రైతులను వంచించి.. ప్రాధాన్యం తగ్గించి..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో పండించే చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. ధాన్యం రైతులు ఎక్కడా ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.. రైతుల సౌకర్యం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం.. ప్రతి చోటా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.. రైతు ఎంత పండిస్తే అంతా సేకరించి 24 గంటల్లోనే ఖాతాల్లోకి నగదు జమచేస్తాం.. ఇవి జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మొదలు జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి వరకూ ప్రతి సమావేశంలో చెప్పిన మాటలు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వచ్చిన దిగుబడుల్లో 62 శాతం మాత్రమే ధాన్యం కొనుగోలును లక్ష్యంగా నిర్దేశించారు. అందులోనూ పీఆర్ 126, ఎస్–10 రకాలపై సరికొత్త ఆంక్షలు తీసుకువచ్చారు. తేమ శాతం పేరుతో యథావిధిగా దోపిడీ, చిరిగిన గోనె సంచులు అవి కూడా నామమాత్రంగా అందుబాటులో ఉన్న పరిస్థితి.
ఇవేం టార్గెట్‌లు
ఏలూరు జిల్లాలో 3.53 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా కాగా ముందుగా లక్షన్నర టన్నుల సేకరణ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. స్థానికంగా వినతులు రావడంతో ఈ లక్ష్యాన్ని 2 లక్షల టన్నులకు పెంచింది. దీంతో అనివార్యంగా రైతులు మిగిలిన 1.53 లక్షల టన్నులను దళారులకు విక్రయించాల్సిందే. జిల్లాలో ఇప్పటివరకు 45,128 టన్నుల కొనుగోళ్లు పూర్తయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లాలో 9.25 లక్షల టన్నుల అంచనా కాగా 6 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు ప్రకటించింది. ఇక్కడ కూడా మిగిలిన 3.25 లక్షల టన్నులను మధ్యవర్తులకు విక్రయించాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి 25 వేల ఎకరాల్లో మాసూళ్లు పూర్తికాగా వచ్చే వారం నుంచి ప్రభుత్వ కొనుగోళ్లు జోరందుకునే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో దళారులు వచ్చి ఇక్కడ ధాన్యం కొనుగోలు చేస్తున్నారు.
కొనుగోళ్లు మొదలు
ఉమ్మడి పశ్చిమగోదావరిలో రబీ సాగు పూర్తయి ధాన్యం కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఏలూ రు జిల్లాలో 77,466 ఎకరాల విస్తీర్ణంలో 3.53 లక్షల టన్నులు దిగుబడి అంచనా కాగా 118 రైతు సేవా కేంద్రాలు, 65 ప్రాథమిక సహకార సొసైటీల ద్వారా ఈనెల 2 నుంచి కొనుగోళ్లు ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2,19,064 ఎకరాల్లో 9.25 లక్షల టన్నులు దిగుబడి అంచనా వేసి 365 రైతు సేవా కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 206 రైస్ మిల్లులకు ఇప్పటికే అనుమతులు కూడా ఇచ్చారు.
ని‘బంధనాలు’
కొనుగోళ్లల్లో సరికొత్త నిబంధనలు విధించడం, దిగుబడి కంటే తక్కువ మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో క్షేత్రస్థాయిలో సమస్యలు మొదలయ్యాయి. గురువారం జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు కొనుగోళ్లలో ఇబ్బందులున్నాయని, కొన్ని రకాలు కొనుగోలు చేయడం లేదని, ఒత్తిడితో కొనుగోలు చేసినా అతి తక్కువ మాత్రమే కొనడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు.
తేమ శాతం సాకు
రబీ సీజన్‌లో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో దిగుబడి అధికంగా వచ్చే పీఆర్–126 రకాన్ని ఎక్కువ సాగు చేశారు. ఎకరాకు సగటున 60 నుంచి 70 బస్తాల దిగుబడి వస్తుండటంతో తేమ శాతం సాకుగా చూపి ఎకరాకు 40 నుంచి 50 బస్తాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఎస్–10 రకం గింజ సరిగ్గా లేదనే కారణంతో కొనుగోలుకు తిరస్కరిస్తున్నారు. దీంతో రైతు లు పండించిన పంటలో సగానికి మించి ప్రభుత్వానికి విక్రయించలేని పరిస్థితి ఉండటంతో దళారులను తప్పనిసరిగా ఆశ్రయిస్తున్నారు.
ఏలూరు జిల్లా
వరి సాగు 77,466 ఎకరాలు
దిగుబడి అంచనా 3.53 లక్షల టన్నులు
కొనుగోలు లక్ష్యం 2 లక్షల టన్నులు
ధాన్యం కొనుగోలు
కేంద్రాలు 183
పశ్చిమగోదావరి జిల్లా
వరి సాగు 2,19,064 ఎకరాలు
దిగుబడి అంచనా 9.25 లక్షల టన్నులు
కొనుగోలు లక్ష్యం 6 లక్షల టన్నులు
ధాన్యం కొనుగోలు
కేంద్రాలు 365
కొనుగోల్ మాయ
రబీ ధాన్యం సేకరణలో ఆంక్షలు
దిగుబడుల కంటే తక్కువగా కొనుగోలు లక్ష్యాలు
ఉమ్మడి జిల్లాలో 62 శాతం మాత్రమే సేకరణ
పీఆర్ 126 రకం కొనుగోలుకు షరతులు
ప్రభుత్వ ఆర్భాటానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి
ఇష్టారాజ్యంగా దళారుల కొనుగోలు
కూటమి ప్రభుత్వంలో ధాన్యం కొనుగోళ్లలో దళారులది ఇష్టారాజ్యంగా మారింది. వైఎస్సార్‌సీపీ పాలనలో నూరు శాతం ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో దళారులకు అడ్డకట్ట పడింది. కూటమి పాలనలో రైతుసేవా కేంద్రాల ద్వారా నచ్చిన మిల్లులో విక్రయించుకోవచ్చని, ఎక్కడైనా అమ్మవచ్చని ప్రభుత్వం ప్రకటించడంతో దళారుల కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. క్వింటాల్ ఏ–గ్రేడ్ రకానికి రూ.2,320, కామన్ వైరెటీకి రూ.2,300 మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన దళారులు పొలాల్లోనే 75 కేజీల బస్తాను రూ.1,300 నుంచి రూ.1,500 ధరతో కొనుగోలు చేస్తున్నారు.
రైతులను వంచించి.. ప్రాధాన్యం తగ్గించి..


