
సురేష్ బాల్యన్ కుమ్రా... కుమార్తె అహనా కుమ్రాతోసురేష్ బాల్యన్ కుమ్రా
అహనా కుమ్రా బాలీవుడ్ నటి, మోడల్. టీవీ సీరీస్‌లలోనూ రాణిస్తోంది. అమితాబ్‌బచ్చన్‌తో కలిసి చేసిన యుద్ద్ టెలివిజన్ సీరీస్, లిప్‌స్టిక్ అండర్ మై బుర్ఖా సినిమా ద్వారా గుర్తింపు పొందింది. అక్టోబర్ 31న అహనా కుమ్రా ట్విటర్‌లో చేసిన పోస్ట్‌కు బాలీవుడ్ తారాగణంతో పాటు మరెందరో ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. అయితే, ఆ ప్రశంసలన్నీ ఆమె తల్లి సురేష్ బాల్యన్ కుమ్రా గురించి. 40 సంవత్సరాలు పోలీసు అధికారిగా పనిచేసిన బాల్యన్ పదవీ విరమణ పొందిన తర్వాత ఖాళీగా కూర్చోలేదు. 68 ఏళ్ల వయసులో ఎల్‌ఎల్‌బి పరీక్షలో 90 శాతం మార్కులు సాధించి న్యాయవాదిగా మారింది. తల్లి సాధించిన విజయాన్ని గురించి అహనా కుమ్రా ప్రస్తావిస్తూ ‘కలలను నెరవేర్చడంలో వయస్సు ఎప్పుడూ అడ్డంకి కాదని మీరు నిరూపించారు. లక్షలాది మందికి ముఖ్యంగా మహిళలకు స్ఫూర్తినిచ్చారు. నాకు తెలిసి 34 సంవత్సరాల క్రితం లక్నోలోని కైసర్ బాగ్ కొత్వాలిలో పోలీసు అధికారిగా నియమితులయ్యారు. ముంబైలోని సిబిఐతో విజయవంతం గా పనిచేశారు. రాష్ట్రపతి పతకం పొందారు. డిప్యూటీ పోలీసు సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొంది ఆ తర్వాత వారణాసిలో పనిచేసి, పదవీ విరమణ పొంది ఇంటికి వచ్చారు.
ఇంతవరకే మీ గురించి మాకు తెలిసింది. పదవీ విరమణ తర్వాత మీరు, పాపా ఇంట్లో విశ్రాంతిగా కూర్చుని టీవీ చూడటం లేదని ఇప్పుడే మాకు అర్ధమైంది మీ హార్డ్ వర్క్‌తో ఎన్నో గంటలను చదువుకు కేటాయించారు. ఇప్పుడు 90 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీని విజయవంతంగా పూర్తి చేశారు. నా జీవితంలో మీరు తప్ప వేరే ప్రేరణ అవసరం లేదు. 68 సంవత్సరాల వయస్సులో న్యాయవాదిగా మారినందుకు మీ గురించి చాలా గర్వపడుతున్నాను వకీల్ సాహిబా’ అంటూ తల్లి విజయాన్ని ట్విటర్ వేదికగా పంచుకుంది అహనా కుమ్రా. రక్షణాధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన బాల్యన్ ఈ జీవితంలో ఎప్పటికీ విశ్రాంతి లేదని, తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందని నిరూపించింది. చదువుకు వయసు అడ్డంకి కాదని కళ్లకు కట్టింది. బాల్యన్ లాంటి నిన్నటి తరం మహిళలు నేటి తరానికి మరింత బలమైన అడుగుగా మారుతున్న తరుణం ఇది.