హోమ్‌ క్రియేషన్స్‌.. ఇంటీరియర్‌ డెకరేషన్‌ టిప్స్‌ | 7 top tips to styling your home like youve hired an interior designer | Sakshi
Sakshi News home page

హోమ్‌ క్రియేషన్స్‌.. ఇంటీరియర్‌ డెకరేషన్‌ టిప్స్‌

Published Sun, Mar 20 2022 1:36 PM | Last Updated on Sun, Mar 20 2022 1:46 PM

7 top tips to styling your home like youve hired an interior designer - Sakshi

ఇంటిని డిజైన్‌ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో పూసల ఆభరణాలు ఒకటి. రంగురంగుల పూసలతో సాధారణంగా కనిపించే టేబుల్‌ని అందంగా అలంకరించవచ్చు. కిటికీలో నుంచి గదిలోకి పడే సూర్యకిరణాలకూ హంగులు అద్దవచ్చు. 

ఇంటీరియర్‌ డెకరేషన్‌కు చేర్చే సులువైన మార్గాలు..

టేబుల్‌ అలంకరణ
డైనింగ్‌ టేబుల్‌ పైన రంగుల పూసల గొలుసులను అలంకరించవచ్చు. హ్యాండ్‌ న్యాప్‌కిన్‌లకు లేదా గాజు గ్లాస్‌లకు చుడితే చాలు టేబుల్‌కి కొత్త హంగు చేరుతుంది. 

పూసల వేజ్‌
గ్లాస్‌ను ఫ్లవర్‌వేజ్‌గా తీర్చిదిద్దడంలో పూసలు కూడా దోహదపడతాయి. ఒకే రకరమైన రంగు, ఆకారం, కొలత గల పూసల గొలుసులను చుడితే మనం కోరుకున్న అందమైన వేజ్‌ కళ్ల ముందుంటుంది. గాజు బాటిళ్లను అల్యూమినియం తీగను చుట్టేటప్పుడు కొన్ని పెద్ద పూసలను కూడా గుచ్చి, హ్యాంగింగ్‌ వేజ్‌లను తయారుచేయవచ్చు. కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, నెమలి ఈకలను జోడిస్తే పూసల వేజ్‌  అందం మరింత పెరుగుతుంది.  

స్వరాలు పలికే కర్టెన్లు
పూసల గొలుసులను కర్టెన్లతో పాటు లేదంటే కర్టెన్‌గా వరసలు వరసలుగా వేలాడదీయడం ద్వారా కూడా ఇంటిని కళాత్మకంగా మార్చవచ్చు. అంతేకాదు లివింగ్‌రూమ్‌లో కొంత భాగాన్ని పార్టిషన్‌గా చేయాలనుకుంటే పూసల గొలుసుల కర్టెన్‌ను ఉపయోగించవచ్చు.  

పూసల ముడి
పూసల కర్టెన్‌ది ఒక అందమైతే పూసల గొలుసులను కర్టెన్‌ రాడ్‌ల చుట్టూ తిప్పి మరో అందాన్ని తీసుకురావచ్చు. అలాగే ప్లెయిన్‌ కర్టెన్‌కు కుచ్చులు పెడుతూ, రంగురంగు పూసల ఓ గట్టి గొలుసును మధ్యలో  జత చేర్చితే చాలు ఆ సోకు  సింప్లీసూపర్బ్‌ అనిపిస్తుంది.

కిరణాలకు పూసల హంగు
కిటికీల హంగును పెంచడానికి కొన్ని పూసల గొలుసులను వేలాడదీయవచ్చు. క్రిస్టల్‌ పూసల గొలుసును కిటికీ అలంకరణలో భాగం చేయడం వల్ల సూర్యకాంతి నేరుగా పడి, ఆ  కాంతి  గదికి మరింత అందాన్ని తీసుకొస్తుంది. కర్టెన్‌ అంచులకు కుట్టి, పూసలను వేలాడదీసినా బాగుంటుంది. 

టేబుల్‌ ల్యాంప్‌కు జిలుగులు
కొన్ని క్రిస్టల్స్, పూసల గొలుసులను గొడుగుగా ఉండే టేబుల్‌ ల్యాంప్‌ మీదుగా వేలాడదీయడం ద్వారా వినూత్న సోయగాన్ని ఆస్వాదించవచ్చు. అయితే  ల్యాంప్‌కు తగినట్టుగా పూసల గొలుసులను ఎంచుకోవాలి. 

పూసల ప్రతిబింబం
అద్దాలను మన ప్రతిబింబాన్ని చూసుకోవడానికే కాదు ఇంటి అలంకరణలోనూ ఉపయోగించుకోవచ్చు. గది అందాన్ని ఉత్తేజంగా మార్చడానికి వాల్‌ మిర్రర్‌కు పూసల గొలుసును జత చేయవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement