ఇళ్లు నిర్మించుకోవడం ఒక ఎత్తయితే.. టైల్స్ ఎంపిక మరో ఎత్తు.. ఏ మాత్రం తేడా వచ్చినా ఇంటి అందం పూర్తిగా దెబ్బతింటుంది. అయితే ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఆకర్షణీయంగా కనిపించడంలో కీలక పాత్ర పోషించేది నేలపై పరిచే టైల్స్. వాటి డిజైన్ ఎంపిక విషయంలో దాదాపు ఒక యుద్ధం చేసినంత కసరత్తు చేస్తారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే చాలా కంపెనీలు కస్టమర్ల అభిరుచులు, ట్రెండ్‌కు తగ్గట్టు తయారు చేస్తున్నాయి. ప్రతి ఏటా కస్టమర్ల అభిరుచుల్లో చాలా తేడా కనిపిస్తోందని పలు కంపెనీలు చెబుతున్నాయి. రంగులు, డిజైన్లు, ఆకారాల విషయంలో ప్రజలు ఎంతో జాగ్రత్త వహిస్తున్నారని పేర్కొంటున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో
ప్రకృతి నుంచి స్ఫూర్తి
టైల్స్ డిజైన్ రూపొందించే విషయంలో ప్రతి అంశం నుంచి స్ఫూర్తి పొందుతుంటారని తయారీదారులు చెబుతున్నారు. ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కోలా ఉంటుందని, ప్రకృతికి సంబంధించి చెట్లు, పూలు, ఆకులను మనసులో ఉంచుకుని తయారు చేస్తుంటామని పేర్కొంటున్నారు. ఇక, వివిధ రకాల ఆకారాలు కూడా ముఖ్యమని, రంగులు, విభిన్న కాన్సెప్టులతో మార్బుల్, స్టోన్స్‌తో రూపొందిస్తుంటామని చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో సుస్థిరాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నారు.
రూ.35 నుంచి ప్రారంభం..
టైల్స్‌లో కూడా ఒక్కో డిజైన్, ఒక్కో ఆకారాన్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంది. ప్రతి చదరపు అడుగు టైల్‌కు రూ.35 నుంచి రూ.500 వరకు కూడా ఉంది. సెరామిక్ టైల్స్‌కు కాస్త తక్కువ ధర ఉంటుంది. విట్రిఫైడ్, మార్బుల్ టైల్స్, గ్రానైట్ టైల్స్, వుడ్ లుక్ టైల్స్, సిమెంట్ టైల్స్ వంటి రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మార్బుల్ టైల్స్‌కు కాస్త ధర ఎక్కువ ఉంటుందని అందరికీ తెలిసిందే. ఎక్కువగా సెరామిక్ టైల్స్‌కు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాత విట్రిఫైడ్ టైల్స్‌కు, ఆ తర్వాత వేరే రకం టైల్స్‌ను వాడుతున్నారు.
ఏటా భారీస్థాయిలో వృద్ధి..
టైల్స్ రంగం ఏటా భారీ స్థాయిలో వృద్ధి నమోదు చేస్తోంది. ఏటా 11.96 శాతం పెరుగుదల కనిపిస్తోందని కెన్ పరిశోధనలు తేల్చాయి. 2023లో టైల్స్ మార్కెట్ ఏకంగా 8,543.9 మిలియన్ డాలర్లు నమోదు చేయగా, 2030 నాటికి ఈ మార్కెట్ విలువ ఏకంగా 13,265.2 మిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని అంచనా వేస్తున్నారు. 2024 నుంచి 2030 మధ్య ఈ రంగం ఏకంగా 6.5 శాతం వృద్ధి నమోదు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
దినుసుల స్ఫూర్తిగా..
దేశంలోని మసాలా దినుసులను స్ఫూర్తిగా తీసుకుని టైల్స్ డిజైన్ రూపొందిస్తుంటాను. భారతీయత ఉట్టిపడేలా, ఇక్కడి ప్రకృతి రమణీయతను టైల్స్ డిజైన్స్‌లో ఉండేలా చూసుకుంటాను. అనేక దేశాల్లో ఇలాంటి డిజైన్స్‌కు యమ గిరాకీ ఉంది. ప్రజల అభిరుచికి తగ్గట్టు టైల్స్ డిజైన్స్ రూపొందించేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాను.
– మారియా కాస్టిలో, రీజెన్సీ టైల్స్ చీఫ్ డిజైనర్
Comments
Please login to add a commentAdd a comment