loneliest
-
ఆ ఊళ్లో అతనొక్కడే!.. ఇంకెవరూ ఉండరు!
ఇంట్లో ఒంటరిగా ఉండాలంటేనే పిచ్చెక్కిపోతుంది. బాబోయ్! అనిపిస్తుంది. అలాంటిది ఎవ్వరూ ఉండని ఊరిలో ఒక్కడే ఉండటమా?. ఆ ఊహ కూడా ఇష్టపడం. కానీ ఇక్కడొక వృద్ధుడు ఒక్కడే ఒంటిరిగా నివశిస్తున్నాడు. ఈ విషయం గుప్పుమనడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. పైగా అతడిపై పలు కథనాలు వెలువడటంతో నెట్టింట అతడి కథ హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరంటే.. ఎవరూ లేని ఆ ఊళ్లో అతనొక్కడే ఉంటున్నాడు. పాతికేళ్లుగా నీటమునిగిన ఆ ఊరు, తర్వాత అనావృష్టి పరిస్థితుల్లో శిథిలావస్థలో బయటపడింది. అప్పటి నుంచి ఈ పెద్దాయన ఒక్కడే ఒంటరిగా ఆ ఊళ్లో ఉంటున్నాడు. నీటమునిగి నరసంచారానికి దూరమైన ఆ ఊరి పేరు ఎపిక్యూయెన్. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిరిస్ ప్రావిన్స్ పరిధిలోని ఊరది. ఒకప్పుడు ఆ ఊరు పర్యాటకులను విశేషంగా ఆకర్షించేది. అప్పట్లో ఆ ఊళ్లో దాదాపు రెండువేల మంది ఉండేవారు. ఏటా ఐదువేల మందికి పైగా పర్యాటకులు వచ్చి వెళుతుండేవారు. దురదృష్టవశాత్తు ఆ ఊరికి చేరువలో ఉన్న డ్యామ్ 1985లో వచ్చిన వరదల కారణంగా ధ్వంసమైంది. ఊళ్లోకి నీరు చేరడంతో, ఊరు కనిపించకుండా పోయింది. పాతికేళ్లుగా ఈ ఊరు నీటి అడుగునే ఉంది. ఆ తర్వాత ఇక్కడ అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. నీరంతా ఆవిరైపోవడంతో 2009లో శిథిలావస్థలో ఉన్న ఊరు బయటపడింది. ఇదే ఊరికి చెందిన పాబ్లో నోవాక్ అనే ఈ పెద్దాయన తన ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడకు చేరుకున్నాడు. ఊళ్లో ఎవరూ లేకపోయినా, అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ వస్తున్నాడు. తొంబైమూడేళ్ల పాబ్లో నోవాక్ ఒంటరిగా బతుకుతున్న సంగతి ఇటీవల మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ‘ప్రపంచంలోని అత్యంత ఒంటరి మనిషి’గా అభివర్ణిస్తూ సీఎన్ఎన్ చానల్ ఇతడిపై ఒక కథనాన్ని ప్రసారం చేయడంతో మిగిలిన చానెళ్లు, పత్రికల్లోనూ ఇతడిపై కథనాలు వెలువడ్డాయి. (చదవండి: కితకితలు పెట్టగానే నవ్వు తన్నుకుంటూ ఎలా వస్తుందో తెలుసా! శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే..) -
పాపం.. ఒంటరైన తిమింగలం..తలను గోడకేసి బాదుకుని..!
ఫొటోలో కనిపిస్తున్న తిమింగలాన్ని చూస్తుంటే.. ఎంత అందంగా ఉందో అని ఆనందిస్తున్నారా.! కానీ, దాని జీవితం గురించి తెలిస్తే మాత్రం గుండె బరువెక్కుతుంది. దానికి ఉన్నన్ని కష్టాలు.. తెలుగు సీరియల్ హీరోయిన్‌కు కూడా ఉండి ఉండవేమో! రెండు సంవత్సరాల వయసులోనే తల్లిలాంటి సముద్రం నుంచి తప్పిపోయింది. 1947లో ఐస్‌ల్యాండ్ తీరానికి సమీపంలో మెరైన్ ల్యాండ్ వారి చేతికి చిక్కి, బందీగా మారింది. వారు ఈ కిల్లర్ తిమింగలానికి ‘కిస్కా’గా పేరు పెట్టి, ప్రతిరోజూ ఆహారం అందిస్తున్నా.. ఏదో తెలియని బాధ. దీనికి తోడు తన పిల్లల్ని చూసుకుంటూ అయినా జీవితం సాగిద్దాం అనుకుంటే.. పుట్టిన ఐదు బిడ్డలు పుట్టినట్లుగానే చనిపోయాయి. చదవండి: రెస్టారెంట్ విచిత్ర షరతు.. ఫైర్ అవుతున్న నెటిజన్లు! స్నేహితులతో కలిసి కాస్త సరదాగా గడుపుదాం అనుకున్నా.. పక్కనే ఉండే మరో రెండు తిమింగలాలు కూడా కిస్కాని వదిలి వేరే లోకాలకు వెళ్లిపోయాయి. ఇలా ఎటు చూసినా కిస్కాకు కష్టాలు తప్పట్లేదు. దాదాపు పదేళ్లుగా ఒంటరిగానే జీవిస్తోంది. ఇక ఈ ఒంటరి జీవితం జీవించలేనని అనుకుందో ఏమో.. ఈ మధ్యనే ఆత్మహత్యాయత్నం కూడా చేసింది. తన తలను తానే వాటర్ ట్యాంకర్ గోడలకేసి బాదుకుంటూ కనిపించింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఏదీ ఏమైనా స్వేచ్ఛ అనేది మానవునికే కాదు.. మూగజీవాలకు కూడా ముఖ్యమే. బంగారు పంజరమైనా.. పక్షికి అది ఓ కారాగారమే. ఎన్ని పళ్లు, పలహారాలు తెచ్చి ఇస్తున్నా జూలో ఉండే మూగజీవులన్నీ తమకు అలవాటైన అడవినే కోరుకుంటాయి. వాటికదే స్వర్గం.. సేమ్ ఇలాగే ఈ కిల్లర్ తిమింగలం కూడా కాస్త స్వేచ్ఛ కోరుకుంటోంది. చదవండి: Unknown Facts About China: చైనా గుట్టు రట్టు చేసే.. 20 షాకింగ్ నిజాలు! -
67ఏళ్ళ జైలు జీవనాన్ని గడిపి, ప్రాణాలు విడిచింది!
ప్రకృతి వనాల మధ్య, పచ్చని చెట్లతో దట్టంగా ఉండే అడవుల్లో గుంపులతోపాటు ఉండాల్సిన ఏనుగు.. తన సుదీర్ఘ జీవనాన్ని కాంక్రీట్ జంగిల్ లో ఒంటరిగా గడిపి, చివరికి ప్రాణాలు విడిచింది. జపాన్ లోని ఇనోకాషిరా పార్క్ జ్యూలో బందీగా 67 ఏళ్ళపాటు ఒంటరి జీవితం గడిపిన హనాకో విముక్తికోసం... అంతర్జాతీయ ప్రచారం జరిగినా లాభం లేకపోయింది. చివరికి 69 ఏళ్ళ వృద్ధాప్యంతోపాటు, తీరని ఒంటరితనం ఆ ఏనుగు ప్రాణాలు తీసింది. 'వరల్డ్స్ లోన్లీయెస్ట్ ఎలిఫెంట్' గా పేరొందిన 69 ఏళ్ళ ఏనుగు 'హనాకో' జపాన్ జ్యూలో మరణించింది. ఏడాది క్రితం ఓ టూరిస్టు తీసిన వీడియోను వీక్షించిన జనం ... దాన్నిబంధనాలనుంచి విముక్తురాలిని చేసేందుకు ఎంతో ప్రయత్నించారు. వీడియోలో ఎంతో విచార వదనంతో కనిపించిన ఏనుగును ఎలాగైనా రక్షించాలనుకున్నారు. కాంక్రీట్ జైల్లో మగ్గిపోతున్న జంతువును ప్రకృతి వనాల మధ్య విడిచిపెట్టాలంటూ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. హనాకో ఉన్న ఎన్ క్లోజర్ ఓ రాతి జైలులా , అత్యంత క్రూరత్వాన్ని ప్రదర్శించే జ్యూలా ఉందంటూ టూరిస్ట్ ఉలారా నగగావా ఆందోళన వ్యక్తం చేసింది. చివరికి ఆ ఒంటరి ఏనుగును విశాల ప్రపంచంలోకి వదిలెయ్యాలంటూ అంతర్జాతీయంగా ఓ పిటిషన్ కూడ దాఖలు చేసింది. అయితే జ్యూ సిబ్బంది మాత్రం అందుకు ఒప్పుకోలేదు. సుదీర్ఘ జీవితం ఒంటరిగానే గడిపిన ఆ ఏనుగును తిరిగి ఇతర గుంపులు తమతో కలుపుకోలేవని, పైగా ఇబ్బందులకు గురి చేస్తాయని తెలిపారు. దాంతో సుమారు 500,000 మంది సంతకాలు చేసి పిటిషన్ వేసినా...