ఒకప్పుడు ఆయనకు ఉద్యోగం ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఈరోజు ఆయనే ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వైకల్యం శరీరానికే తప్ప కష్టపడే తత్వానికి కాదని నిరూపిస్తున్నారు 31 ఏళ్ల ప్రముఖ వ్యాపారవేత్త సుమిత్ అగర్వాల్. తాజాగా హైదరాబాద్‌లో ఫార్చ్యూన్ అకాడమీ నిర్వహించిన లెగసీ బిల్డింగ్ లైవ్ ప్రోగ్రామ్‌కు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి ఎన్నో అవమానాలు, ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నాను. పుట్టినప్పటి నుంచే నాకు సెరిబ్రల్ పాల్సీ అనే వ్యాధి ఉంది.
ఓ జ్యోతిష్యుడు నేను 33 ఏళ్లకు మించి బతకనని మా తల్లిదండ్రులకు చెప్పాడు. విచిత్రం ఏంటంటే.. అతను ఇప్పుడు బతికి లేడు. కానీ నేను మీ ముందు ఉన్నాను. వైకల్యంతో ఏం సాధిస్తావ్ అన్నవాళ్లకు దేశంలోనే MBAలో అగ్రస్థానంలో నిలిచి సమాధానం ఇచ్చాను. చాలామంది నువ్వు ఏం చేస్తావ్, ఏమీ చేయలేవు అని విమర్శిస్తారు. కానీ వాళ్లకు ఒకటి చెప్పాలనుకుంటున్నా.. నేను చేసి చూపిస్తాను. మీకు వీలైతే నన్ను ఆపండి. ఒకప్పుడు నా వైకల్యం వల్ల నాతో ఆడుకోవడానికి కూడా ఎవరూ వచ్చే వాళ్లు కాదు. దీంతో నా జీవితంలో నాకు ఫ్రెండ్స్ లేకుండా పోయారు. విద్యార్హత ఉన్నా జాబ్ ఇచ్చేవాళ్లు కాదు, కానీ ఇప్పుడు నేనే సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఎంతోమందికి ఉద్యోగాలు ఇస్తున్నాను.
సుమారు 500 మంది వికలాంగులకు ఉద్యోగం వచ్చేలా సహాయం చేశాను. గట్టిగా తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. మిమ్మల్ని మీరు నమ్మండి. సక్సెస్ అదే వస్తుంది. నాకు ఇప్పటివరకు నాలుగు శస్త్రచికిత్సలు జరిగాయి. దాదాపు 70% ఎలాంటి కదలికలు ఉండవు. ఇప్పటికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. అయినా అధైర్యపడకుండా అడుగు ముందుకు వేస్తున్నా.సరైన పేరెంటింగ్ నా జీవితాన్ని కాపాడింది అంటూ ఆయన పేర్కొన్నారు. కాగా బిజినెస్‌లో మెలకులు నేర్పించి మంచి ఆదాయ మార్గాలను అందించే లక్ష్యంగా ఫార్చ్యూన్ అకాడమీ ఏర్పాటైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment