప్రమాదమూ జరగలేదు. 42 అడుగుల ధ్వజస్తంభాన్ని గ్రామస్తుల సహకారంతో నాలుగేళ్ల క్రితం ప్రతిష్ఠించారు.
నేడు ఆక్వా రైతుల సమావేశం
భీమవరం: సీపీఎం ఆధ్వర్యంలో భీమవరం పట్టణం చాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో మంగళవారం ఆక్వా రైతులు సదస్సు నిర్వహిస్తున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్‌వీ గోపాలన్ సోమవారం చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వలన ఆక్వా రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని ఈ నేపథ్యంలో రైతులు, ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని అన్నారు. ఆక్వా సమస్యల నుంచి ఆక్వా రైతాంగాన్ని ఏ విధంగా కాపాడుకోవచ్చో ఈ సదస్సులో వివరిస్తారని సదస్సుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.బలరాం హాజరవుతారని గోపాలన్ చెప్పారు. ఉదయం 10 గంటలకు ప్రారంభయ్యే సదస్సులో ఆక్వా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
21 నుంచి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
భీమవరం: పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీపద్మావతి వేంకటేశ్వరస్వామి 14వ వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాల బ్రోచర్‌ను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు శ్రీవారి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. దీనిలో భాగంగా కల్యాణం, రథోత్సవం, వైభవోత్సవం, ఊరేగింపు, ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో కుక్కల బాల, జీవీఐటీ అప్పారావు, చెనమల్ల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, పత్తి హరివర్థన్, యర్రంశెట్టి శివకృష్ణ, ముచ్చకర్ల సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.
తృటిలో తప్పిన ముప్పు


