Cyber Crimes: Do Not Share your Photos to Unknown - Sakshi
Sakshi News home page

Cyber Crime: అశ్లీల వీడియోలు చూడటానికి ఆహ్వానించి.. ఆపై..

Published Wed, Sep 29 2021 7:57 AM | Last Updated on Wed, Sep 29 2021 9:34 AM

Be Aware Of Cyber Crimes Do Not Share Your Photos Unknown Persons - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తమ ప్రైవేట్‌ క్షణాలకు సంబంధించిన వీడియోలు లేదా ఫొటోలు లీక్‌ అయినప్పుడు అమ్మాయిలు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఎక్కువగా మాజీ బాయ్‌ఫ్రెండ్స్‌ గర్ల్‌ఫ్రెండ్స్‌ని బ్లాక్‌మెయిల్‌ చేయడానికి లేదా డబ్బు గుంజడానికి ఇటువంటి వ్యూహాలను ఎన్నుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి.  

మార్చి, 2021లో లక్నోలో ఒక వివాహిత తన తల్లితో పాటు ఉరివేసుకుంది. ఆ అమ్మాయి మాజీ ప్రియుడు అతనితో సన్నిహితంగా ఉన్న వీడియోలను ఆమె భర్తకు పంపిస్తానని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడు. సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో, సమాజంలో తమ పరువేమవుతుందోననే భయంతో తల్లితో పాటు ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది.

మార్చి, 2020లో అహ్మదాబాద్‌లో ఓ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌ ఆమె తనతో సన్నిహితంగా ఉన్న వీడియోను స్నేహితులకు లీక్‌ చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. మే, 2019 లో మీరట్‌లో ఒక మహిళ తన ఐదేళ్ల కూతురితో కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె మాజీప్రియుడు మొబైల్‌ అమ్మేముందు వారిద్దరి వ్యక్తిగత ఫొటోలను తొలగించలేదు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఆ మహిళ తన ప్రాణాలు తీసుకుంది. 

పెరిగిన సైబర్‌ క్రేమ్‌ కేసులు
ఇటీవల విడుదల చేసిన నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో డేటా ప్రకారం సైబర్‌ నేరాల రేటు (లక్ష జనాభాకు) 2019తో పోలిస్తే 2020లో 3.7 శాతం పెరిగింది. లైంగిక వేధింపులకు సంబంధించిన నేరాలు సైబర్‌క్రైమ్‌లో రెండవస్థానంలో ఉన్నట్టు బ్యూరో నివేదికలు చూపుతున్నాయి. 

డిజిటల్‌ నేరం
అమెరికాలోని వార్విక్‌ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం, కరోనా సమయంలో అంతటా సైబర్‌ నేరాలు వేగంగా పెరిగాయి. ఇంట్లో ఉండటం వల్ల ప్రజలు మొబైల్, కంప్యూటర్లలో మరింత చురుకుగా మారారు. దీనితో పాటు ఇంటర్నెట్‌ దుర్వినియోగం కూడా పెరిగింది. ఇటీవల తెలంగాణలోని ఓ రెస్టారెంట్‌ వాష్‌రూమ్‌లో ఫోన్‌ కెమరా రహస్య ప్రదేశంలో ఉంచి, రికార్డ్‌ చేస్తున్నట్టు గుర్తించారు. సుప్రీంకోర్టు న్యాయవాది నిపుణ్‌ సక్సేనా ఈ సైబర్‌ నేరాల గురించి మాట్లాడుతూ ‘భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 354(సి) దీనిని నేరంగా పరిగణిస్తుంది.

ఈ నేరం ఎలక్ట్రానిక్, డిజిటల్‌ గాడ్జెట్ల ద్వారా జరుగుతుంది. మహిళల వ్యక్తిగత క్షణాలు ఒక పరికరంలో రికార్డ్‌ చేస్తే, అది నేరంగా పరిగణించబడుతుంది. మహిళల వ్యక్తిగత చిత్రాలు స్టోర్‌ చేయడం, షేర్‌ చేయడం, ప్రసారం చేయడం.. అన్నీ నేరం పరిధిలోకి వస్తాయని, సెక్షన్‌ 292, సెక్షన్‌ 294 కు వర్తిస్తాయని వారు పేర్కొన్నారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 2000 ప్రకారం సెక్షన్‌ 67, సెక్షన్‌ 67(ఎ) కింద శిక్షలను అమలుచేసే నిబంధన కూడా ఉంద’ని వివరించారు. 

సామాజిక మాధ్యమం ద్వారా లైంగిక దోపిడి
సోషల్‌ మీడియాలో అపరిచితులతో చేసే స్నేహాల పట్ల ఎప్పుడూ అప్రమత్తత అవసరమనే విషయాన్ని నిపుణులు స్పష్టం చేస్తూనే ఉన్నారు. ‘సెక్స్‌టోర్షన్‌తో సంబంధం గల ముఠా మిమ్మల్ని అశ్లీల వీడియోలు చూడటానికి ఆహ్వానిస్తుంది. మీరు ఆ వీడియోల పట్ల ఆసక్తి చూపినప్పుడు ఆ గ్యాంగ్‌ మీకు అలాంటి వీడియోలనే చూపించడం మొదలుపెడుతుంది.

మానసికంగా మిమ్మల్ని ప్రలోభపెట్టి మీ నుంచి వీడియోలను సేకరిస్తుంది. తర్వాత వాటిని లీక్‌ చేస్తానని బెదిరించి, బ్లాక్‌ మెయిల్‌కు దిగుతుంది’ అని చెబుతున్నారు. సర్వత్రా డిజిటల్‌మయమైన ఈ కాలంలో అమ్మాయిలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నేరాలకు అడ్డుకట్టవేయడానికి ముందు నేరాలకు అవకాశం ఇవ్వరాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

చదవండి: Cyber Crime: తల్లికి తన గురించి చెప్పిందని.. పొరుగింటి కుర్రాడే గృహిణిపై
  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement