అవార్డు ఫంక్షన్‌లో సియా (PC: sia godika instagram)
డ్రెస్‌కు తగిన షూ, చెప్పల్స్ వాడటం ఈ రోజుల్లో ఫ్యాషన్. రోజూ సాధారణంగా ధరించేవైనా ఒక్కొక్కరికి రెండు మూడు జతల షూస్ ఉంటాయి. పాతగా అయినా, పిల్లలకు బిగుతుగా అనిపించినవాటినైనా పక్కన పడేయడం చాలా సాధారణంగా చేసే పని.
అయితే బెంగళూరు విద్యార్థి సియా మాత్రం కొత్తగా ఆలోచించింది. కాలనీలు తిరిగి పాత చెప్పులను సేకరించి, వాటిని బాగు చేసి, మరీ పేదవారికి పంచుతుంది. ఇలా ఇప్పటి వరకు వేలమందికి సహాయం చేసింది.
బెంగళూరులోని కోరమంగళలో ఉంటున్న సియా ఇంటి చుట్టూ భవన నిర్మాణ పనులు జరుగుతుండేవి. అక్కడ పనిచేసే భవన నిర్మాణ కార్మికులు, వారి పిల్లలు చెప్పులు లేకుండా పరిగెత్తడం సియాను బాధించేది. ఓ రోజు ఇంటికి వచ్చే దారిలో పిల్లల పాదాలను చూసింది, వారి పాదాలకు పగుళ్లు ఉన్నాయని గమనించిన ఆమె, వారికి చెప్పులను తెచ్చివ్వడానికి తన ఇంటికి పరిగెత్తింది.
సోల్ వారియర్... అక్కణ్ణుంచి ఇరుగింటి వారిని, పొరుగింటి వారిని అడిగింది. చాలా చెప్పులనే సేకరించింది. ఆ తర్వాత కూతురి తపన చూసిన ఆమె తల్లిదండ్రులు కూడా తమకు తెలిసిన వారిని అడిగి చెప్పులను సేకరించేవారు. అక్కణ్ణుంచి వాలంటీర్లు వచ్చి జత కలిశారు. ఫలితంగా కొన్ని వేల జతల చెప్పులు వచ్చి చేరాయి. ఆ విధంగా 2019లో ‘సోల్ వారియర్’ పేరుతో ఒక ఎన్జీవోను ప్రారంభించింది.
పునరుద్ధరణ... పాదరక్షలను సేకరించడం, వాటిని స్వచ్ఛందంగా పునరుద్ధరించడం ఒక ఉద్యమంలా మొదలుపెట్టింది సియా. బాగు చేసిన చెప్పులను పేదవారికి అందిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు 15,000 జతల చెప్పులను బాగు చేసి, పేదలకు పంచింది. ‘అధిక జనాభాను ప్రభావితం చేసే పరిష్కారం కనుక్కోవడం చాలా ముఖ్యం. సోల్ వారియర్స్‌తో నేను అదే పనిచేశాను’ అంటుంది సియా.
గ్రూపులుగా సేకరణ... సొంతంగా పోస్టర్లను తయారు చేయం, వాట్సప్ గ్రూప్‌లలో వాలంటటీర్లతో సమన్వయం చేసుకోవడం వరకు అన్నీ పర్యవేక్షిస్తుంది సియా. ఒక నెలలో దాదాపు 500 జతల పాదరక్షలను సేకరించగలిగింది. ఈ వార్త వేగంగా వ్యాప్తి చెందడంతో ఎక్కువ మంది వ్యక్తులు విరాళం ఇవ్వడానికి వచ్చేవారు. ఈ విషయంలో సహాయం చేయడానికి వాలంటీర్లు ముందుకు వచ్చారు.
విస్తరణ... బెంగళూరులో ఈ మిషన్ విజయవంతమైన తర్వాత ఇప్పుడు ముంబై, చెన్నై నగరాలకూ పాత పాదరక్షల సేకరణ విస్తరించింది. దీంతో చెప్పుల సేకరణ వేగం పెరిగి, వేల జతలు వచ్చి చేరుతున్నాయి.
అవార్డులు... సియా చేస్తున్న ఈ పనిని ప్రిన్సెస్ డయానా అవార్డునూ, డయానా లెగసీ అవార్డును వెంట వెంటనే పొందింది. దీని తర్వాత ఆమె తన పనిని అమెరికా, పశ్చిమ ఆఫ్రికాలకూ విస్తరించనుంది. ‘ఒకరు మరొకరికి ఇలా సహాయం చే స్తే పేద పిల్లలు ఎవరూ చెప్పులు లేకుండా స్కూల్‌కు వెళ్లరు. పాదాలకు వచ్చే సమస్యలు దరిచేరవు’ అని చెబుతోంది సియా. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమెను సంప్రదించవచ్చు.
చదవండి: Natural Beauty Tips: నిమ్మరసం, కీరా జ్యూస్, ఆలివ్ ఆయిల్‌తో ఇలా చేస్తే..
స్త్రీ శక్తి: సూపర్ ఫైటర్
Comments
Please login to add a commentAdd a comment