Spicehealth Avani Singh Success Story In Telugu | Spicehealth CEO Features In 2021 Bloomberg Ones To Watch - Sakshi
Sakshi News home page

Avani Singh: 24 ఏళ్ల వయసులో ఏకంగా కంపెనీని స్థాపించి.. ఆపై

Published Sat, Dec 4 2021 2:16 PM | Last Updated on Sat, Dec 4 2021 5:34 PM

Avani Singh: Spicehealth CEO Features In 2021 Bloomberg Ones To Watch - Sakshi

Avani Singh: Spicehealth CEO Features In 2021 Bloomberg Ones To Watch: దేశంలోనే రెండో అతిపెద్ద ఏవియేషన్‌ సంస్థకు అధిపతి కూతురామె. ఉద్యోగం చేయవలసిన అవసరం కానీ, చేయాలన్న బలవంతం కానీ ఏమీ లేదు. కానీ అమెరికాలో ఎమ్‌ఎస్‌ పూర్తిచేసి, వచ్చీరాగానే ఓ ప్రైవేటు కంపెనీలో అనలిస్టుగా చేరింది అవనీ సింగ్‌. ఇంతలో ప్రపంచమంతటా కరోనా పంజా విసిరింది. ఫలితంగా దేశం మొత్తం లాక్‌డౌన్‌ లోకి వెళ్లిపోయింది. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

లాక్‌డౌన్‌తో వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తోన్న అవనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఈ సమయంలో హెల్త్‌కేర్‌ రంగంలో అడుగుపెట్టి, కోవిడ్‌ టెస్టులు నిర్వహిస్తే ఎలా ఉంటుంది? అనిపించి ‘స్పైస్‌ హెల్త్‌’ పేరిట హెల్త్‌ కేర్‌ను ప్రారంభించి వినూత్న నిర్ణయాలతో దూసుకుపోతోంది. దీంతో తాజాగా.. వివిధ రంగాల్లో అత్యంత ప్రభావవంతంగా పనిచేసిన ‘బ్లూమ్‌బర్గ్‌ వన్స్‌ టు వాచ్‌’ గ్లోబల్‌ వార్షిక – 50 మంది జాబితాలో అవనీ సింగ్‌ చోటు దక్కించుకుంది. 

స్పైస్‌జెట్‌ అధినేత అజయ్‌ సింగ్‌ ముద్దుల కూతురే అవనీసింగ్‌. ఎకనామిక్స్, సైకాలజీలలో డిగ్రీ పూర్తయ్యాక, స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో పబ్లిక్‌ పాలసీలో ఎమ్‌ఎస్‌ పూర్తిచేసి 2019లో ఇండియా వచ్చింది. రాగానే  గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టింగ్‌ కంపెనీ ‘మెకిన్సీ’లో అనలిస్ట్‌గా చేరింది. కరోనా మూలంగా వర్క్‌ఫ్రం హోం చేస్తోన్న అవని.. కరోనా కేసులు పెరగడం, టెస్టుల నిర్వహణ కష్టంగా ఉండడం వంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించింది. దాంతో కోవిడ్‌–19 టెస్టింగ్‌ రంగంలోకి దిగితే బావుంటుందన్న ఆలోచన వచ్చింది. వెంటనే అనలిస్టు ఉద్యోగానికి రాజీనామా చేసి తన తండ్రి అజయ్‌సింగ్‌తో కలిసి 2020 నవంబర్‌లో ‘స్పైస్‌హెల్త్‌’ ఇండిపెండెంట్‌ కంపెనీని ప్రారంభించింది.  

