ఆ సమయంలో ఫ్లూ వాక్సిన్‌ తీసుకుంటే ప్రమాదమా..? | 3 Reasons Why You Need The Flu Vaccine During Pregnancy? Read Full Story Inside | Sakshi
Sakshi News home page

ఆ సమయంలో ఫ్లూ వాక్సిన్‌ తీసుకుంటే ప్రమాదమా..?

Published Sun, Feb 2 2025 11:06 AM | Last Updated on Sun, Feb 2 2025 1:37 PM

3 Reasons Why You Need the Flu Vaccine During Pregnancy

నాకు ఇప్పుడు మూడోనెల. ఫ్లూ వాక్సిన్‌ తీసుకుంటే మంచిదని అన్నారు. కాని, ఇది ఏమైనా కడుపులోని బిడ్డకు ఎఫెక్ట్‌ చేస్తుందా? మా కజిన్స్‌ ఎవరూ దీనిని తీసుకోలేదు
– సుధీర, బెంగళూరు

గర్భవతులు అందరూ ఫ్లూ వాక్సిన్‌ తీసుకోవటం చాలా అవసరం. ఈ వాక్సిన్‌ మీకు, కడుపులోని బిడ్డకు మంచి చేస్తుంది. అందుకే ఈ రోజుల్లో డాక్టర్స్‌ సజెస్ట్‌ చేస్తున్నారు. మామూలు వారి కంటే గర్భం దాల్చిన మహిళల్లో ఫ్లూ త్వరగా వ్యాపిస్తుందని చాలా పరిశోధనల్లో తేలింది. అందుకే, గర్భవతులకు ఫ్లూ కాంప్లికేషన్స్‌ ఎక్కువ. ఇక చివరి మూడు నెలల్లో శిశువుకు కూడా ఫ్లూ సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుట్టిన బిడ్డకు ఫ్లూ వస్తే చాలా సమస్యలు వస్తాయి. అదే, తల్లికి వచ్చిన ఫ్లూ వలన బ్రోంకైటిస్, న్యూమోనియా వంటి శ్వాసకోశ సమస్యలు వస్తాయి. 

ఫలితంగా నెలలు నిండకుండానే ప్రసవం కావటం, పుట్టిన బిడ్డ తక్కువ బరువుతో ఉండటం జరుగుతుంది. ప్రెగ్నెన్సీలో ఫ్లూ వాక్సిన్‌ సురక్షితం అని చాలా పరిశోధనలు రుజువు చేశాయి. ఈ వాక్సిన్‌ని గర్భం దాల్చినట్లు నిర్ధారణ అయినప్పటి నుంచి ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరే వరకు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ వాక్సిన్‌  వలన శిశువుకు యాంటీబాడీస్‌ చేరుతాయి. దీనితో పుట్టిన వెంటనే కొన్ని నెలల వరకు శిశువుకు ఫ్లూ రాకుండా రక్షణ ఉంటుంది. ఈ వాక్సిన్‌ తీసుకున్నా బ్రెస్ట్‌ ఫీడింగ్‌ చేయవచ్చు. ముందు సంవత్సరం ఫ్లూ వాక్సిన్‌ తీసుకున్నా, ప్రెగ్నెన్సీలో మళ్లీ తీసుకోవాలి. ప్రతి సంవత్సరం ఫ్లూ వైరస్‌ స్ట్రెయిన్‌ మారుతుంటుంది. 

అందుకే, ప్రతి శీతకాలంలో సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ మధ్య తీసుకోవాలి. ఫ్లూ వాక్సిన్‌ తరువాత వాక్సిన్‌ వలన ఫ్లూ రాదు. వాక్సిన్‌లో లైవ్‌ వైరస్‌ ఉండదు. ఇంజెక్షన్‌ వేసిన ప్రాంతంలో కొంచెం మంటగా ఉంటుంది. ఒంటినొప్పులు రావచ్చు. ఈ వాక్సిన్‌ను వేరే వాక్సిన్‌తో కలిపి తీసుకోవచ్చు. ఫ్లూ వాక్సిన్‌ను సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ నెలల్లో, కోరింత దగ్గు వాక్సిన్‌ను గర్భం దాల్చిన 26 నుంచి 28 వారాల మధ్య తీసుకోవాలి. 

ప్రెగ్నెన్సీలో దగ్గు, జలుబు, ఆయాసం ఉంటే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఎంత త్వరగా మెడిసిన్స్‌ తీసుకుంటే అంత మంచిది. జ్వరం ఉంటే వెంటనే యాంటీబయోటిక్స్, కొంత మందికి యాంటీ వైరల్స్‌ కూడా ఇస్తాం. సత్వర చికిత్సతో తల్లికి, బిడ్డకి సమస్యలు రాకుండా నివారిస్తాం. అందుకే ఫ్లూ వాక్సిన్‌ చాలా ముఖ్యం. గర్భిణులు తప్పనిసరిగా చేయించుకోవాలి.  
భావన, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌, హైదరాబాద్‌ 

(చదవండి: ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక ఉద్యోగం ఇదే..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement