Interior Design
-
వీటిని చూశారంటే.. మంత్ర ముగ్ధులు అవక తప్పదు
సాధారణంగా మంచి మాటలు, మంత్రాలు, కొటేషన్స్‌ను బడులు, గుడులలో చూస్తుంటాం. వాటినిప్పుడు ఇళ్లల్లోనూ ప్లేస్ చేస్తున్నారు ఇంటీరియర్ డిజైనర్స్. ఎలాగంటే.. రీడింగ్ రూమ్ లేదా లివింగ్ రూమ్‌లో ఏదైనా ఒక గోడను ఎంపిక చేసుకుని.. సానుకూల ఆలోచనలను ప్రేరేపించే మంచి మాటలతో ఒక వాల్ పేపర్‌ను ఆ గోడ మీద అలంకరించవచ్చు. ఇది పెద్దల పెంపకాన్నీ.. పిల్లల ప్రవర్తననూ ప్రభావితం చేస్తుంది. ఆ గది వాతావరణాన్ని మారుస్తుంది. ఫొటో ఫ్రేమ్స్.. కోట్స్ లేదా చాంట్స్‌తో ఫొటో ఫ్రేమ్స్‌ను తయారుచేసుకోవచ్చు. లేదా మార్కెట్లో లభించే వాటిని ఎంపిక చేసుకోవచ్చు. వీటివల్ల ఆ గది హుందాగా కనపడుతుంది. పూజ గది.. ఇంట్లో పూజకు ప్రత్యేకంగా గది ఉంటే.. నచ్చిన శ్లోకాలతో దాన్ని డిజైన్ చేసుకోవచ్చు. లేదంటే అందమైన అక్షరాలతో కార్నర్ ప్లేస్‌లో గోడను తీర్చిదిద్దుకోవచ్చు. ఈ అలంకరణల వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇవి చదవండి: ఈ వేసవి ఒక డేంజర్ బెల్.. నిపుణుల సూచనలతో జాగ్రత్త! -
ఇంటి డెకరేషన్లో ఇవి పాటిస్తే... రాజసం ఉట్టిపడుతుంది
ఇల్లు రాజుల కోటలా తలపించాలన్నా.. మన సృజన కళగా కనిపించాలన్నా.. ఓల్డ్ స్టైల్ విండో ఫ్రేమ్స్‌ని ఫిక్స్ చేయాల్సిందే! గుజరాత్, రాజస్థాన్ కోట గోడలపై ఉండే కిటికీలను పోలిన ఈ ఫ్రేమ్స్, వాల్ హ్యాంగింగ్స్ ఇప్పుడు ఇంటి డెకార్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఫొటో ఫ్రేమ్ మోడల్ అందమైన ప్రకృతి దృశ్యాలు, ఇంట్లో వారి ఫొటోలు ఫ్రేమ్‌లో బంధించి గోడకు అలంకరించాలి. వాల్ విండో అయితే ఆ గదికి గంభీరమైన సొగసును ఇస్తుంది. వుడెన్ హ్యాంగింగ్ పాతకాలం నాటి విండో మోడల్స్‌లో కలపతో తయారైన హ్యాంగింగ్స్ కూడా లభిస్తున్నాయి. డిజైన్‌ను బట్టి ధరలు ఉంటున్నాయి. బ్రాస్ మెటీరియల్ వుడెన్ విండో ఫ్రేమ్స్ ప్రాచీన కళ ఉట్టిపడేలా చేస్తాయి. మందిరం స్టైల్లో.. పూజా మందిరం స్టైల్లో ఉండే విండ్ ఫ్రేమ్స్ కూడా గోడపైన కొలువుదీరుతున్నాయి. వీటిలో దేవతావిగ్రహాలు, లేదా దీపాలంకరణ.. ఆధ్యాత్మిక శోభను పెంచుతున్నాయి. కాగితాలతోనూ... వుడ్, ప్లాస్టిక్, ఐరన్ మెటీరియల్‌తోనే కాదు మందపాటి అట్ట ముక్కలతోనూ విండో వాల్ ఆర్ట్ పీసెస్‌ను తయారుచేయవచ్చు. క్రాఫ్ట్ తయారీలో ఇదీ భాగమైందిప్పుడు. -
Interior Designs: వర్షాకాలం.. ఇంటి మేకోవర్ మార్చేయండి ఇలా
మండే ఎండల నుంచి చినుకుల చిత్తడిలోకి వాతావరణం మారిపోయింది. ఇంటి మేకోవర్నూ మర్చాల్సిన సమయం వచ్చింది. సో.. వానాకాలంలో మీ ఇల్లు ఆహ్లాదంగా ఉండేందుకు ఇంటీరియర్ డిజైనర్స్ ఇచ్చే సూచనలు కొన్ని... ► బయట వాతావరణం డల్‌గా ఉంటుంది కాబట్టి బ్రైట్‌గా ఉండే ఫర్నిషింగ్ ఎంచుకోవాలి. అంటే, దిండ్లు, కర్టెన్లు, రగ్గులు వంటివాటిని ముదరు రంగుల్లో తీసుకుంటే ఇంటి వాతావరణం ఉల్లాసంగా.. ఉత్తేజంగా ఉంటుంది. ► ఈ కాలం వుడెన్ ఫర్నిచర్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఏ కొద్దిగా తడిసినా, తేమ చేరుకున్నా సమస్యలు తలెత్తుతాయి. అందుకని వానా కాలం.. ఇంట్లో వీలైనంత వరకు వుడెన్ ఫర్నిచర్‌ను తగ్గిస్తే మంచిది. ► రుతుపవనాలు మనల్ని ఇంట్లోనే ఉండిపోయేలా చేస్తాయి. వేడి వేడి కాఫీ లేదా టీ తాగుతూ కిటికీలోంచి వర్షాన్ని చూస్తూ ఆస్వాదించాలనుకునేవారు.. ఇంట్లో నచ్చిన కార్నర్ ప్లేస్‌ను ఎంచుకొని.. పుస్తకాలను అమర్చుకోవడానికి ఒక షెల్ఫ్‌ను ఏర్పాటు చేసుకోండి. ఈ సీజన్ ఉన్నంత వరకు వేడి వేడి కాఫీ లేదా టీతో అటు బయటి వాతావరణాన్నీ.. ఇటు ఇష్టమైన పుస్తకంలోని అంతకన్నా ఇష్టమైన పంక్తులనూ ఆస్వాదించవచ్చు! ► వెచ్చగా, బ్రైట్‌గా ఉండే లైటింగ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. అందుకు ఎల్ఈడీ బల్బులు, ఫెయిరీ లైట్లను ఉపయోగించుకోవచ్చు. కాంతి పెరగాలంటే ల్యాంప్ షేడ్స్, ఫ్లోర్ లేదా టేబుల్ ల్యాంప్లనూ ఎంచుకోవచ్చు. ► గోడలకు వాల్ పేపర్ లేదా వాల్ ఆర్ట్‌తో ప్రయోగాలు చేయవచ్చు. దీని వల్ల గ్లూమీగా ఉండే వాతావరణం ఒక్కసారి ఆసక్తిగా మారిపోతుంది. ► తేమ ఎక్కువ ఉండే రోజులు కాబట్టి.. ఒకరకమైన తడి వాసన ఇల్లంతా వ్యాపిస్తుంది. సువాసన గల కొవ్వొత్తులను ఉంచాలి. లేదా సిట్రస్, లావెండర్ వంటి సువాసనలతో కూడిన ఎసెన్షియల్ ఆయిల్ డిఫ్యూజర్‌లను ఉపయోగించాలి. తాజా వాసన కోసం వార్డ్ రోబ్లలో ఎండిన పువ్వులు లేదా సుగంధ మూలికలతో నింపిన సాషేలను వేలాడదీయాలి. ► సువాసనలు గల కొవ్వొత్తులను లివింగ్ రూమ్.. దాని పక్కనే ఉన్న గదుల మధ్యలో ఉంచినట్లయితే అవి మరింత ఆహ్లాదంగా మార్చేస్తాయి. -
మాదాపూర్: ఆకట్టుకున్న ఇంటీరియర్ ప్రదర్శన (ఫొటోలు)
-
అతికించిన అందం! ఇంటి గోడలకు త్రీడీ వాల్ పేపర్లు
సాక్షి, హైదరాబాద్: ఇంటికి వచ్చిన అతిథులను త్రీడీ వాల్ పేపర్లతో కట్టిపడేస్తున్నారు ఇంటీరియర్ ప్రియులు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వాల్ పేపర్లలోనూ సరికొత్త పోకడలు సంచరించుకుంటున్నాయి. నిర్వహణలో కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు త్రీడీ వాల్ పేపర్ల మన్నిక బాగానే ఉంటుంది. కొత్తదైనా, పాత ఇల్లు అయినా వాల్ పేపర్ల సహాయంతో ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. మార్కెట్లో వాల్ పేపర్లు రోల్స్ రూపంలో లభ్యమవుతాయి. ఒక్క రోల్ కొంటే కనీసం 57 చ.అ. విస్తీర్ణానికి సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ.2 వేల నుంచి ఉంటుంది. గోడ సైజు 10 ఇంటు 10 ఉంటే కనీసం రెండు రోల్స్ సరిపోతాయి. గోడకు అంటించడానికి అదనపు చార్జీలుంటాయి. కనీసం రూ.400 వరకుంటుంది. త్రీడీలో వాల్.. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్ డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను పరిచయం చేస్తున్నారు. ప్రధానంగా వాల్ పేపర్ల విభాగంలో త్రీడీ పేపర్స్, కస్టమైజ్డ్ వాల్ పేపర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇవి మనం కోరుకున్న డిజైన్లు, సైజుల్లో లభించడమే వీటి ప్రత్యేకత. దేవుడి బొమ్మలు, కుటుంబ సభ్యుల బొమ్మలు, తమ అభిరుచులను ప్రదర్శించే బొమ్మలు వంటివి ఇంట్లోని గోడల మీద అంటించుకోవచ్చు. త్రీడీ వాల్ పేపర్లు సుమారు 1/1 సైజ్ నుంచి 20/20 సైజ్ దాకా లభిస్తాయి. ధర చ.అ.కు రూ.120 నుంచి ఉంటుంది. త్రీడీ వాల్ పేపర్ల నిర్వహణ కూడా చాలా సులువు. మరకలు పడితే తడి గుడ్డతో తుడిస్తే శుభ్రమవుతుంది. -
Home Decoration: ‘ఏముందీ మట్టే కదా!’ అని తేలికగా తీసిపారేయకండి!
‘ఏముందీ మట్టే కదా!’ అని తేలికగా తీసిపారేయడానికి లేదు. మట్టి అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ మట్టికి అద్దం కూడా తోడైతే చూడ్డానికి రెండు కళ్లూ చాలవేమో అనిపిస్తుంది. అలాంటి కళ పేరే లిప్పన్ ఆర్ట్. ఇది కచ్ ప్రజల మనసు కళ. మట్టి–అద్దాలతో కలసిన ఈ ఆర్ట్‌పీస్‌లు ఇంటి గోడలను అందంగా చూపిస్తున్నాయి. మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న కళ కచ్ శివారు గ్రామాల్లోని బంజరు భూముల గుండా వెళుతున్నప్పుడు అద్దాలతో అలంకరించిన మట్టి ఇళ్లు కనిపిస్తాయి. ఆ ఇళ్లల్లోని మహిళల చేతుల్లోనే ఈ లిప్పన్ ఆర్ట్ కనపడుతుంది.. ఇలా మట్టి కళా రూపాలుగా. విశేషమేమంటే వీటి తయారీలో ఎలాంటి అచ్చులను, మూసలను ఉపయోగించరు. క్లిష్టమైన సౌందర్యం మడ్ మిర్రర్ వర్క్.. దాని సౌందర్యం ఆధునిక ప్రపంచపు దృష్టినీ ఆకర్షిస్తోంది. పట్టణాల్లోని ఇంటి గోడలపైన అందంగా మెరిసిపోతోంది. నిరాడంబరమైన ఈ ఆర్ట్ ఆడంబరంగా వెలిగిపోతోందిప్పుడు. ఎలా చేస్తారంటే.. లిప్పన్ ఆర్ట్‌కు డిమాండ్ పెరగడంతో తయారీ తీరు మారింది. ఎలాగంటే.. ముందు.. ప్లైవుడ్ పైన పెన్సిల్‌తో డిజైన్ గీస్తారు. తర్వాత మెత్తని మట్టిని నీటితో కలిపి... దాన్ని డిజైన్‌కి అనుగుణంగా పూసి, దానిపై అద్దాలు అతికించి.. రంగులు వేస్తారు. ఇది చాలా నైపుణ్యంతో కూడుకున్న పని కావడంతో ఈ శైలి అరుదైన కళగా ఆకట్టుకుంటోంది. చదవండి: ‘క్రీస్ కప్స్’.. కాఫీతోనే కప్పులు తయారీ..! -
హోమ్ క్రియేషన్స్.. ఇంటీరియర్ డెకరేషన్ టిప్స్
