'నగరం మా బిడ్డలను ఎత్తుకుపోయింది'
చైనా: సాధారణంగా జ్ఞప్తికి తెచ్చుకునే తీరిక ఉండకపోవచ్చేమోగానీ, తెచ్చుకుంటే మాత్రం మధురస్మృతులు వీపెక్కి కూర్చోవడం ఖాయం. తల్లిదండ్రులు, పుట్టిన ఊరు ఎప్పటికీ ఓ వ్యక్తికి అసలైన అస్తిత్వాలే, ఆనంద నిలయాలే. అమ్మ ప్రాణంపోస్తే ఆ గ్రామం ప్రాణానికి అసలైన రూపాన్నిస్తుంది. ఆ ఇల్లు, ఆ నేల, ఆ ప్రకృతి, అక్కడి మనుషులు ఎప్పటికీ ఆనందాన్నిచ్చేవేగానీ అంధకారం చూపేవికాదు. ఈ విషయం గుర్తించి వాటికి దూరంగా ఉండకూడదని అనుకోవడం నిజంగా ఓ అదృష్టవంతుడి ఆలోచనగానే చెప్పాలి.
చైనాలో ఓ వ్యక్తి ఇలాగే చేస్తున్నాడు. పుట్టిన ఊరుపై మమకారం కోల్పోకుండా ఆ ప్రకృతి, అక్కడ ఉన్న మూగజీవాలపై మమకారం కోల్పోకుండా ఎంతో ఆనందంగా గడిపేస్తున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. దక్షిణ చైనాలోని చాంగింగ్ అనే పట్టణానికి సమీపంలో హువాన్ యాన్ అనే గ్రామం ఉంది. అక్కడ గ్రామస్తులంతా కూడా పట్ణణాలకు వెళ్లిపోయారు. కార్పెంటర్ అయినా టాన్ దాగెన్ అనే వ్యక్తి మాత్రం ఆ గ్రామంలోనే కాచుకుకూర్చున్నాడు. అతడి పిల్లలు పెద్దవాళ్లయిపోవడంతో పట్నం వెళ్లిపోయారు.
దీంతో 'మా బిడ్డలను నగరం ఎత్తుకుపోయింది' అని లోపల కాస్తంత కలత చెందుతూ.. వారు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలులే అని తండ్రిగా మమకారం వెళిబుచ్చుతూ తన భార్యతో కలిసి అక్కడే ఉంటున్నాడు. ఇటీవల ఆయన భార్య కూడా చనిపోయింది. దీంతో ప్రస్తుతం ఆయనొక్కరే అక్కడ ఉంటున్నారు. తన దగ్గర ఉన్న గొర్రెలను కాచుకోవడం, తనకున్న కొద్దిపాటి పొలంలో కాయగూరలు, పండ్లు పండించుకోవడం తను జన్మించిన నేలలో కాసేపు అటూ ఇటూ తిరుగుతూ సరదాగా గడపడం ఇవే అతడి కాలక్షేపాలు. ఇన్నాళ్లు తనతో ప్రేమగా ఉన్న భార్య చనిపోయిందని బాధ, కన్నబిడ్డలు నగరానికి వెళ్లిపోయారన్న దిగులు ఆయనను వెంటాడుతున్నా.. తాను జన్మించిన ఊర్లోనే కడదాక సంపూర్ణంగా బ్రతుకుతున్నానన్న ఆత్మగౌరవం, మనోధైర్యం మాత్రం ఆయన ముఖంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. డాగెన్కు ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా వస్తోంది.