ఖరీదైన ఫర్నిచర్‌ను అమర్చి.. ఇంటిని శుభ్రంగా సర్దేసినా ఆ అలంకరణలో ఇంకేదో లోపం కనిపిస్తుం దంటే కారణం.. ఆ అలంకారంలో కార్పెట్‌కి స్థానం లేకపోవడమే. అందమైన మ్యాట్ లేకుంటే ఇంటి అలంకారం అసంపూర్ణంగా ఉంటుంది.
ఒక్క అలంకారానికే కాదు.. మీ అడుగులను హత్తుకోవడానికి... కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, చదువుకోవడానికి, సౌకర్యవంతమైన సైడ్ ప్లేస్‌కి.. ఇలా అనేక ప్రయోజనాలను అందిస్తాయి ఈ మ్యాట్స్. మీ అవసరాలకు అనుగుణమైన తివాచీలను ఎంచుకోవడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుందేమో చూడండి...
పట్టు తివాచీ
విలాసవంతమైన తివాచీలను తయారు చేయడానికి పట్టును ఉపయోగిస్తారు. అలాంటి వాటికి పర్షియన్ సిల్క్ తివాచీలు మహా ప్రసిద్ధి. ఇవి ఎంత అందంగా ఉంటాయో, అంతే సున్నితంగానూ ఉంటాయి. వీటి నిర్వహణ సరిగా లేకపోతే త్వరగా పాడైపోతాయి. కాబట్టి ఇంట్లో ఈ తివాచీలను ఎక్కువగా నడవని చోట వేసుంచితే మంచిది.
మృదువైన ఉన్ని
ఉన్నితో చేసిన కార్పెట్స్ వెచ్చగా, మృదువుగా ఉంటాయి. ఇవి సౌకర్యవంతమైనవే కాకుండా పర్యావరణ ప్రియమైనవి కూడా. గదికి అలంకారంగానే కాదు నడవడానికీ, కూర్చోవడానికీ అనువుగా ఉంటాయి.
ఎవర్ గ్రీన్ కాటన్
వంటగది, బెడ్ రూమ్, డైనింగ్ రూమ్, హాల్.. ఇలా ఇంట్లో ఎక్కడైనా కాటన్ మ్యాట్స్‌ను అలంకరించవచ్చు. ఇవి నేతలో.. రకరకాల రంగులు, భిన్నమైన డిజైన్లలో దొరుకుతాయి. తక్కువ బడ్జెట్‌తో ఘనమైన ఇంటి అలంకరణ వీటితోనే సాధ్యం. శుభ్రం చేయడమూ సులభం.
సహజ గడ్డి
గడ్డి తివాచీలూ పర్యావరణానికి అనుకూలమైనవి.. దీర్ఘకాలం మన్నేవి కూడా. జనపనార, వెదురు, సముద్రపు గడ్డి వంటివాటితో వీటిని తయారు చేస్తారు. ఈ మ్యాట్స్ మీద పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. గట్టిగా దులిపితే చాలు.
మెరిసే సింథటిక్
‘సింథటిక్ తివాచీనా? వద్దు’ అంటూ చుట్టి అవతలపారేయకండి. ఇవి ప్లాస్టిక్‌ను తలపించేలా ఉండవు. మొక్కల నుంచి సెల్యులోజ్ తీసి సెమీ సింథటిక్ ఫైబర్‌ను తయారు చేస్తారు. కాబట్టి సౌకర్యవంతంగానే ఉంటాయి.
చేతితో అల్లిక
తివాచీ తయారీలో చేతి అల్లిక అనేది అత్యంత ఖరీదైన, పూర్వకాలం నాటి కళ. ఇలాంటి ఒక తివాచీని తయారు చేయడానికి కొన్ని నెలల నుంచి కొన్ని సంవత్సరాల దాకా పడుతుంది. క్లిష్టమైన, సంప్రదాయ డిజైన్లుంటాయి. ఇవి కాకుండా మగ్గంపై నేసే మ్యాట్స్ కూడా మార్కెట్‌లో ఉన్నాయి.
ఫ్యాబ్రిక్ థ్రెడ్
ఫాబ్రిక్ లేదా థ్రెడ్ బంచ్‌లను కలుపుతూ వీటిని తయారు చేస్తారు. ఇది చిన్న ప్రక్రియ. అంతే∙వేగవంతమైనది కూడా. ఈ మ్యాట్స్‌ను చేతితోనూ, యంత్రంతోనూ తయారుచేస్తారు. ఇలా ఎన్నో వెరైటీల్లో కార్పెట్లు దొరుకుతున్నాయి. అభిరుచిని బట్టి నచ్చిన మ్యాట్‌ను ఇంటికి తెచ్చుకుంటే సరి.
చదవండి: Mystery: డ్యానీని హెచ్చరించింది ఎవరు? అది ఏలియన్స్ పనా? ఏమిటా కథ!
Comments
Please login to add a commentAdd a comment