ఇంటిని డిజైన్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో పూసల ఆభరణాలు ఒకటి. రంగురంగుల పూసలతో సాధారణంగా కనిపించే టేబుల్ని అందంగా అలంకరించవచ్చు. కిటికీలో నుంచి గదిలోకి పడే సూర్యకిరణాలకూ హంగులు అద్దవచ్చు. ఇంటీరియర్ డెకరేషన్‌కు చేర్చే సులువైన మార్గాలు.. టేబుల్ అలంకరణ డైనింగ్ టేబుల్ పైన రంగుల పూసల గొలుసులను అలంకరించవచ్చు. హ్యాండ్ న్యాప్కిన్లకు లేదా గాజు గ్లాస్‌లకు చుడితే చాలు టేబుల్‌కి కొత్త హంగు చేరుతుంది. పూసల వేజ్ గ్లాస్‌ను ఫ్లవర్‌వేజ్‌గా తీర్చిదిద్దడంలో పూసలు కూడా దోహదపడతాయి. ఒకే రకరమైన రంగు, ఆకారం, కొలత గల పూసల గొలుసులను చుడితే మనం కోరుకున్న అందమైన వేజ్ కళ్ల ముందుంటుంది. గాజు బాటిళ్లను అల్యూమినియం తీగను చుట్టేటప్పుడు కొన్ని పెద్ద పూసలను కూడా గుచ్చి, హ్యాంగింగ్ వేజ్‌లను తయారుచేయవచ్చు. కొమ్మలు, రెమ్మలు, పువ్వులు, నెమలి ఈకలను జోడిస్తే పూసల వేజ్ అందం మరింత పెరుగుతుంది. స్వరాలు పలికే కర్టెన్లు పూసల గొలుసులను కర్టెన్లతో పాటు లేదంటే కర్టెన్‌గా వరసలు వరసలుగా వేలాడదీయడం ద్వారా కూడా ఇంటిని కళాత్మకంగా మార్చవచ్చు. అంతేకాదు లివింగ్‌రూమ్‌లో కొంత భాగాన్ని పార్టిషన్‌గా చేయాలనుకుంటే పూసల గొలుసుల కర్టెన్ను ఉపయోగించవచ్చు. పూసల ముడి పూసల కర్టెన్ది ఒక అందమైతే పూసల గొలుసులను కర్టెన్ రాడ్ల చుట్టూ తిప్పి మరో అందాన్ని తీసుకురావచ్చు. అలాగే ప్లెయిన్ కర్టెన్‌కు కుచ్చులు పెడుతూ, రంగురంగు పూసల ఓ గట్టి గొలుసును మధ్యలో జత చేర్చితే చాలు ఆ సోకు సింప్లీసూపర్బ్ అనిపిస్తుంది. కిరణాలకు పూసల హంగు కిటికీల హంగును పెంచడానికి కొన్ని పూసల గొలుసులను వేలాడదీయవచ్చు. క్రిస్టల్ పూసల గొలుసును కిటికీ అలంకరణలో భాగం చేయడం వల్ల సూర్యకాంతి నేరుగా పడి, ఆ కాంతి గదికి మరింత అందాన్ని తీసుకొస్తుంది. కర్టెన్ అంచులకు కుట్టి, పూసలను వేలాడదీసినా బాగుంటుంది. టేబుల్ ల్యాంప్కు జిలుగులు కొన్ని క్రిస్టల్స్, పూసల గొలుసులను గొడుగుగా ఉండే టేబుల్ ల్యాంప్ మీదుగా వేలాడదీయడం ద్వారా వినూత్న సోయగాన్ని ఆస్వాదించవచ్చు. అయితే ల్యాంప్కు తగినట్టుగా పూసల గొలుసులను ఎంచుకోవాలి. పూసల ప్రతిబింబం అద్దాలను మన ప్రతిబింబాన్ని చూసుకోవడానికే కాదు ఇంటి అలంకరణలోనూ ఉపయోగించుకోవచ్చు. గది అందాన్ని ఉత్తేజంగా మార్చడానికి వాల్ మిర్రర్‌కు పూసల గొలుసును జత చేయవచ్చు. -
Home Interior: పట్టు తివాచీ.. వీటిని ఎక్కువగా నడవని చోట వేయాలి.. ఎందుకంటే!
ఖరీదైన ఫర్నిచర్‌ను అమర్చి.. ఇంటిని శుభ్రంగా సర్దేసినా ఆ అలంకరణలో ఇంకేదో లోపం కనిపిస్తుం దంటే కారణం.. ఆ అలంకారంలో కార్పెట్‌కి స్థానం లేకపోవడమే. అందమైన మ్యాట్ లేకుంటే ఇంటి అలంకారం అసంపూర్ణంగా ఉంటుంది. ఒక్క అలంకారానికే కాదు.. మీ అడుగులను హత్తుకోవడానికి... కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, చదువుకోవడానికి, సౌకర్యవంతమైన సైడ్ ప్లేస్‌కి.. ఇలా అనేక ప్రయోజనాలను అందిస్తాయి ఈ మ్యాట్స్. మీ అవసరాలకు అనుగుణమైన తివాచీలను ఎంచుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందేమో చూడండి... పట్టు తివాచీ విలాసవంతమైన తివాచీలను తయారు చేయడానికి పట్టును ఉపయోగిస్తారు. అలాంటి వాటికి పర్షియన్ సిల్క్ తివాచీలు మహా ప్రసిద్ధి. ఇవి ఎంత అందంగా ఉంటాయో, అంతే సున్నితంగానూ ఉంటాయి. వీటి నిర్వహణ సరిగా లేకపోతే త్వరగా పాడైపోతాయి. కాబట్టి ఇంట్లో ఈ తివాచీలను ఎక్కువగా నడవని చోట వేసుంచితే మంచిది. మృదువైన ఉన్ని ఉన్నితో చేసిన కార్పెట్స్ వెచ్చగా, మృదువుగా ఉంటాయి. ఇవి సౌకర్యవంతమైనవే కాకుండా పర్యావరణ ప్రియమైనవి కూడా. గదికి అలంకారంగానే కాదు నడవడానికీ, కూర్చోవడానికీ అనువుగా ఉంటాయి. ఎవర్ గ్రీన్ కాటన్ వంటగది, బెడ్ రూమ్, డైనింగ్ రూమ్, హాల్.. ఇలా ఇంట్లో ఎక్కడైనా కాటన్ మ్యాట్స్‌ను అలంకరించవచ్చు. ఇవి నేతలో.. రకరకాల రంగులు, భిన్నమైన డిజైన్లలో దొరుకుతాయి. తక్కువ బడ్జెట్‌తో ఘనమైన ఇంటి అలంకరణ వీటితోనే సాధ్యం. శుభ్రం చేయడమూ సులభం. సహజ గడ్డి గడ్డి తివాచీలూ పర్యావరణానికి అనుకూలమైనవి.. దీర్ఘకాలం మన్నేవి కూడా. జనపనార, వెదురు, సముద్రపు గడ్డి వంటివాటితో వీటిని తయారు చేస్తారు. ఈ మ్యాట్స్ మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. గట్టిగా దులిపితే చాలు. మెరిసే సింథటిక్ ‘సింథటిక్ తివాచీనా? వద్దు’ అంటూ చుట్టి అవతలపారేయకండి. ఇవి ప్లాస్టిక్‌ను తలపించేలా ఉండవు. మొక్కల నుంచి సెల్యులోజ్ తీసి సెమీ సింథటిక్ ఫైబర్‌ను తయారు చేస్తారు. కాబట్టి సౌకర్యవంతంగానే ఉంటాయి. చేతితో అల్లిక తివాచీ తయారీలో చేతి అల్లిక అనేది అత్యంత ఖరీదైన, పూర్వకాలం నాటి కళ. ఇలాంటి ఒక తివాచీని తయారు చేయడానికి కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల దాకా పడుతుంది. క్లిష్టమైన, సంప్రదాయ డిజైన్లుంటాయి. ఇవి కాకుండా మగ్గంపై నేసే మ్యాట్స్ కూడా మార్కెట్లో ఉన్నాయి. ఫ్యాబ్రిక్ థ్రెడ్ ఫాబ్రిక్ లేదా థ్రెడ్ బంచ్‌లను కలుపుతూ వీటిని తయారు చేస్తారు. ఇది చిన్న ప్రక్రియ. అంతే∙వేగవంతమైనది కూడా. ఈ మ్యాట్స్‌ను చేతితోనూ, యంత్రంతోనూ తయారుచేస్తారు. ఇలా ఎన్నో వెరైటీల్లో కార్పెట్లు దొరుకుతున్నాయి. అభిరుచిని బట్టి నచ్చిన మ్యాట్‌ను ఇంటికి తెచ్చుకుంటే సరి. చదవండి: Mystery: డ్యానీని హెచ్చరించింది ఎవరు? అది ఏలియన్స్ పనా? ఏమిటా కథ! -
Home Creations: ఇంట్లో గ్రీన్‌వాల్ ట్రెండ్.. ఇప్పుడిదే ఎవర్గ్రీన్!!
ఇప్పటి వరకు నేలపైన ఉన్న తోటలనే చూశారు. ఇప్పుడు నిలువుగా ఉండే తోటలను కూడా చూడవచ్చు. బయటే కాదు ఇంటి లోపల కూడా ఒక ఆకుపచ్చని గోడను సృష్టించవచ్చు. ఇది సులభం కూడా. ఒక నిజమైన ఇండోర్ నిలువు తోట కావాలనుకుంటే మాత్రం కొన్ని ప్రత్యేకమైన విషయాలు తెలుసుకోవాలి. ఇండిపెండెంట్ హౌస్ అయినా, అపార్ట్మెంట్లలో అయినా ఇంట్లో పచ్చదనం ఉంటే ఆ కళే వేరు. కొన్ని పూల కుండీలతోనైనా ఆకుపచ్చనిదనాన్ని ఆస్వాదించాలనుకుంటారు. ఇక ఇంట్లో ఒక గోడ మొత్తం పచ్చదనం నింపుకుంటే ఎంత అందంగా ఉంటుందో ఈ గ్రీన్‌వాల్స్ ఏర్పాటు చూస్తే అర్థమైపోతుంది. హోమ్ క్రియేషన్స్‌లో గ్రీన్‌వాల్ ట్రెండ్ ఎప్పుడూ ఎవర్గ్రీన్. లతలతో అమరిక.. వేలాడే పచ్చదనం కోసం అందమైన క్రీపర్స్‌ను గోడల మీదకు పాకించవచ్చు. లేదంటే ఇండోర్ ప్లాంట్స్‌తో గోడకు గ్రీనరీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఔషధ మొక్కలతో గ్రీన్ వాల్ గ్రీన్ వాల్ని ఎవ్వరైనా ఇష్టపడతారు. అందుకే ఇది ఇంటీరియర్ ట్రెండ్‌లో ఎప్పుడూ రిపీట్ అవుతూనే ఉంటుంది. అందులోనూ ఈ మహమ్మారి కాలంలో రకరకాల ఔషధ మొక్కల పెంపకం ఇంట్లోæగాలిని ప్యూరిఫై చేస్తుంది. కొన్ని మొక్కలు మాత్రమే గ్రీన్వాల్కి బాగా సూట్ అవుతాయి. వాటిలో కొన్ని రకాల ఔషధ మొక్కలు, ఆర్కిడ్స్, మనీప్లాంట్ లాంటి తీగ జాతి మొక్కలను ఎంచుకోవాలి. వీటి ఎంపికలో నిపుణుల సాయం తీసుకోవచ్చు. కృత్రిమమైన పచ్చని తీగలతో .. మొక్కలతో ఏర్పాటు, మెయింటెనెన్స్ కొంచెం కష్టం అనుకున్నవారు ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ తీగలు, లతలతో లివింగ్ రూమ్ లేదా బాల్కనీలో ఒక గోడకు పచ్చదనాన్ని నింపవచ్చు. హాయిగొలిపే ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. గ్రీన్ ఫ్రేమ్ పూర్తి గోడను ప్లాంటేషన్‌తో నింపితే బాగుండదు అనుకుంటే ఫ్రేమ్ పరిమాణంలోనూ ఆకుపచ్చని మొక్కలతో గదికి కొత్త అందాన్ని తీసుకురావచ్చు. కొన్ని అమరికలు.. కొన్ని జాగ్రత్తలు ►స్ట్రెయిట్, వెర్టికల్ గార్డెన్స్‌కి ప్రత్యేకమైన కుండీలు అవసరం. ఇవి మార్కెట్లోనూ, ఆన్లైన్ మార్కెట్లోనూ అందుబాటులో ఉన్నాయి. ►మీ గోడను నీటì చెమ్మ నుంచి కాపాడుకోవాలి. అందుకు గోడను ఫ్లైవుడ్ లేదా ఇతరత్రా సెట్ చేసుకోవాలి. ►కింద ఫ్లోర్ కూడా తేమ లేకుండా పొడిగా ఉండేలా మ్యాట్ వేసుకోవాలి. మీ గ్రీన్ వాల్‌కు తగినంత సూర్యకాంతి పడేలా చూసుకోవాలి. అదనంగా కాంతినిచ్చే ఫ్లోరోసెంట్ ట్యూబ్స్‌ను వాడాలి. చదవండి: The New York Earth Room: ‘చెత్త’ అపార్ట్మెంట్ రికార్డు.. భూ ఉపరితలంపై అడుగుపెట్టిన మొదటి మనిషి నేనే!! -
ఇదో రకం ట్రెండ్.. ఆవకాయ జాడీతో అదిరిపోయే అలంకరణలు
Trendy House Interior Design: ఇంటి అలంకరణలో ఫ్లవర్ వేజ్‌ల వాడకం తెలిసిందే. అందమైన ఫ్లవర్‌వేజ్‌ల ఎంపిక గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. అయితే, ఇటీవల ఇంటీరియర్ డెకార్‌లో భాగంగా పాతకాలం నాటి వస్తువుల ప్రాధాన్యత పెరిగింది. వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగినది పచ్చడి జాడీ. బామ్మల కాలం నుంచి వివిధ రకరాల పచ్చడి జాడీల గురించి మనకు పరిచయమే. పది కేజీల పచ్చడి మొదలుకొని, పావు కేజీ పచ్చడి పట్టేంత జాడీలు ఉండేవి. ఆవకాయ, మాగాయ, ఉసిరి, చింత, గోంగూర.. ఇలా రకరకాల పచ్చళ్లకు రకరకాల పరిమాణాల్లో జాడీలు ఉండేవి. ఇప్పుడు వాటి వినియోగం తగ్గి, చాలా వరకు అటక చేరిపోయాయి. లేదంటే, ఊళ్లోనే వాటిని వదిలేసి వచ్చి ఉంటారు. కానీ, ఇప్పుడు ఇంటి అలంకరణలో ఇవే వైవిధ్యం అయ్యాయి. అందుకే ఎక్కడో మూలన చేరిన జాడీలు ముందు గదిలో దర్జాపోతున్నాయి. ఇత్తడి.. జాడీ పక్క పక్కనే చేరి కొత్తగా కబుర్లు చెప్పుకుంటున్నాయి పాతకాలం నాటి ఇత్తడి వస్తువులు, పచ్చడి జాడీలు. జాడీ పువ్వులను సింగారించుకొని బామ్మల కాలం నాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తుంటే ఇత్తడి పాత్రలు ఇంపుగా వింటున్నాయి. ఇంటి డెకార్‌లో వింటేజ్ స్టైల్ ఎప్పుడూ ప్రత్యేకమే అని నిరూపిస్తున్నాయి. చిన్నా పెద్ద.. జాడీ పరిమాణాలు, షేపుల్లో వివిధ రకాల జాడీలను ఎంచుకొని తాజా పువ్వులు లేదా డ్రై పువ్వులను అలంకరిస్తే సంప్రదాయ సొగసు, పండగ కళ నట్టింటికి నడిచివచ్చినట్టే. పచ్చని మొక్కకు జీవం ఎర్రని నోరూరించే పచ్చడికే కాదు పచ్చని మొక్కలకూ జీవం పోస్తుంది జాడీ. ఇండోర్ ప్లాంట్స్‌కు ఇలవేల్పుగా కొత్త రకం కుండీలో ఖుషీగా మారిపోతుంది. మొక్కలకు, పూలకు కుండీలుగా మారి కొత్త కళతో వెలిగిపోతున్నాయి. ఎప్పటికీ కళగా! తాజా పువ్వులు రోజూ అలంకరించలేం అనుకునేవారు ఇప్పటికే ఉన్న కృత్రిమ ఆకులు, పువ్వుల కొమ్మలను జాడీలో పొందిగ్గా అమర్చితే చాలు. సెంటర్ టేబుల్‌కి ఆకర్షణీయత పెంచుతుంది. సైడ్ వాల్ షెల్ఫ్‌లో కళగా మెరిసిపోతుంది. అటు సంప్రదాయం, ఇటు ఆధునికత కలిసి ఇంటికి కొత్త కళను తీసుకువస్తుంది. ఆధునికత వైపు పరుగులు తీసి అలసిపోతే ప్రాచీన సంపద అక్కున జేర్చుకుని మనసును సేద తీరుస్తుంది. అందుకు అసలు సిసలైన ఉదాహరణగా పచ్చడి జాడీలు నిలుస్తున్నాయని ‘హోమ్ హార్మనీ, మై హోమ్ వైబ్స్’ క్రియేషన్స్ అలంకరణను ఇలా కళ్లకు కట్టింది. చదవండి: బెదిరించినా సరే మహేశ్ అలా చేయరు : సుధీర్‌బాబు -
లక్షల్లో డబ్బు ఖర్చు అవుతున్నా..ఇంటీరియర్ డిజైన్లతో నయా ట్రెండ్
జ్యోతినగర్: ఇంటికి అందం ఇంటీరియర్ డెకరేషన్. ప్రతీ ఒక్కరికి సొంత ఇల్లు అనేది ఓ కల. ఆ ఇంటిని తమకు నచ్చేలా అందంగా తీర్చిదిద్దుకోవాలనే తాపత్రయం అందరికీ ఉంటుంది. సొంత ఇల్లు కట్టుకునే వారు అందరిని ఆకట్టుకునేలా ఉండేలా డిజైన్ చేయించుకుంటారు. ప్రస్తుతం ప్రతిఒక్కరూ ఇంటీరియర్ డిజైనింగ్‌పై దృష్టి సారిస్తున్నారు. ఇందుకు లక్షల్లో డబ్బు ఖర్చు అవుతున్నా వెనకాడడం లేదు. దీనికి అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో వివిధ రకాల ఇంటీరియర్ డిజైన్లతో నయా ట్రెండ్ కొనసాగుతుంది. ప్రతిఒక్కరూ స్థాయికి తగ్గట్టు ఇంటీరియర్ డెకరేషన్, సీలింగ్‌ను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. గతంలో స్టార్ హోటళ్లు, పెద్ద దుకాణాలకు మాత్రమే పరిమితమయ్యే ఈ డిజైన్లు ప్రస్తుతం కొత్త ఇంటి నిర్మాణాలకు కూడా వ్యాపిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాగా మారడం రియల్ ఎస్టేట్ వ్యాపారం అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖ పట్టడంతో కొత్త గృహ నిర్మాణాలకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ప్రజల ఆసక్తిని గుర్తించిన కొందరు వ్యాపారులు పీవోపీతో వివిధ డిజైన్లలో గదులను తీర్చిదిద్దే కాంట్రాక్టులు తీసుకుంటున్నారు. డెకరేషన్‌పై ఆసక్తి..వివిధ డిజైన్లతో ఇంటికి కొత్త కళ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునే క్రమంలో వివిధరకాల డిజైన్లతో సీలింగ్‌లను, ఇతర పనులను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో దగ్గర ఉండి పనులు చేయించుకుంటున్నారు. యజమానులు, నిపుణుల ద్వారా ఈ డిజైన్లను తయారు చేయించి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పీవోపీ, జిప్సం బోర్డులు, లైటింగ్, వాల్ పేయింట్స్, టెక్షర్ వాల్ పేపర్లు, ఫర్నిచర్, ఉడ్ వర్క్‌పై లామినేట్స్‌తో కంటికి అందంగా ఉండేలా తీర్చిదిద్దుకుంటున్నారు. ప్రస్తుతం డిజైన్లను బట్టి స్క్వేర్ ఫీట్ (మెటీరియల్, లేబర్చార్జి)కు రూ.1,000 నుంచి రూ.1,200 వరకు ధర వేస్తున్నారు. ఇంటిని బట్టి కేవలం ఇంటీరియర్ కోసమే సుమారు పది లక్షల నుంచి పదిహేను లక్షల వరకు వెచ్చిస్తున్నారంటే ఇంటీరియర్ ప్రజలకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతోంది. ఇంటీరియర్‌పై ఆసక్తి గతంలో చాలామంది కొత్త ఇళ్లు నిర్మించుకునే వారు ఎక్స్టీరియర్పై ఆసక్తి చూపేవారు. కానీ ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని, రామగుండం, సుల్తానాబాద్ ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించుకునేవారు ఇంటీరియర్ డిజైన్లపై ఆసక్తి చూపిస్తున్నారు. డిజైన్లకు కూడా చాలా డిమాండ్ ఉంది. ఇంటి యజమానుల, అభిరుచికి తగ్గట్లు విభిన్నంగా సీలింగ్ డిజైన్లు, ఇంటీరియర్ డెకరేషన్ చేస్తున్నాం. పీవోపీ ద్వారా చేసే డిజైన్లతో విద్యుత్ దీపాల వెలుగులో మరింత అందంగా కనిపిస్తుంది. –ఆర్.సాయితేజ, ఇంటీరియర్ డిజైనర్ జిల్లాలో ఆర్డర్లు వస్తున్నాయ్ అందరూ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో చాలా ఆర్డర్లు వస్తున్నాయి. ఇంటి యజమానులు కోరుకున్న రీతిలో వారికి డిజైన్చేసి చూపించిన తర్వాత పనులు ప్రారంభిస్తాం. హైదరాబాద్‌లో ఎక్కువ ఇంటీరియర్ డిజైన్లు చేయించుకునే వారు. కానీ నేడు పెద్దపల్లి జిల్లాలో చాలామంది కొత్త ఇంటిని నిర్మించుకునే వారు ఇంటీరియర్ డిజైన్లను కోరుకుంటున్నారు. ఇంటి యజమాని కోరుకున్న రీతిలో డిజైన్ చేసి అందంగా ఇంటిని ముస్తాబు చేస్తాం. –ఎం.అక్షయ్‌కుమార్, ఇంటీరియర్ డిజైనర్ -
ట్రెండీ లుక్ కోసం.. ఆ ఫర్నీచరే కావాలంట
గృహాలంకరణలో శతాబ్దాలుగా కలప అగ్రస్థానంలో ఉంది. స్టీల్, ఇత్తడి దశాబ్దాలుగా తమ వైభవాన్ని చాటుతూనే ఉన్నాయి. మధ్యలో కొంత వరకు ప్లాస్టిక్ చొరబడింది. నిజానికి చాలా కాలం ఫర్నీచర్ విషయంలో వీటి గురించి తప్ప పెద్దగా ఆలోచనలు సాగలేదు. ఔట్‌డోర్‌కి మాత్రమే పరిమితమైన కాంక్రీట్ ఫర్నీచర్ వేగంగా ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇన్నాళ్లూ కాంక్రీట్‌ను ఇంటి నిర్మాణంలో వాడుతారు, ఔట్‌డోర్‌లో కొంతవరకు బెంచీలు, టేబుళ్లుగా వాడుతారు తప్ప ఇంటీరియర్ డిజైనర్లో భాగంగా వాడరు అనే అభిప్రాయం ఉంది. ఇప్పుడిక ఈ ఆలోచన మరుగున పడిపోయి కాంక్రీట్‌తో అద్భుతాలను సృష్టిస్తున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. ల్యాంప్స్, టేబుల్స్, బుక్ కేసెస్.. ఒకటేమిటి. కాదేదీ కాంక్రీట్‌కు అనర్హం అనిపిస్తున్నారు. సిమెంట్.. ఇసుక.. రాళ్లు తగినన్ని పాళ్లలో కలిపిన ఈ కాంక్రీట్ పదార్థంతో ఏ డిజైన్ అయినా రాబట్టవచ్చు. నిజానికి దీనిని అర్ధం చేసుకుంటే అద్భుతాలు చేయవచ్చు అంటారు ఇంటీరియర్ డిజైనర్లు. పైగా మిగతా ఫర్నీచర్‌తో పోల్చితే చవకైనది. లగ్జరీగా కూడా కనిపిస్తుంది. ‘కాంక్రీట్‌ను శిల్పకలతో పోల్చవచ్చు. ఈ పదార్థానికి ఉన్న పరిమితి ఏంటో దాని తయారీదారు చేతుల్లోనే ఉంటుంది’ అంటారు ప్రతీక్ మోది. కాంక్రీట్ సొల్యూషన్స్ డిజైన్ సంస్థ ‘సూపర్ క్యాస్ట్’ యజమాని ప్రతీక్. ఇంటి డెకార్‌లో కాంక్రీట్‌ను లెక్కలేనన్ని మార్గాల్లో ఉపయోగించవచ్చు’ అంటారు. లివింగ్ రూమ్ టీవీ చూస్తూ, పేపర్ చదువుకుంటూ, టీ–కాఫీ లాంటివి సేవిస్తూ, మాట్లాడుకుంటూ, అతిథలతో కూర్చుంటూ .. కుటుంబంలో అందరూ ఇలా ఎక్కువ సేపు లివింగ్ రూమ్‌లోనే ఉండటానికి సమయాన్ని కేటాయిస్తారు. అందుకే, దీనిని ఫ్యామిలీ రూమ్ అనవచ్చు. అలాంటి ఈ రూమ్ అలంకరణలో ప్రత్యేకత తీసుకుంటారు. సృజనాత్మకత, మీదైన ప్రత్యేకత కనిపించాలంటే సెంటర్ టేబుల్‌ను వినూత్నంగా డిజైన్ చేయుంచుకోవచ్చు. అందుకు