![C Sections Dominate Delivery Business In Private And Corporate Hospitals - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/30/Delivery-in-women.jpg.webp?itok=HyZ4Lmk5)
బిడ్డకు జన్మనిచ్చి మాతృత్వం పొందడం మహిళ అదృష్టంగా భావిస్తోంది. ప్రసవం ఆమెకు పునర్జన్మతో సమానం. ఒకప్పుడు అత్యధిక ప్రసవాలు సాధారణ పద్ధతిలోనే జరిగేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పలు కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి సిజేరియన్లను మార్గంగా చూడటం.. తల్లీబిడ్డా క్షేమంగా ఉండాలని కొందరు కుటుంబీకులు ఆపరేషన్లకు సరే అనడం.. మరి కొందరు శుభఘడియలు అంటూ కడుపు కోతకు ఒత్తిడి తేవడం.. ఇలా కారణాలు ఏవైనా అమ్మ కడుపుపై మానని గాయం ఏర్పడుతోంది. సిజేరియన్లతో భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నా పరిస్థితి మారడం లేదు.
సాక్షి, నంద్యాల: దనార్జనే లక్ష్యంగా పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో గర్భిణులకు ఇష్టానుసారంగా సిజేరియన్లు చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. సాధారణ ప్రసవాలకు అవకాశం ఇవ్వకుండా సిజేరియన్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గర్భంలో బిడ్డ అడ్డం తిరగడం వంటి అత్యవసర సమయాల్లో చేయాల్సిన ఆపరేషన్లను కాసుల కోసం అమ్మకు కడుపు కోత పెడుతున్నారు. సిజేరియన్లతో ప్రసవాలు జరగడంతో చిన్న వయస్సులోనే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. గర్భం దాలిస్తే సిజేరియన్ తప్పనిసరి అన్నట్లు పరిస్థితి మార్చేశారు. గర్భం దాల్చిన రెండో నెల నుంచే అవసరం లేకపోయినా స్కానింగ్‌లు, టెస్టులు, మందులు, టానిక్‌ల పేరుతో రూ.వేలకు వేలు దోపిడీ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
నంద్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపు 79 ప్రైవేటు ఆస్పత్రులున్నాయి. వీటిలో శస్త్రచికిత్సలు చేసే హాస్పిటళ్లు సుమారు 35 వరకు ఉన్నాయి. అలాగే కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ (సీహె చ్‌సీ)లు 11, డోన్, బనగానపల్లెలో ఏరియా ఆస్పత్రి, నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నెలకు సుమారు 2 వేలకు పైగా ప్రసవాలు జరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం ఏ ప్రాంతంలోనైనా ప్రసవాల్లో సిజేరియన్లు గరిష్టంగా 15 శాతం మించకూడదు. కాన్పు కష్టమైన సమయాల్లో, తల్లీబిడ్డల్లో ఎవరికై నా ప్రాణహాని ఉండే సందర్భాల్లోనే సిజేరియన్ చేయాలి. రక్తహీనత, అధిక రక్తస్రావం జరిగే అవకాశం ఉన్నప్పుడే ఆపరేషన్‌కు మొగ్గు చూపాలి. అయితే ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీ, కొందరు కుటుంబీకులు మూఢనమ్మకాలు వెరిసి సిజేరియన్లు ఎక్కువగా జరుగుతున్నాయి.
ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాల్లో 50 శాతానికి పైగా కడుపు కోత ఉంటున్నాయి. విస్తుగొల్పుతున్న గణాంకాలు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఏప్రిల్ నుంచి ఈనెల 21వ తేదీ వరకు మొత్తం 10,086 ప్రసవాలు జరిగాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4,034, ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,052 ప్రసవాలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రసవాల్లో దాదాపు 45 శాతం ప్రసవాలు సిజేరియన్ ద్వారానే జరిగాయి. ఇందులోనూ ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇష్టారాజ్యంగా ఆపరేషన్లు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,052 ప్రసవాలు జరిగితే వీటిలో 50 శాతం అంటే 3 వేలకు పైగా ప్రసవాలు సిజేరియన్ ద్వారా చేయడం విస్తుపోయే వాస్తవం. గర్భం దాల్చినప్పుటి నుంచి సాధారణ ప్రసవం కావాలని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లే సరికే ఏదో కారణంతో భయపెట్టి సిజేరియన్ చేయిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు.