ఆర్టీ–పీసీఆర్‌  ః  రూ. 499 
నాణ్యతలో ఎక్కడా తగ్గకుండా తక్కువ ఖర్చుతో సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో స్పైస్‌ హెల్త్‌ను ప్రారంభించిన అవని ఐసీఎమ్‌ఆర్, ఎన్‌ఏబీఎల్‌ అనుమతితో మొబైల్‌ ల్యాబొరేటరీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పటిదాకా రూ.2400 నుంచి రూ.4500 గా ఉన్న ఆర్టీ–పీసీఆర్‌ టెస్ట్‌ను కేవలం రూ.499కు అందించి సంచలనం సృష్టించింది. ఫ్రాన్స్‌ కేంద్రంగా పనిచేస్తోన్న డయాగ్నస్టిక్‌ కంపెనీ జెనేస్టోర్‌ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా మొబైల్‌ లేబొరేటరీలను ప్రారంభించి ఆర్టీ–పీసీఆర్‌ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

దేశంలోనే అత్యధిక జనసాంద్రత కలిగిన ఢిల్లీ, అజాద్‌పూర్‌ మండిలో తొలిసారి మొబైల్‌ లేబొరేటరీ ద్వారా కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. ఇతర ల్యాబొరేటరీలు టెస్టు ఫలితాలను ఇవ్వడానికి 24 నుంచి 48 గంటలు సమయం తీసుకుంటే..స్పైస్‌హెల్త్‌ మాత్రం ఆరుగంటలలోపే ఫలితాలను ఇచ్చేది. అంతేగాక మొబైల్‌ ల్యాబొరేటరీ ద్వారా రోజుకి 20 వేల నుంచి 50 వేల ఆర్టీ–పీసీఆర్‌ టెస్టులను నిర్వహించింది. మొబైల్‌ లేబొరేటరీలు విజయవంతం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం కూడా స్పైస్‌హెల్త్‌తో కలిసి కోవిడ్‌ పరీక్షలను నిర్వహించింది. 

తొలి కంపెనీగా.. 
కోవిడ్‌ మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీని అందుబాటులోకి తెచ్చిన తొలి కంపెనీగా స్పైస్‌ హెల్త్‌ నిలిచింది. అంతేగాక మారుమూల ప్రాంతాలు, కంటోన్మెంట్‌ జోన్లు, ఆసుపత్రులు, వైద్యసదుపాయాలు అందని మారుగ్రామాలకు ఈ మొబైల్‌ లేబొరేటరీ సేవలు అందించింది. కుంభమేళాలో కోవిడ్‌ టెస్టులు నిర్వహించేందుకు స్పైస్‌ హెల్త్‌ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ భాగస్వామ్యం తో మొబైల్‌ లేబొరేటరీస్‌ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన లేబొరేటరీలను ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే 50 లక్షల ఆర్టీ–పీసీఆర్‌ టెస్టులను నిర్వహించింది. ఆర్టీ–పీసీఆర్, వ్యాక్సిన్స్‌ తర్వాత జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ టెస్టులవైపు మొగ్గుచూపింది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పది ప్రముఖ నగరాల్లో 18 టెస్టింగ్‌ ల్యాబ్స్, కలెక్షన్‌ సెంటర్లను నడుపుతోంది. కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలతోపాటు ఐదు రాష్ట్రాల్లో కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లను కూడా నిర్వహిస్తోంది. ఇటీవల కొంతకాలం క్రితం న్యూ ఢిల్లీ లో స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ ఫ్యాథాలజీ ల్యాబొరేటరీ ని ఏర్పాటు చేసి ప్యాథాలజీ సర్వీస్‌లను అందిస్తోంది. 24 ఏళ్ల వయసులో ఏకంగా ఒక కంపెనీని స్థాపించి తన వినూత్న నిర్ణయాలతో కంపెనీని విజయపథంలో నడిపిస్తోన్న అవనికి 2021వ సంవత్సరానికి గాను ఏషియా–పసిఫిక్‌ స్టీవ్‌ అవార్డు కార్యక్రమంలో ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ మెడికల్‌ ఇన్నోవేషన్‌’ విభాగంలో ‘గోల్డ్‌ అవార్డు’ వరించింది.

చదవండి: మహిళా వెడ్డింగ్‌ ప్లానర్స్‌ ఆకాశమే హద్దు...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement