‘నిండు నూరేళ్లు చల్లగా ఉండు’ అని పెద్దలు దీవిస్తుంటారు... అయితే అలా నూరేళ్లు కాకపోయినా జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉండడం, సరాసరి జీవితకాలం కన్నా ఎక్కువ కాలం జీవించగలగడం మన చేతిలోనే ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
20 ఏళ్ల వయసు నుంచే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఆరంభిస్తే కనీసం పది నుంచి పదమూడేళ్లు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారని ఒక పరిశోధనలో తెలిసింది. అయితే దేనిని ఆరోగ్యకరమైన ఆహారం అంటారో తెలుసుకుందాం.
ఇది చదివి ‘అయ్యో! మనం చిన్నప్పటినుంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని ఉంటే బాగుండేది, ఇప్పుడు ఏమి ప్రయోజనం! అని బాధపడనక్కరలేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మంచి ఆహారం తీసుకోవడం కనీసం ఇప్పటినుంచి ప్రారంభించినా మరికొంతకాలంపాటు మన ఆయుర్దాయాన్ని పొడిగించుకున్నట్లేనని అధ్యయనాలు చెబుతున్నాయి.
రెడ్‌మీట్ అతిగా వద్దు
ప్రాసెస్ చేసిన ఆహారం, రెడ్ మీట్ ఎక్కువగా తీసుకునే వారికంటే పండ్లు, కూరగాయలు, తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని, రెడ్ మీట్‌ను తక్కువగా తీసుకునే వాళ్లు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారని కొన్ని సర్వేలలో తేలింది.
అందుకే బరువు పెరుగుతారు
ఆరోగ్యకరమైన ఆహారం చురుకుగా ఉండడానికి సహాయపడుతుంది. మీరు చేసే పనిపై మీరు తీసుకునే ఆహారం ఆధారపడి ఉంటుంది. మానసిక శ్రమ చేసేవారికంటే శారీరక శ్రమ చేసే వారు ఎక్కువ ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా సరే, వారి శరీర అవసరాలకు మించి తినడం, తాగడం చేస్తే బరువు పెరుగుతారు.
తీసుకునే అధిక కేలరీలు కొవ్వుగా నిల్వ చేయబడుతుంది. అది చాలా హానికరం. అందువల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందేలా చూసుకోవాలి. పురుషులకు రోజుకు 2,500 కేలరీలు, మహిళలకు రోజుకు సుమారు 2,000 కేలరీలు అవసరమవుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.
రొట్టె, బియ్యం..
ఆహారంలో మూడింట ఒక వంతు మాత్రమే కార్బోహైడ్రేట్లు (పిండి పదార్థాలు) ఉండాలి. ఇవి అధికంగా ఉండే బంగాళాదుంపలు, రొట్టె, బియ్యం, తృణధాన్యాలు. పగలు చేసే భోజనంలో కనీసం పై వాటిలో ఒక పదార్థం ఉండేలా చూసుకోవాలి. కొంతమంది పిండి పదార్థాలను కొవ్వుగా భావిస్తారు, కాని తక్కువ మోతాదులో తీసుకున్న కార్బోహైడ్రేట్ సగం కంటే తక్కువ కేలరీలను అందిస్తుంది.
జ్యూస్‌లు తాగాలి
ప్రతిరోజూ ఆహారంలో పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. అల్పాహారంలో అరటిపండును ఎంచుకోవచ్చు. ఏదైనా పండును జ్యూస్ రూపంలో తీసుకుంటే అది మితంగానే ఉండేలా చూసుకోవాలి.
చేపలు తరచుగా తింటే.. మరి శాకాహారులైతే
చేప ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను అధికంగా కలిగి ఉంటుంది. వారానికి కనీసం రెండుసార్లు చేపలను తినడం మంచిది. చేపలలో ఉండే ఒమేగా –3 కొవ్వులు గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి.
శాకాహారులైతే వాటికి ప్రత్యామ్నాయంగా అవిసె గింజలు, మినుములు, నువ్వులతో తయారు చేసిన పదార్థాలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు, చక్కెరలు, నెయ్యి వాడకాన్ని తగ్గించాలి. మాంసాహార వంటల్లో అధిక మొత్తంలో కొవ్వు ఉంటుంది కాబట్టి వీటిని పరిమితంగానే తీసుకోవాలి.
కూల్‌డ్రింక్స్‌లో అధికంగా చక్కెరలు ఉంటాయి. ఇది ఊబకాయానికి, దంత సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. అలాగే, నిల్వ ఉండే చిప్స్ వంటి చిరుతిళ్లలో అధిక మొత్తంలో ఉప్పు ఉంటుంది. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
చదవండి: Almonds Benefits: బాదాం ఎలా తింటే మంచిది? పోషకాలు పుష్కలంగా లభించాలంటే?
Comments
Please login to add a commentAdd a comment