ఒక్కో ఆపరేషన్‌కు వేలల్లో ఖర్చు..! సాధారణ ప్రసవం జరిగితే ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.10 వేలకు మించి బిల్లు కాదు. అదే సిజేరియన్ అయితే పేషంట్ పరిస్థితిని బట్టి, ఆస్పత్రిని బట్టి రేట్లు నిర్ణయిస్తున్నారు. సిజేరియన్‌కు కనిష్టంగా రూ.40 వేల నుంచి గరిష్టంగా రూ. 80 వేల వరకు కూడా బిల్లులు వేస్తున్నారు. నంద్యాల పట్టణంలోని ఐదు ప్రముఖ ఆస్పత్రుల్లో, ఆళ్లగడ్డలోని రెండు ఆస్పత్రుల్లో సిజేరియన్లు యథేచ్ఛగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఆసుపత్రులోని వైద్య సిబ్బంది సాధారణ ప్రసవాలు చేసేందుకు చొరవ చూపుతున్నారు.
ఈ క్రమంలో అవగాహన ఉన్న పలువురు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు. ప్యాపిలి, పాములపాడు, చాగలమర్రి, అహోబిలం.. తదితర మండలాల్లో సాధారణ ప్రసవాలు అధికంగా జరుగుతున్నాయి. ముహూర్తాలు చూసుకుని మరీ.. ఇటీవల కాలంలో ముహూర్తం, శుభ ఘడియలు చూసుకుని మరీ ప్రసవాలు చేయించుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి వారంతా ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ఫలానా రోజు, తేదీ, గంటలు, నిమిషాలను కూడా పాటిస్తూ పిల్లల్ని కనడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మరికొందరైతే బిడ్డ ఎన్ని సెకండ్లకు బయటకు రావాలో కూడా నిర్ణయించేస్తున్నారు. మరికొందరు గర్భిణులు పురిటి నొప్పులు భరించలేక సిజేరియన్ల వైపు వెళ్తున్నారు.
జిల్లాలో ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల వివరాలు
నెల ప్రభుత్వ ప్రైవేటు
ఏప్రిల్ 762 1,121
మే 814 1,051
జూన్ 800 1,064
జులై 798 1,057
ఆగస్ట్ 860 1,108
సెప్టెంబర్ 716 651 (21 తేదీ వరకు)
పరీక్షలు చేయించుకోవాలి
గర్భందాల్చినప్పటి నుంచి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ప్రతి నెల బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకుంటూ ఉండాలి. సాధారణ ప్రసవమైతే రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. సిజేరియన్ అయితే కనీసం మూడు నెలల విశ్రాంతి అవసరం. జీవనశైలిలో వచ్చే మార్పుల వల్లే ఆపరేషన్లు పెరిగిపోతున్నాయి.
– డాక్టర్ అనూష గింజుపల్లి, గైనకాలజిస్ట్
అవగాహన కల్పిస్తున్నాం
సిజేరియన్ల శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధ్యమైనంత వరకు సాధారణ ప్రసవాలు జరిగేలా చేస్తున్నాం. కేవలం హై రిస్క్ ఉన్న వారిని మాత్రమే సిజేరియన్లకు రెఫర్ చేస్తున్నారు. బిడ్డ పుట్టిన సమయమే శుభ ఘడియలు. ప్రత్యేక తేదీలు, ప్రముఖల జన్మదిన రోజులు అంటూ డాక్టర్లపై ఒత్తిడి చేయకూడదు.
– డాక్టర్ వెంకటరమణ, జిల్లా వైద్యాధికారి
(చదవండి: గర్భం రాకుండా పరికరం ఇంప్లాంట్ చేస్తే..నేరుగా గుండెల్లోకి దూసుకుపోయి..)
Comments
Please login to add a commentAdd a comment