
బెంగళూరులో ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
అబ్బురపరిచిన యుద్ధవిమానాల విన్యాసాలు
సాక్షి బెంగళూరు: ప్రయాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక మహాకుంభమేళ జరుగుతుంటే బెంగళూరు వైమానిక మహాకుంభమేళ జరుగుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. సోమవారం బెంగళూరు సమీపంలోని యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో 15వ ఎడిషన్ ఏరో ఇండియా ప్రదర్శనను మంత్రి రాజ్‌నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ఆధ్యాత్మిక శక్తిని, సంస్కృతిని చాటిచెబుతుంటే యలహంక ఎయిర్‌బేస్‌లో ఏరో ఇండియా ప్రదర్శన మన దేశ పరాక్రమాన్ని, రక్షణ సామార్థ్యాలను యావత్తు ప్రపంచానికి చాటిచెబుతోందని తెలిపారు.
ఇక్కడికి తరలివచ్చిన అంతర్జాతీయ భాగస్వామ్య దేశాల ప్రతినిధులు ‘ఒక భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే లక్ష్యానికి సాక్ష్యంగా నిలిచారని ప్రశంసించారు. దేశంలో, ముఖ్యంగా వైమానిక రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చు కోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎయిర్ షో ఆçహూతులను విశేషంగా అలరించింది. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తేజస్ యుద్ధ విమానాన్ని నడిపి విన్యాసాలను ప్రారంభించారు.
తేజస్, సుఖోయ్, సూర్యకిరణ్ తదితర యుద్ధ విమానాలు చేసిన విన్యాసాలు అందరినీ అలరించాయి. ఇంకా, అత్యాధునిక, 5వ తరం లాక్‌హీడ్ మార్టిన్ తయారీ అమెరికా యుద్ధ విమానం ఎఫ్–35, రష్యాకు చెందిన ఎస్‌యూ–57 ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. అనంతరం, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్(ఓఈఎం)ల సీఈవోలతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. కాగా, ఈ షో అయిదు రోజులపాటు జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment