
వాచ్‌మేనే వైద్యుడు
పెనుగొండ: అది 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్.. జనరల్ ఫిజీషియన్ తప్ప మిగిలిన అన్ని విభాగాల్లోనూ వైద్యులు ఉన్నారు. అయితే ఆదివారం, పండుగ రోజుల్లో వైద్యులు అందుబాటులో ఉండరు. నర్సులు కనీసం ప్రథమ చికిత్స కూడా చేయరు. దీంతో బాధితులకు వాచ్‌మేన్ వైద్యం అందిస్తుంటారు. ఇది పెనుగొండ సీహెచ్‌సీలో పరిస్థితి. వివరాల్లోకి వెళితే.. ములపర్రులో ఆదివారం బాలుడు శ్రీనివాస్ సైకిల్‌పై వెళుతుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో తలకు గాయమైంది. దీంతో శ్రీనివాస్ ను మేనమామ ప్రదీప్ మోటార్‌సైకిల్‌పై పెనుగొండ సీహెచ్‌సీకి తీసుకువచ్చారు. ఇక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోగా కనీసం నర్సులు బాలుడిని పరీక్షించి ప్రథమ చికిత్స అందించే పరిస్థితి లేకపోవడంతో అవాక్కయ్యారు. నర్సులు కనీసం చూడకపోవడంతో వాచ్‌మేన్ వచ్చి గాయపడిన బాలుడి తలను శుభ్రం చేసి బ్యాండేజ్ వేశారు. నర్సులు బాలుడిని కనీసం ముట్టుకోకుండా మందులు ఇచ్చి పంపించడం విశేషం. ఇది దారుణమంటూ బాలుడి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. వాచ్‌మేన్ వైద్యం చేయడం సోషల్ మీడియాలో వైరల్ కా వడంతో విమర్శలు వెల్లువెత్తాయి.