అసలు పాటలో ‘హైలో హైలెస్సా! హంస కదా నా పడవ!’ అని ఉంది కదా, మరి శీర్షికలోనే ఈ ‘కారు’కూత ఏమిటను కుంటున్నారా? కాస్త ఈ ఫొటోలను చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ కారు అచ్చం హంసలా ఎంత వయ్యారంగా ఉందో చూస్తున్నారు కదా! ఇదేమీ సరికొత్త మోడల్ కాదు. వందేళ్ల కంటే మునుపటిది. బ్రిటిష్ హయాం రోజుల్లో 1900 ప్రాంతంలో కలకత్తాలో రాబర్ట్ నికోల్ స్కాటీ మాథ్యూసన్ అనే సంపన్న స్కాటిష్ దొరగారు ఉండేవారు. ఆయనగారి ఇల్లు కలకత్తా జూ పక్కనే ఉన్న స్వాన్ పార్కుకు చేరువలో ఉండేది.
స్వాన్ పార్కులో తిరుగాడే హంసలను రోజూ గమనిస్తూ ఉండే మాథ్యూసన్ దొరగారికి తన కారును అచ్చం హంసలాగానే తయారు చేయించుకోవాలనే కోరిక పుట్టింది. మనసులో కోరిక పుట్టినదే తడవుగా ఇంగ్లండ్‌లోని కార్ల తయారీ సంస్థ జేడబ్ల్యూ బ్రూక్ అండ్ కంపెనీ వారికి 1909లో ఆర్డర్ చేసి, తన కోసం ఇలా ప్రత్యేకంగా హంసలాంటి కారును తయారు చేయించుకున్నాడు. ఈ కారు 1910లో కలకత్తా చేరుకుంది. అప్పట్లో ఈ కారులో మాథ్యూసన్ దొరగారు కలకత్తా వీథుల్లో విహరిస్తూ ఉంటే జనాలు కళ్లప్పగించి వింతగా చూస్తుండేవారు. ఈ కారుకు కొన్ని విచిత్రమైన ప్రత్యేకతలు కూడా ఉండేవి. ఇందులో హారన్‌కు బదులుగా ఎనిమిది పైపులతో కూడి పైప్‌ఆర్గాన్ కీబోర్డు ఉండేది.
ఒక్కో కీ నొక్కితే ఒక్కో వింత ధ్వని వచ్చేది. కారు అడుగుభాగంలో ప్రత్యేకమైన డక్ట్ రోడ్డు మీద సున్నం వెదజల్లేది. ఇది అచ్చం హంస రెట్టలా కనిపించేది. ఇంజిన్ వేడెక్కినప్పుడు హంస మూతి నుంచి వేడినీళ్లు పిచికారీలా బయటకు వచ్చేవి. అప్పట్లో మాథ్యూసన్ ఈ కారు తయారీ కోసం దాదాపు 15 వేల పౌండ్లు ఖర్చు చేశాడు. మాథ్యూసన్ దీనిని ఎక్కువకాలం వాడకుండానే అమ్మేయాల్సి వచ్చింది. అతడి వద్ద నుంచి ఈ కారును పటియాలా పొరుగు సంస్థానమైన నభా సంస్థానం మహారాజు రిపుదమన్ సింగ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కారు నెదర్లండ్స్‌లోని లోమన్ మ్యూజియమ్‌లో ఉంది.
(చదవండి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబం! ఏకంగా 700 కార్లు, నాలుగు వేల కోట్లు..)
Comments
Please login to add a commentAdd a comment