కాంక్రీట్ ఫర్నీచర్ మేలైన ఎంపిక అవుతుంది. ప్రయోగాల కాంక్రీట్ తమ ఇంటి కళలో తమకు తామే ఓ కొత్త సృష్టి చేయాలని ఎవరికి వారు అనుకునేవారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. వారి చేతుల్లో కాంక్రీట్ కొత్త కొత్త వింతలు పోతోంది అంటారు ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్లు. కాంక్రీట్ టేబుల్స్, ఇతర ఉత్పత్తులు చాలా గట్టిగా, మూలలు పదునుగా ఉంటాయి. ఇవి జాగ్రత్తగా వాడకపోతే గాయలు అయ్యే అవకాశం ఉందనుకునేవారు వీటికి వంపులను, నునుపుదనాన్ని సొగసుగా తీసుకువస్తున్నారు. అలాంటి డిజైన్స్ కూడా మార్కెట్లో విరివిగా దర్శనమిస్తున్నాయి. సరదా అభిరుచి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేయాలనుకున్నా, అభిరుచిని పెంపొందించుకోవాలన్నా కాంక్రీట్ ముడిసరుకుగా ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మట్టితో బొమ్మలు, వాటికి పెయింట్స్ వేసి మురిసిపోయేవారు. ఇప్పుడా అవకాశం కాంక్రీట్ ఇస్తుంది. పైగా చేసిన వస్తువు త్వరగా పగలకుండా ఇంట్లో కనువిందు చేస్తుంది. -
‘స్మార్ట్’ అస్త్రం..
మొబైల్‌ను మొదట్లో ఇతరులతో మాట్లాడడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగించేవారు. కాలానుగుణంగా మారిన శాస్త్ర, సాంకేతికతతో మొబైల్ రంగంలో ఎన్నో మార్పులొచ్చాయి. సాంకేతికత మరింతగా విస్తరించింది. ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారు మొబైల్స్‌ను అధికంగా వినియోగిస్తున్నారు. తమ ఆలోచనలను ఇతరులతో పంచుకోవడానికి అవకాశం ఏర్పడింది. మహిళలకు ప్రత్యేకించి అనేక యాప్‌లు అందుబాటులోకి రావడం, వీటికి విస్తృత ఆదరణ లభించడంతో ప్రపంచవ్యాప్తంగా అధునాతన యాప్‌ల రూపకల్పనలో చాలా సంస్థలు నిమగ్నమయ్యాయి. బ్యూటీ టిప్స్.. అతివల సౌందర్యానికి బ్యూటీటిప్స్ అనే యాప్ అందుబాటులో ఉంది. ప్రస్తుత జీవనవిధానం కారణంగా అందం పాడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ యాప్‌ద్వారా చక్కటి సూచనలు తెలుసుకునే అవకాశం ఉంది. పాదాలు, చర్మం, పెదవులు, కేశాలను రక్షించుకునే మెళకువల గురించిన పూర్తి సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది. ఆరోగ్య భద్రత.. మహిళల ఆరోగ్య భద్రతకు ఉమెన్ హెల్త్ డైరీ యాప్ అందుబాటులో ఉంది. ఈ డైరీలో పూర్తి వివరాలు నమోదు చేసుకుంటే ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం తెలుసుకునే వీలుంది. రుతుసంబంధ, మానసిక రుగ్మతలను ఈ యాప్‌లో ఉన్న వివరాల ఆధారంగా అధిగమించే అవకాశం ఉంది. కేశ సంరక్షణ.. స్త్రీల కేశసంరక్షణకు న్యూ హెయిర్ స్టైల్ అనే యాప్ అందుబాటులొకి వచ్చింది. దీని ద్వారా ప్రపంచంలో వచ్చే మార్పులకనుగుణంగా కేశాల రక్షణకు చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్.. ఇంటి అలంకరణలో మహిళల పాత్ర కీలకం. వీరికోసం ఇంటీరియర్ డిజైన్ యాప్ అందుబాటులో ఉంది. నివసించే గది, భోజనశాల, వంటశాల, పడక గదులను అలంకరించడంలో ఈ యాప్ అధునాతన నమూనాలను అందిస్తున్నాయి. దేశ, విదేశాల్లో ఉన్న నిర్మాణ శైలిని ఈ యాప్ ద్వారా కళ్లముందు చూపిస్తుంది. మేకప్.. వేడుకల్లో ప్రత్యేకంగా కనిపించడానికి మేకప్ యాప్‌ను అధికసంఖ్యలో వినియోగిస్తున్నారు నేటి యువత. ఈ యాప్‌లో అధునాతన అలంకరణకు పెద్దపీట వేస్తున్నారు. వివాహం చేసుకునే యువతులు ఈ యాప్‌తో నూతన విషయాలను తెలుసుకొని అలంకరణలో కొత్తపుంతలు తొక్కుతున్నారు. రక్షణకు నిర్భయ.. మహిళల భద్రతకు నిర్భయ, రక్ష, ఉమెన్ సేఫ్టీ ఇలా 18రకాల యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాప్‌లో ఇచ్చిన సూచనల ఆధారంగా వివరాలు నమోదు చేసుకుంటే భద్రతకు డోకా లేదు. ఒంటరిగా వెళ్తున్న మహిళలపై ఏప్రాంతంలో దాడులు అధికంగా జరుగుతున్నాయో ఈ యాప్‌ల ద్వారా పోలీసులకు సమాచారం అందుతుంది. 