ముస్లిం నేతల రిలే దీక్ష
కై కలూరు: వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దీనిని వ్యతిరేకించాలని పలువురు ముస్లిం సోదరులు చెప్పారు. వక్ఫ్ సవరణ చట్టం – 2025ని నిరసిస్తూ కై కలూరు పెద్ద మసీదు వద్ద ముస్లిం నాయకుడు షేక్ షాబుద్దిన్ ఆధ్వర్యంలో ఒక రోజు రిలే దీక్షను బుధవారం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు దీక్ష సాగింది. ముస్లింల మనోభావాలు దెబ్బతిసే చట్టాన్ని రద్దు చేయడానికి చేస్తున్న నిరసనలలో ప్రజాస్వామ్య, లౌకికవాదులందరూ మద్దతుగా రావాలన్నారు. ముస్లిం నాయకులు మహమ్మద్ గాలీబ్ బాబు, షేక్ ఆరిఫ్, అబ్దుల్ హమీద్, అబ్దుల్ అలీమ్, మహమ్మద్ రఫీ, అమీర్, షేక్ రఫీ, అబ్దుల్ హసీబా, ఫిర్దోస్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, ఆసిఫ్, జహంగీర్, సుల్తాన్, భాష, మున్నా తదితరులు పాల్గొన్నారు.
ఉచిత గ్యాస్ సిలిండర్‌కు బుకింగ్ ప్రారంభం
ఏలూరు(మెట్రో): దీపం–2 కింద రెండో విడత ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్ ప్రక్రియలో ఏప్రిల్ 1 నుంచి జూలై 31 వరకు రెండో సిలిండర్‌ను బుక్ చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. ప్రస్తుతం నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నారన్నారు. మొదటి విడత 2024 నవంబర్‌లో మొదలై ఈ ఏడాది మార్చి 31తో ముగిసిందన్నారు. ప్రస్తుతం రెండో విడత ఏప్రిల్ 1 నుంచి మొదలైందని, ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఉచితంగా ఇస్తారన్నారు. దీనికి సంబంధించి ఏమైనా అనుమానాలుంటే 1967 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.
శానిటరీ వర్కర్‌పై దౌర్జన్యం
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటరీ వర్కర్‌పై ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తిస్తూ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. దీనిపై శానిటరీ వర్కర్లు ఆందోళనకు దిగారు. యూనియన్ నాయకుడు కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు.
తాగునీటి సమస్యపై సమీక్ష
ఏలూరు(మెట్రో): వేసవిలో తాగునీటి కొరత సమస్య ఎదుర్కొంటున్న గ్రామాల పరిస్థితి, పరిష్కారానికి చర్యలపై జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈతో బుధవారం సమీక్షించారు. జెడ్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ సమస్య పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఎస్‌ఈ త్రినాథ్‌బాబును ఆదేశించారు. చెట్టున్నపాడు, అగడాలలంక, మల్లవరం గ్రామాలకు తాగునీటి సమస్యను పరిష్కరించామని త్రినాథ్‌బాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పునరావాస కాలనీలు, వర్షాభావ ప్రాంతాల్లో నీటి కొరతను గుర్తించామని, అక్కడ తక్షణం కొత్త బోర్లు తవ్వించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
25 నుంచి కొంతేరులో నాటికల పోటీలు
యలమంచిలి: యూత్ క్లబ్ నాటక పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజులపాటు కొంతేరు పులపర్తి వీరాస్వామి యూత్ క్లబ్ కళామందిరంలో 43వ రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నట్లు క్లబ్ చైర్మన్ అంబటి మురళీకృష్ణ, పాలకవర్గ సభ్యులు తెలిపారు. స్థానిక కళామందిరంలో బుధవారం సమావేశమైన సభ్యులు నాటిక పోటీల బ్రోచర్ విడుదల చేశారు. కార్యక్రమంలో క్లబ్ కార్య దర్శి గంటా ముత్యాలరావు, బోణం రవిబాబు, అంబటి నవీన్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.
పాలిసెట్‌కు ఉచిత శిక్షణ
పెంటపాడు: ఈ నెల 30న జరగనున్న పాలిసెట్ ప్రవేశపరీక్షకు ఆయా పాలిటెక్నిక్ కళాశాలల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు గూడెం పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డి. ఫణీంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 90102 22178, 94901 04336 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలన్నారు.
ముస్లిం నేతల రిలే దీక్ష
ముస్లిం నేతల రిలే దీక్ష


