ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే పిచ్చెక్కిపోతుంది. బాబోయ్! అనిపిస్తుంది. అలాంటిది ఎవ్వరూ ఉండని ఊరిలో ఒక్కడే ఉండటమా?. ఆ ఊహ కూడా ఇష్టపడం. కానీ ఇక్కడొక వృద్ధుడు ఒక్కడే ఒంటిరిగా నివశిస్తున్నాడు. ఈ విషయం గుప్పుమనడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. పైగా అతడిపై పలు కథనాలు వెలువడటంతో నెట్టింట అతడి కథ హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరంటే..
ఎవరూ లేని ఆ ఊళ్లో అతనొక్కడే ఉంటున్నాడు. పాతికేళ్లుగా నీటమునిగిన ఆ ఊరు, తర్వాత అనావృష్టి పరిస్థితుల్లో శిథిలావస్థలో బయటపడింది. అప్పటి నుంచి ఈ పెద్దాయన ఒక్కడే ఒంటరిగా ఆ ఊళ్లో ఉంటున్నాడు. నీటమునిగి నరసంచారానికి దూరమైన ఆ ఊరి పేరు ఎపిక్యూయెన్. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిరిస్ ప్రావిన్స్ పరిధిలోని ఊరది. ఒకప్పుడు ఆ ఊరు పర్యాటకులను విశేషంగా ఆకర్షించేది. అప్పట్లో ఆ ఊళ్లో దాదాపు రెండువేల మంది ఉండేవారు. ఏటా ఐదువేల మందికి పైగా పర్యాటకులు వచ్చి వెళుతుండేవారు.
దురదృష్టవశాత్తు ఆ ఊరికి చేరువలో ఉన్న డ్యామ్ 1985లో వచ్చిన వరదల కారణంగా ధ్వంసమైంది. ఊళ్లోకి నీరు చేరడంతో, ఊరు కనిపించకుండా పోయింది. పాతికేళ్లుగా ఈ ఊరు నీటి అడుగునే ఉంది. ఆ తర్వాత ఇక్కడ అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. నీరంతా ఆవిరైపోవడంతో 2009లో శిథిలావస్థలో ఉన్న ఊరు బయటపడింది. ఇదే ఊరికి చెందిన పాబ్లో నోవాక్ అనే ఈ పెద్దాయన తన ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడకు చేరుకున్నాడు. ఊళ్లో ఎవరూ లేకపోయినా, అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ వస్తున్నాడు. తొంబైమూడేళ్ల పాబ్లో నోవాక్ ఒంటరిగా బతుకుతున్న సంగతి ఇటీవల మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ‘ప్రపంచంలోని అత్యంత ఒంటరి మనిషి’గా అభివర్ణిస్తూ సీఎన్‌ఎన్ చానల్ ఇతడిపై ఒక కథనాన్ని ప్రసారం చేయడంతో మిగిలిన చానెళ్లు, పత్రికల్లోనూ ఇతడిపై కథనాలు వెలువడ్డాయి.
(చదవండి: కితకితలు పెట్టగానే నవ్వు తన్నుకుంటూ ఎలా వస్తుందో తెలుసా! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..)
Comments
Please login to add a commentAdd a comment