ఇదో పెద్దకుటుంబం, ఏ ఆపద వచ్చినా..మేలిసంధ్య! | Ap State Government Pensioners Family Welfare Association: We take care of everything | Sakshi
Sakshi News home page

ఇదో పెద్దకుటుంబం, ఏ ఆపద వచ్చినా..మేలిసంధ్య!

Published Sat, Oct 26 2024 4:01 AM | Last Updated on Sat, Oct 26 2024 10:00 AM

Ap State Government Pensioners Family Welfare Association: We take care of everything

రిటైర్డ్‌ ఉద్యోగులు తమ మలివయసు జీవనం  ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ప్రశాంతంగా గడిచిపోవాలని కోరుకుంటారు. కానీ, ఆరోగ్యం సహకరించకపోవడంతో నలుగురిలో కలవలేకపోవడం, ఆనందకరమైన జీవనం గడపలేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటివి గుర్తించి హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్ర ప్రదేశ్‌ విశ్రాంత ఉద్యోగులు ఒక సంఘంగా ఏర్పడ్డారు.

వెయ్యికి పైగా ఉన్న ఈ సభ్యులు తమకు ఆత్మీయులు  ఉన్నారనే భరోసాతో ఆనందాలను కలబోసుకుంటూ, ఆరోగ్యాల గురించి సమీక్షించుకుంటూమలివయసును  ఉపయుక్తంగా మలుచు కుంటున్నారు.  ఈ సంఘ సభ్యులను కలిసినప్పుడు  అంతా ఒక జట్టుగా ఉంటే ఏ వయసు అయినా ఉల్లాసంగా గడిచిపోతుందనే ఆలోచనను పంచుకున్నారు.

‘అసోసియేషన్‌ ఫర్‌ ఆంధ్రప్రదేశ్‌ పెన్షనర్స్‌ సెటిల్డ్‌ ఎట్‌ హైదరాబాద్‌’ సంఘం హైదరాబాద్‌ చిక్కడపల్లిలో ఉంది. ఈ ఏడాది నాల్గవ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ నాలుగేళ్లలో వెయ్యికి పైగా ఉన్న సభ్యులను ఒక తాటి మీదకు తీసుకువచ్చి, తమ సమస్యలను పరిష్కరించుకోవడమే కాదు, వారి పెన్షన్‌లో నుంచి కొంత మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు వినియోగిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఉల్లాసభరితమైన కార్యక్రమాల ఏర్పాటుతో కొత్త ఉత్సాహాన్ని పొందడానికి ప్రయతిస్తున్నారు.

ఆరోగ్యంగా భరోసా! 
సంఘం కార్యదర్శి బుచ్చిరాజు మాట్లాడుతూ ‘‘మొన్నీమధ్య అర్ధరాత్రి ఫోన్‌ వచ్చింది. సనత్‌నగర్‌లో ఉన్న మా సంఘ సభ్యుడు ఒకరికి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. ‘ఏ ఆసుపత్రికి తీసుకెళ్లాలి. హెల్త్‌ కార్డ్‌ ఎలా?’ అనే విషయంపై ఆ సభ్యుడి కూతురు ఆందోళనగా ఫోన్‌ చేసింది. వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. సమీప హాస్పిటల్‌ వాళ్లకు ఫోన్‌ చేసి, అంబులెన్స్‌ను పంపించడంతో పాటు, వారికి సహాయంగా ఉండటం కోసం వారి దగ్గరలో ఉన్న మరొక సభ్యుడిని అలెర్ట్‌ చేశాం. మాకు పెద్ద కుటుంబం అండగా ఉందన్న భరోసాను ఆ కుటుంబానికి అందించాం. 

ఇదే విధంగా ఇంకో సభ్యుడి సమస్య. పిల్లలిద్దరూ విదేశాలలో ఉన్నారు. తండ్రి ఒక్కడే హైదరాబాద్‌లో ఒంటరిగా ఉంటాడు. ఆరోగ్య స్థితి బాగోక ఆపద సమయంలో మమ్మల్ని సంప్రదించాడు. మేం తోడున్నామనే భరోసాను అందించాం. విశ్రాంత జీవనంలో ఉండేవి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలే. పిల్లలు వారి పనుల్లో బిజీగా ఉంటారు. దీంతో ఒంటరితనంతో బాధపడుతుంటారు. కొన్ని విషయాల్లో పిల్లలు చెప్పింది వినరు. ఇలాంటప్పుడు ఏ వయసు వారిని ఆ వయసు వారితో కౌన్సెలింగ్స్‌ కూడా ఇప్పిస్తుంటాం..’’ అంటూ తామంతా ఒకే కుటుంబంగా ఎలా ఉంటున్నదీ వివరించారు.

గాత్రంతో వీనుల విందు..
కమర్షియల్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ కమిషనర్‌గా చేసి, రిటైర్డ్‌ అయిన కె.రామారావు మాట్లాడుతూ ‘‘మా సంఘ సభ్యులుగా ఉన్న ఔత్సాహిక గాయనీగాయకులను ప్రోత్సహించడం కోసం కల్చరల్‌ విభాగం ఏర్పాటు చేశాం. ఇప్పటికి 16 మంది కళాకారులు తమ గాత్రంతో సభ్యులకు వీనుల విందు చేస్తుంటారు. ఘంటసాల, బాలసుబ్రమణ్యంవర్ధంతి, జయంతి, సుశీల బర్త్‌డే సందర్భంగా సంగీత విభావరి నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా కళాకారులు అందరినీ సన్మానిస్తుంటాం. ఈ విభాగానికి కన్వీనర్‌గా ఉన్నందుకు, ఇలా కళాసేవ చేస్తున్నందుకు ఆనందంగా ఉంద’ని తెలియజేశారు.

పెన్షన్‌ నుంచి సామాజిక సేవ
ఆరోగ్య అవగాహన కల్పించడమే కాదు ఈ సంఘం సభ్యులు సామాజిక సేవలో పాల్గొంటూ తమ దాతృత్వాన్నీ చాటుకుంటున్నారు. నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌గా చేసిన విశ్రాంత ఉద్యోగి డి.మీరం శెట్టి మాట్లాడుతూ ‘‘ప్రతి మూడు నెలలకు ఒకసారి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాం. ఇటీవల నిలోఫర్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌కు లక్ష రూపాయల విలువైన మెడికల్‌ పరికరాలను, సైఫాబాద్‌ లో గల వైదేహి అనాథ బాలికల ఆశ్రమానికి స్కూటీని, దమ్మాయిగూడలోని వేద పాఠశాలకు పుస్తకాలు, వంట సామాగ్రిని, ఆర్‌ఓ వాటర్‌ప్లాంట్‌ అందించాం. కోవిడ్‌ సమయంలో గాంధీ హాస్పిటల్‌ వైద్యులను, 700 మంది నర్సులను సన్మానించాం. 

రెండు నెలల కిందట మున్సిపల్‌ వర్కర్లకు, గాంధీ ఆసుపత్రి మెటర్నటీ వార్డులోని 400 మంది స్త్రీలకు చీరలు పంపిణీ చేశాం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నా క్యాంటీన్‌కు రెండు లక్షలు, ఇటీవల వరద బాధితుల సహాయార్థం రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశాం. ఆర్మీలో పనిచేస్తూ చనిపోయిన వారి కుటుంబాల సహాయార్థం రెండు లక్షల రూపాయలకు పైగా వితరణ చేశాం’’ అని వివరించారు. ఈ మొత్తాలను సంఘ సభ్యులే తమ దయా హృదయంతో విరాళంగా ఇస్తుంటారని, వాటితోనే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటామని తెలిపిన వీరు మలివయసును మహోన్నతంగా మలుచుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

సంఘంలో చేరవచ్చు
ఆంధ్రప్రదేశ్‌ పెన్షన్‌ దారులు ఎవరైనా హైదరాబాద్‌లో స్థిరపడినవారుంటే ఈ సంఘంలో చేరి, తమ కంటూ మరో పెద్ద కుటుంబం ఉందన్న భరోసాతో ఆనందంగా జీవించవచ్చు. 
– టిఎంబి, బుచ్చిరాజు
ప్రధాన కార్యదర్శి

మా సభ్యులకు వివిధ ప్రముఖ మెడికల్‌ ల్యాబ్‌ల నుండి, ఆసుపత్రుల నుండి ఫీజులో రాయితీ వచ్చేటట్లు కృషి చేస్తున్నాం. మా సభ్యుల సౌకర్యార్థం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ సంఘానికి సంబంధించిన వివరాలతో త్రైమాసిక మ్యాగజైన్‌ని కూడా మా సభ్యులకు పంపుతున్నాం. 
– డి. మీరం శెట్టి, కన్వీనర్, 
ఆర్థిక సామాజిక సేవా విభాగం

మహిళా బృందం
విశ్రాంత ఉద్యోగ మహిళలను, విశ్రాంత ఉద్యోగుల సతీమణులను చైతన్య పరచి, వారు వివిధ కార్యక్రమాలలో పాల్గొనేలా మహిళా  విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఈ విభాగంలో సేవా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఉత్సాహవంతులైన మహిళలతో  కోలాట బృందాన్ని ఏర్పరచి వారికి శిక్షణను ఇచ్చి, వివిధ కార్యక్రమాలలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. 
– ఆర్‌ అనురాధ, 
కన్వీనర్,  మహిళా విభాగం  

– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement