అడవిలోకి వెళ్లింది.. ఆదివాసీల జీవితాలకు ఆశాకిరణం అయ్యింది.. | CEO Of AROH Foundation Doctor Neelam Gupta | Sakshi
Sakshi News home page

అడవి కిరణం డాక్టర్‌ నీలమ్‌ గుప్తా..

Published Thu, Feb 10 2022 5:27 PM | Last Updated on Thu, Apr 14 2022 1:18 PM

CEO Of AROH Foundation Doctor Neelam Gupta - Sakshi

‘స్టుపిడ్‌ ఐడియా, ఈ ఆలోచనను ఇక్కడే ఆపెయ్‌’ అన్నారు... పేరెంట్స్‌.
‘పీహెచ్‌డీ పూర్తయింది కదా! మంచి ఉద్యోగం తెచ్చుకుని పెళ్లి చేసుకో’ అని కూడా అన్నారు.
ఆమె వినలేదు... అడవిలోకి వెళ్లింది. ఆదివాసీల జీవితాలకు ఆశాకిరణం అయింది.
వేలాది మంది జీవితాల్లో అభివృద్ధి వెలుగులు నింపింది... విజ్ఞాన దీపాలను వెలిగించింది.

డాక్టర్‌ నీలమ్‌ గుప్తా... ఢిల్లీలో చదివారు. చదువుకున్న వాళ్లందరూ నగరంలోనే ఉండిపోతే ఆదివాసీలు ఎప్పటికీ అడవిలోనే ఉండిపోవాల్సి వస్తుంది. నగరాన్ని వాళ్లకు పరిచయం చేయాలి.  వాళ్లను నగరంలోకి తీసుకురావాలి. అందుకు రోడ్‌మ్యాప్‌ తయారు చేసే పని తనకు తానుగా తీసుకున్నారు. ఇంట్లో వాళ్లను సమాధానపరిచి ఆదివాసీల గ్రామాల్లో అడుగుపెట్టారు. చదువురాని వాళ్ల కోసం ప్రింటింగ్‌ ప్రెస్‌ పెట్టారు. బొమ్మలతో చదువు చెప్పసాగారు. నగరానికి, కుగ్రామానికీ తేడా బొమ్మలతో చూపించారు.

పేదరికం, అసమానత, లింగ వివక్షల విషయంలో తన సేవలను మరింతగా విస్తరించారు. ‘ఆరోహ్‌ (ఏ రే ఆఫ్‌ హోప్‌)’ పేరుతో స్వచ్ఛంద సంస్థ స్థాపించి సేవలను విస్తరించారు. ప్రభుత్వ సహభాగస్వామ్యంతో స్కిల్‌ డెవలప్‌మెంట్, ఎడ్యుకేషన్‌ ప్రాజెక్టులను చేపట్టి విజయవంతం గా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లలేని కుగ్రామాలతో మమేకమైపోయిందామె జీవితం. అక్కడి యువతను కలుపుకుని వారి సహాయంతో సామాజిక, ఆర్థిక సర్వేలు నిర్వహించారు. వారిని ఎడ్యుకేట్‌ చేయడం ద్వారా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు సామాజిక కార్యకర్త డాక్టర్‌ నీలమ్‌ గుప్తా

నీళ్లతో లెక్కలు
‘‘అభివృద్ధికి ఏ మాత్రం నోచుకోని ఈ కుగ్రామాల్లో నివసించే వారికి ప్రతిదీ నేర్పించాల్సిందే. నీటి శుభ్రత, సహజ వనరుల పరిరక్షణ, ఆరోగ్యం, జీవనోపాధి, మహిళాసాధికారత వంటి విషయాలతోపాటు తాము కూడా అందరి లాగానే చదువుకోవచ్చు అని కూడా చెప్పాల్సి వస్తోంది. సర్వే గణాంకాల ప్రకారం ఒక గ్రామంలో స్కూలుకు వెళ్లాల్సిన వయసు పిల్లల సంఖ్య పెద్దదిగా ఉంటుంది. స్కూల్‌ రికార్డులో ఎన్‌రోల్‌ మెంట్‌ దగ్గరకు వచ్చేసరికి చాలా పరిమితంగా ఉంటుంది. అంతపెద్ద గ్యాప్‌ను పూడ్చడానికి చేయని ప్రయత్నం లేదనే చెప్పాలి. ఎన్‌రోల్‌ మెంట్‌తో మా పని పూర్తయిందా? కానే కాదు. పాఠ్యాంశాల్లోని పాఠాలను యథాతథంగా బోధిస్తే సరిపోయేది కాదు.

