‘సూపర్ సిక్స్’ అమలుకు ప్రభుత్వంపై ఉద్యమించాలి
బుట్టాయగూడెం: ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజలను మభ్య పెడుతున్న కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఉద్యమించాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పిలుపునిచ్చారు. జీలుగుమిల్లి మండంలో వైఎస్సార్‌సీపీ అనుబంధ పదవులు పొందిన నాయకులు మంగళవారం రాత్రి బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో బాలరాజు గృహంలో కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త తెల్లం రాజ్యలక్ష్మిలకు నాయకులు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు గడిచినా ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా అవి ఆచరణకు రావడం లేదన్నారు. అదేవిధంగా మహిళల కోసం ఏర్పాటు చేస్తామన్న ఉచిత బస్సు ఊసే ఎత్తడంలేదని అన్నారు. రైతులకు రైతు భరోసా పథకం లేక ఖరీఫ్, రబీ సీజన్‌లో కూడా నానా కష్టాలు పడుతూ వ్యవసాయం చేశారని అన్నారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం పట్టించుకోవడంలేదని విమర్శించారు. తల్లికి వందనం ఎప్పడిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని, అలాగే వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరిగేటట్లు చేశారని, రాష్ట్రంలో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరికో బెల్టుషాపు పెట్టి మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చందా ప్రసాద్, జిల్లా కార్యాచరణ కార్యదర్శి బోదా శ్రీనివాసరెడ్డి, క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర సెక్రటరీ బూరుగు ఫ్రెడరిక్ ప్రేమ్‌కుమార్, నాయకులు సున్నం సురేష్, చిట్టిబొమ్మ శ్రీను, కొప్పుల సత్యనారాయణ, ఉప్పల రాంపండు, రంగుల రమేష్, వెంకట్, ఆకుల రవి, బొంతు వెంకట్, చిన్నరాముడు, వంకా రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు


