బాబు పాలనే.. అయ్య బాబోయ్
కొయ్యలగూడెం: బాబు పాలన అంటేనే అయ్యబాబోయ్ అనే పరిస్థితి ప్రజల నోళ్లలో పునరావృతం అవుతోందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. బుధవారం కొయ్యలగూడెంలో ఆయన పలనాడు రైతు ప్రతినిధులను కలుసుకున్న సందర్భంగా మాట్లాడారు. పలనాడు జిల్లా రైతు ప్రతినిధులు, మాజీ సొసైటీ అధ్యక్షుడు నల్లపాటి రామయ్య నేతృత్వంలో బాలరాజును కలుసుకుని తమ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సాధక, బాధలు గురించి వివరించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళుతూ వచ్చిన వీరు మిర్చి, పత్తి, టొబాకో రైతుల సంక్షేమ పరిస్థితి గురించి చర్చించారు. చంద్రబాబు నాయుడు పాలనలో రైతులు ఏనాడు సుభిక్షంగా లేరని ఇప్పుడు కూడా ఆయన పాలన ఎప్పుడు ముగుస్తుందా అని తమ ప్రాంత రైతులతో సహా ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. రాయలసీమలోని రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని, సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి యూరప్ పర్యటనలతో గడుపుతున్నారని విమర్శించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి అయితే కేవలం ఇంకా సినీ ఆర్టిస్టు మాదిరిగానే నటనతో జీవిస్తున్నారని అన్నారు. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్ష సాధింపు చర్యలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారని విమర్శించారు. పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు మేకల అన్నవరం, వైఎస్సార్ సీపీ నాయకులు విగ్గిన రామకృష్ణ, చింతలపూడి కిషోర్, రాఘవరాజు సాయి కృష్ణ, చవల నాగేశ్వరరావు, చవాకులు సూరిబాబు, నారా సుధీర్, తదితరులు పాల్గొన్నారు.
మద్యం వ్యాన్ బోల్తా
పోలవరం రూరల్: మద్యం సీసాల లోడుతో వస్తున్న వ్యాన్ ప్రమాదవశాత్తు బోల్తా పడి మద్యం సీసాలు రోడ్డుపై పడ్డాయి. రాజమహేంద్రవరం జిల్లాలోని డిపో నుంచి పోలవరం మద్యం దుకాణానికి తరలిస్తున్న వ్యాన్ కొత్తపట్టిసీమ, పాత పట్టిసీమ మధ్యలో బుధవారం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో తీసుకువస్తున్న సుమారు రూ.7 లక్షల విలువైన మద్యం సీసాలు నేలపాలయ్యాయి. వ్యాన్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం వ్యాన్ తిరగబడిన సమాచారం మద్యం షాపు యజమానికి అందడంతో హుటాహుటిన సిబ్బంది అక్కడికి చేరుకుని నేలపై పడ్డ మద్యం సీసాలను ఒబ్బిడి చేసుకున్నారు.
బాబు పాలనే.. అయ్య బాబోయ్


