చిరుద్యోగులపై కూటమి పంజా
ఏలూరు(మెట్రో): నమ్మిన వారిని నిలువున ముంచేలా, చిరుద్యోగుల కడుపుకొట్టేలా కూటమి నేతల చర్యలున్నాయి. అధికారంలోకి వచ్చే వరకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి.. ఆచరణలో మాత్రం మొండిచేయి చూపుతున్నారు. ఒక్కొక్క శాఖలో కూటమి తమ్ముళ్లు తమ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా వీరి కన్ను చిరుద్యోగులైన వీవోఏలపై పడింది. ఏళ్ల తరబడి వీవోఏలుగా పనిచేస్తున్న వారిని తొలగించి వారి స్థానంలో తమ అనుయాయులను నియమించుకునేందుకు పావులు కదుపుతున్నారు. వీవోఏలను ఒత్తిళ్లకు గురిచేస్తూ, వారే తప్పుకునేలా వ్యవహరిస్తున్నాయి. ఏం చేయాలో తెలియని స్థితిలో వీవోఏలు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం ప్రతీ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. దీంతో ప్రజలతో పాటు అధికారులు, ఆయా విభాగాల సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. తమ పార్టీలకు మద్దతుగా ఉండే వారిని నియమించాలనే లక్ష్యంతో విధుల్లో ఉన్న వారిని వేధింపులకు గురిచేస్తున్నారు. చివరకు రాజీనామాలు చేసే స్థితికి తీసుకొస్తున్నారు.
అనుకూలంగా ఉన్నవారిని నియమించుకునేలా..
పొదుపు సంఘాలను సమన్వయం చేసేలా, స్థానికంగా ఉండే గ్రామాల్లో ఉన్న పొదుపు సంఘాల తీర్మానం ద్వారా ఒక వ్యక్తిని వీవోఏగా నియమించుకుంటారు. తీర్మానం కాపీని ఏపీఎంకు పంపి, సదరు వీవోఏ పేరును ఆన్‌లైన్ చేస్తారు. వీవోఏ ప్రభుత్వం, సంఘాల మధ్య వారధిగా ఉంటూ సంఘాల అభివృద్ధికి సాయం చేస్తుంటారు. వీరి నియామకంలో అధికారులు, ప్రజా ప్రతినిధులకు సంబంధం ఉండదు. వీవోఏలకు ప్రస్తుతం రూ.8 వేలు వేతనం రావడంతో కూటమి నాయకులు ఈ పోస్టుపై కన్నేశారు. తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను నియమించుకునే క్రమంలో ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు.
ఏలూరు జిల్లాలో ఇలా..
ప్రస్తుతం ఏలూరు జిల్లా వ్యాప్తంగా 42,343 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. గ్రామ సంఘాలు 1353 ఉండగా, మొత్తం సంఘాల్లో 4,33,290 మంది సభ్యులు ఉన్నారు. వీరందరినీ సమన్వయ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 12,062 మంది వీవోఏలు ఉన్నారు. జిల్లాలో 42 మందిని తొలగించి వీరి స్థానంలో కూటమి నేతలకు అనుకూలంగా ఉండే 42 మందిని కొత్తగా నియమించారు. ఈ ప్రక్రియను కొనసాగించి ఉన్నవారిలో సగం మందిని తొలగించి అనుకూలంగా ఉన్నవారిని నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇప్పటికే 42 మంది వీవోఏల తొలగింపు
జిల్లాలో సగం మందికి పైగా తొలగించడమే లక్ష్యం!