ఉపయోగం లేకపోయింది. అప్పటికే హనాకో వయసు కూడ మీరిపోవడంతో చేసేది లేకపోయింది. హనాకో ఉదయం సమయంలో ఓ పక్కకు తిరిగి పడుకోవడం చూశామని, అనుమానం వచ్చి అప్పట్నుంచీ దాని ఆరోగ్యాన్ని రక్షించేందుకు ఎంతో ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయిందని, మధ్యాహ్నం సమయానికి అది మరణించిందని జ్యూ ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండేళ్ళ వయసులో ఒంటరిగా థాయిల్యాండ్ అడవిలో నివసిస్తున్న ఏనుగు పిల్లను (హనాకో) అధికారులు అప్పట్లో జ్యూకి బహుమతిగా ఇచ్చారు. అప్పట్నుంచీ సుమారు ఆరు దశాబ్దాలకు పైగానే కొద్దిపాటి పచ్చదనంతో కూడిన కాంక్రీట్ ఎన్ క్లోజర్ లోఒంటరిగానే జీవనం గడిపింది. హనాకో మరణవార్త సోషల్ మీడియాలో సంచలనం రేపింది. విషాద వార్తను చూసిన జనం నివాళులర్పించారు. వందలకొద్దీ షేర్లు చేశారు. ఏనుగును బంధించిన జపాన్ జ్యూ సిబ్బంది తీరుపై ఇబ్బడి ముబ్బడిగా ట్విట్టర్ లోనూ, ఫేస్ బుక్ లోనూ విమర్శలు గుప్పించారు. -
'నగరం మా బిడ్డలను ఎత్తుకుపోయింది'
చైనా: సాధారణంగా జ్ఞప్తికి తెచ్చుకునే తీరిక ఉండకపోవచ్చేమోగానీ, తెచ్చుకుంటే మాత్రం మధురస్మృతులు వీపెక్కి కూర్చోవడం ఖాయం. తల్లిదండ్రులు, పుట్టిన ఊరు ఎప్పటికీ ఓ వ్యక్తికి అసలైన అస్తిత్వాలే, ఆనంద నిలయాలే. అమ్మ ప్రాణంపోస్తే ఆ గ్రామం ప్రాణానికి అసలైన రూపాన్నిస్తుంది. ఆ ఇల్లు, ఆ నేల, ఆ ప్రకృతి, అక్కడి మనుషులు ఎప్పటికీ ఆనందాన్నిచ్చేవేగానీ అంధకారం చూపేవికాదు. ఈ విషయం గుర్తించి వాటికి దూరంగా ఉండకూడదని అనుకోవడం నిజంగా ఓ అదృష్టవంతుడి ఆలోచనగానే చెప్పాలి. చైనాలో ఓ వ్యక్తి ఇలాగే చేస్తున్నాడు. పుట్టిన ఊరుపై మమకారం కోల్పోకుండా ఆ ప్రకృతి, అక్కడ ఉన్న మూగజీవాలపై మమకారం కోల్పోకుండా ఎంతో ఆనందంగా గడిపేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ చైనాలోని చాంగింగ్ అనే పట్టణానికి సమీపంలో హువాన్ యాన్ అనే గ్రామం ఉంది. అక్కడ గ్రామస్తులంతా కూడా పట్ణణాలకు వెళ్లిపోయారు. కార్పెంటర్ అయినా టాన్ దాగెన్ అనే వ్యక్తి మాత్రం ఆ గ్రామంలోనే కాచుకుకూర్చున్నాడు. అతడి పిల్లలు పెద్దవాళ్లయిపోవడంతో పట్నం వెళ్లిపోయారు. దీంతో 'మా బిడ్డలను నగరం ఎత్తుకుపోయింది' అని లోపల కాస్తంత కలత చెందుతూ.. వారు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలులే అని తండ్రిగా మమకారం వెళిబుచ్చుతూ తన భార్యతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఇటీవల ఆయన భార్య కూడా చనిపోయింది. దీంతో ప్రస్తుతం ఆయనొక్కరే అక్కడ ఉంటున్నారు. తన దగ్గర ఉన్న గొర్రెలను కాచుకోవడం, తనకున్న కొద్దిపాటి పొలంలో కాయగూరలు, పండ్లు పండించుకోవడం తను జన్మించిన నేలలో కాసేపు అటూ ఇటూ తిరుగుతూ సరదాగా గడపడం ఇవే అతడి కాలక్షేపాలు. ఇన్నాళ్లు తనతో ప్రేమగా ఉన్న భార్య చనిపోయిందని బాధ, కన్నబిడ్డలు నగరానికి వెళ్లిపోయారన్న దిగులు ఆయనను వెంటాడుతున్నా.. తాను జన్మించిన ఊర్లోనే కడదాక సంపూర్ణంగా బ్రతుకుతున్నానన్న ఆత్మగౌరవం, మనోధైర్యం మాత్రం ఆయన ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. డాగెన్కు ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా వస్తోంది.