100 నంబర్‌కు ఫోన్.. ఆపదలో ఉన్నప్పుడు మహిళలు 100 నంబర్‌కు ఫోన్ చేసినట్లయితే పోలీసులు వేగంగా స్పందించి రక్షణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉంటారు. సమాచారం అందిన వెంటనే సంబంధిత పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే అవకాశం ఉంది. షీ-టీమ్స్, రక్షక్ వాహనం, బ్లూకోర్ట్సు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారు. అత్యవసర సమయాల్లో 100 డయల్‌కు ఫోన్ చేస్తే చాలు రక్షణ మీ ముందు ఉన్నట్లుగానే భావించే పరిస్థితులను పోలీసులు కల్పించారు. నగర పోలీసుల వాట్సప్ సేవలు.. నగర పోలీసులు కమిషనరేట్ పరిధిలో అత్యవసర సేవల కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్‌ను క్రియేట్ చేశారు. 94910–89257 నంబర్‌ను సెల్లో ఫీడ్ చేసుకుంటే చాలు వాట్సప్ ఆన్ అవుతుంది. మహిళలు ఏదైనా ప్రమాదంలో ఉన్నట్లుగా గుర్తించి ఈ నెంబర్‌కు ఎస్ఎంఎస్ చేస్తే చాలు ఆ నంబర్‌ను ప్రత్యేక యాప్‌తో ఏ లోకేషన్లో ఉందో గుర్తించి సదరు వ్యక్తిని పోలీసులు కాపాడే అవకాశం ఉంటుంది. -
రూ.20 వేల కోట్లకు ఇంటీరియర్ విపణి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో ఇంటీరియర్ డిజైన్ మార్కెట్ రూ.20 వేల కోట్లకు చేరిందని.. ప్రతి ఏటా 15–20 శాతం వృద్ధి చెందుతోందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ (ఐఐఐడీ) పేర్కొంది. ఇంటీరియర్ పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వాటా రూ.2 వేల కోట్లుగా ఉంటుందని.. ఈ పరిశ్రమల చాలా వరకూ అసంఘటితంగా ఉందని ఐఐఐడీ పేర్కొంది. ఈనెల 22–24 తేదీ వరకూ హైటెక్స్‌లో ‘ఐఐఐడీ షోకేస్ ఇన్సైడర్–2018’ 3వ ఎడిషన్ జరగనుంది. ఈ సందర్భంగా ఐఐఐడీ–హెచ్ఆర్సీ చైర్పర్సన్ అపర్ణా బిదర్కర్, ఐఐఐడీ–హెచ్ఆర్సీ మాజీ చైర్పర్సన్ అమితా రాజ్, సెక్రటరీ మనోజ్ వాహి తదితరులు విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రదర్శనలో 30 రీజినల్ చాప్టర్లు, దేశంలోని ప్రముఖ ఇంటీరియర్ డిజైన్ కంపెనీలు, నిపుణులు, ప్రొఫెసర్లు తదితరులు పాల్గొంటారని అపర్ణా తెలిపారు. మూడు రోజుల ఈ ప్రదర్శనలో కనీసం రూ.500 కోట్ల వ్యాపారాన్ని ఆశిస్తున్నామని, అలాగే పలు కంపెనీల ఉత్పత్తుల ప్రారంభాలూ ఉంటాయని ఆమె తెలిపారు. -
పవర్ టచ్
అందమైన ఇల్లు.. రంగురంగుల గోడలు.. ఆకర్షణీయమైన వాల్ఫ్రేమ్లు.. అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్.. అంతా కొత్తదనం.. ఒక్కమాటలో చెప్పాలంటే గృహమే కదా స్వర్గసీమ! అందులో అక్కడక్కడా పాత ఎలక్ట్రిక్ స్విచ్‌బోర్డులు ఉన్నాయా.. వాటిపట్ల మీకు బోర్ కొట్టిందా.. అయితే పాతదనాన్ని ‘స్విచ్’ ఆఫ్ చేసి నూతనత్వాన్ని ‘టచ్’ చేయండి. అదేనండి..! టచ్ ఫీచర్ కలిగిన సెల్‌ఫోన్, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, ఐ-పాడ్, టాబ్లెట్ల కోవలోకి స్విచ్ బోర్డ్‌లు కూడా త్వరలో రానున్నాయి. హైదరాబాద్‌కు చెందిన హిడెన్ వ్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయే టచ్ ఫెసిలిటీ కలిగిన స్విచ్ బోర్డులను రూపొందిస్తోంది. నెలరోజుల్లో నగర మార్కెట్లో ఈ నయా బోర్డులు హల్చల్ చేయనున్నాయి. టెక్నాలజీలో భాగ్యనగరం దూసుకెళ్తుందనడానికి ఇది నిదర్శనం. ఏడెనిమిది స్విచ్‌లు కలిగిన ప్యానల్ బోర్డు రూ. 2 వేలల్లో లభిస్తుంది. దీనికి లైఫ్ టైమ్ వారంటీ ఉంటుంది. బోర్డ్ సైజును బట్టి ఎల్ఈడీ బ్యాక్ లైట్ విధానంలో ఇండికేషన్లు ఏర్పాటు చేస్తారు. ఈజీ ఇన్ స్టలేషన్, నాన్ బ్రేకబుల్, ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. పారదర్శకంగా ఉండే ఈ ప్యానల్లో నచ్చిన ఫొటో కూడా ఇన్సర్ట్ చేసుకునే సౌలభ్యం ఉంది. తడి చేతులతో తాకినా షాక్ కొట్టదు. నచ్చిన ఆకారంలో ప్యానెల్‌ను మలచుతారు. ఫ్యాన్ స్పీడ్ కంట్రోలర్, ఫైర్, థెఫ్ట్ అలారం సిస్టమ్ ఉంటుంది. అందుబాటులో.. హై సెన్సిటివ్ టచ్ టెక్నాలజీని ఉపయోగించి టచ్ స్విచ్ బోర్డ్లను తయారు చేశాం. బయటి దేశాలు అందించేవి చాలా ఖరీదు. సామాన్యుడి దరికి చేర్చాలన్న ఉద్దేశంతో తక్కువ ధరకే మేం నాణ్యమైన టచ్ బోర్డ్లను అందజేస్తాం. వీటిని ఇన్నోవేటివ్ ఎక్స్‌పోలో ప్రదర్శించాం. అనూహ్య స్పందన వచ్చింది. - టి.సంతోష్, ఎండీ, హిడెన్ వ్యూ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ - మహి ఫొటోలు: రాజేష్