
కళావిహీనం.. ఆటపాక కేంద్రం
కై కలూరు: రాష్ట్రంలో పక్షి ప్రేమికుల స్వర్గధామంగా ఉన్న ఆటపాక పక్షుల విహార కేంద్రం కళావిహీనంగా మారింది. తీవ్ర నీటి కొరతతో పక్షులు అల్లాడుతున్నాయి. ఆహారం, ఆవాసం కోసం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఏటా నీటి కొరత ఏర్పడుతుందని తెలిసినా ముందస్తు చర్యలు చేపట్టడంలో అటవీ అధికారులు అలసత్వం వహిస్తున్నారని పర్యావరణ ప్రేమికులు మండిపడుతున్నారు. ఆటపాకలో బోటు షికారు నిలిచిపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు నిరుత్సాహంతో తిరిగి వెళ్తున్నారు.
ప్రపంచంలోనే అరుదైన పెలికాన్(గూడబాతు) పక్షులు ఆటపాక పక్షుల కేంద్రానికి సంతానోత్పత్తి కోసం వలస వస్తాయి. దీంతో ఈ కేంద్రాన్ని పెలికాన్ ప్యారడైజ్‌గా పిలుస్తారు. పక్షుల విహారానికి 286 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువు ఇక్కడ అందుబాటులో ఉంది. విదేశీ పక్షుల గూడు నిమిత్తం, సంతానోత్పత్తికి వీలుగా 156 కృత్రిమ ఇనుప స్టాండ్లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. కొల్లేరులో సాధారణంగా పెలికాన్, పెయింటెడ్ స్టోక్, టీల్స్, నైట్ హెరాన్, కింగ్ ఫిషర్స్, గ్లోబీ ఐబీస్, స్టిల్ట్, షావలర్స్, స్పూన్ బిల్స్ వంటి దాదాపు 189 రకాల పక్షులు విహరిస్తాయని అంచనా. పక్షుల సంతానోత్పత్తికి ఆటపాక పక్షుల కేంద్రం అనుకూలంగా ఉండటంతో ఎక్కువగా పక్షులు విచ్చేస్తున్నాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కేంద్రాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలు ప్రజల నుంచి సర్వత్రా వినిపిస్తున్నాయి.
గట్ల ఎత్తు పెంచాలి
ఆటపాక పక్షుల కేంద్రంలో ప్రధానమైంది విహార చెరువు. కొల్లేరు ఆపరేషన్ తర్వాత ఈ ప్రాంతంలో తొలగించిన చెరువులన్నింటినీ ఒక్కటిగా చేయడంతో చెరువు విస్తీర్ణం మరింతగా పెరిగింది. సాధారణంగా చెరువులో 6 అడుగులు నీటిని నిల్వ చేసుకోవచ్చు. గట్లు బలహీనంగా ఉండటంతో 4 అడుగులకు మించడం లేదు. ఏప్రిల్, మే నెలల్లో చెరువు పూర్తిగా అడుగంటుతోంది. పక్షులు ఆహారంగా తీసుకునే చేపలు చనిపోతున్నాయి. చెరువు గట్ల ఎత్తు పెంచాలని ప్రతిపాదనలు పంపుతున్నా కార్యరూపం దాల్చడం లేదు. మే నెలలో ఏకంగా చెరువు బీటలు వారుతోంది. దీంతో పక్షులకు ఆహార కొరత ఏర్పడడంతో కొన్ని సందర్భాల్లో మరణాలు సంభవిస్తున్నాయి.
నీటి తరలింపులో జాప్యం
ఏటా పక్షుల కేంద్రం చెరువులో నీటిని నింపడం పెద్ద ప్రహసనంలా మారుతోంది. సమీప కోమటిలంక నాగరాజు డ్రెయిన్ నుంచి పక్షుల కేంద్రం చెరువుకు నీటిని నింపుతారు. వర్షాలు అధికంగా కురిస్తే డ్రెయిన్‌లో నీరు పెరుగుతుంది. ఆ సమయంలో తూములు తీసి చెరువుకు నీటిని పంపుతారు. ప్రస్తుతం నాగరాజు డ్రెయిన్ నీటిలో 8కిపైగా ఉప్పు శాతం ఉందని పరీక్షల్లో తేలింది. ఈ నీటిని నింపితే చెరువులో సహజసిద్ధంగా పెరిగిన చేపలు మరణిస్తాయి. ఈ కారణంతో నీటిని నింపడం లేదు. ఆటపాక గ్రామం పంట కాల్వ నుంచి నీటిని పైపుల ద్వారా నేరుగా పక్షుల కేంద్రం చెరువులోకి తరలించాలని ప్రతిపాదనలు చేస్తున్న ఆచరణ సాధ్యం కావడం లేదు. అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పక్షుల కేంద్రాన్ని స్వయంగా సందర్శించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు.
నీటి కోసం అల్లాడుతున్న పక్షులు
నిలిచిన బోటు షికారు
చెరువు నీటిని నింపడంలో అధికారులు విఫలం
ప్రతిపాదనలు పంపాం
ఆటపాక పక్షుల కేంద్రంలో చెరువు గట్ల ఎత్తు పెంచడానికి ప్రతిపాదనలు పంపించాం. కోమటిలంక సమీప గట్లను మరమ్మతులు చేయించాం. చెరువు విస్తీర్ణం అధికంగా ఉండటంతో పూర్తి స్థాయిలో నీటిని నింపడానికి సాధ్యసాధ్యాలను పరిశీస్తున్నారు. ప్రస్తుతం ఆటపాకలో నీరు అడుగంటింది. బోటు షికారు నిలిపేశాం. చెరువులో పక్షుల ఆహారానికి కొరత లేదు.
– ఎం.రంజిత్‌కుమార్, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, కై కలూరు.
వేసవికి ముందుగానే నీటిని నింపాలి
వేసవికి ముందుగానే అటవీ అధికారులు ఆటపాక పక్షుల చెరువులో నీటిని నింపాలి. ఆటపాక పంట కాల్వ నుంచి రామాలయం మీదుగా నేరుగా పక్షుల కేంద్రం చెరువుకు అండర్ గ్రౌండ్ పైపులైన్లు ఏర్పాటు చేయాలి. పోల్‌రాజ్ డ్రెయిన్(నాగరాజు కాల్వ) నుంచి వర్షాల సమయంలో నీటిని చెరువులో నింపేందుకు మరిన్ని లాకులను ఏర్పాటు చేయాలి.
– ఎల్‌ఎస్.భాస్కరరావు, ప్రజాస్వామ్య పరిరక్షణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

కళావిహీనం.. ఆటపాక కేంద్రం

కళావిహీనం.. ఆటపాక కేంద్రం

కళావిహీనం.. ఆటపాక కేంద్రం