అక్కడి పరిస్థితి ఏమిటంటే... పదవ తరగతి విద్యార్థికి ఏదైనా ఒక రంగును చూపించి ‘అది ఏ రంగు? అని అడిగితే, ఇంగ్లిష్‌లో ఆ రంగు పేరు పలకడం, రాయడం రాక బిక్కమొహం పెట్టేవాళ్లు. కూడికలు, తీసివేతలు, భాగాహారాలను నేర్పించడానికి బకెట్‌లో నీటిని తీసుకుని మగ్గులతో కొలిచి మరో బకెట్‌లో పోస్తూ నేర్పించాం. ఇలా వాళ్లకోసం టీచింగ్‌ మెథడాలజీలో కొత్త కాన్సెప్ట్‌లను తయారు చేసుకున్నాం. నీరు మురికి కావడం, శుభ్రంగా ఉండడం వంటి తేడాలను చూపిస్తూ ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌ నేర్పించాం. ‘పఢో ఔర్‌ బఢో’ అనే కార్యక్రమాన్ని రూపొందించి యాభై వేల మంది విద్యార్థులను ఎన్‌రోల్‌ చేయించి వారందరికీ  చైల్డ్‌ ఓరియెంటెడ్‌ మోడల్‌ ద్వారా పాఠాలు చెప్పాం.

బీహార్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల్లోని యాభై గ్రామాల్లో ఈ సేవలందించాం. ఆ తర్వాత మాకనిపించింది... మహిళలను చైతన్యవంతం చేసి, వారికి జీవనోపాధి కల్పించినట్లయితే తమ పిల్లలకు చదువు అవసరాన్ని వారే గుర్తించేలా చేయగలిగితే ఆ క్షణం నుంచి తమ అభివృద్ధికి తామే బాటలు వేసుకోగలుగుతారనిపించింది. అనిపించడమే కాదు, అదే నిజమైంది. మహిళలకు వారికి రకరకాల పనుల్లో శిక్షణ ఇవ్వడంతోపాటు సాఫ్ట్‌ స్కిల్స్‌ కూడా నేర్పించాం. కంప్యూటర్‌ బేసిక్‌ ఎడ్యుకేషన్, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కూడా నేర్పించాం. ఈ మార్పు ఒడిషాలోని కందమల్, రాయగడ, నౌపద, గజపతి, కోరాపుట్‌ జిల్లాల్లో నూ, జార్ఖండ్‌లోని గిరిడీహ్, ధన్‌బాద్, బొకారో జిల్లాలు, బీహార్‌లోని గయ జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు అక్కడ ప్రతి గ్రామంలోనూ నలభై శాతం మంది మహిళలు మా కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందిన వాళ్లే ఉన్నారు. 

ఆకాశమే హద్దు
ఈ గ్రామాల్లో ‘ఆడపిల్ల వద్దనుకునే తల్లిదండ్రులు లేరు. ఆ తరం ముగిసిపోయింది. రూపాలి అనే అమ్మాయి అక్కడ అందరికీ ఓ రోల్‌మోడల్‌. ఆమె ఓ జపాన్‌ వస్తువుల రీటైల్‌ దుకాణంలో ఉద్యోగం చేస్తూ నెలకు పద్దెనిమిది వేలు సంపాదిస్తోంది. కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ నుంచి ‘స్టార్‌ పెర్ఫార్మర్‌ ఆఫ్‌ డీడీయూ–జీకేవై’ పురస్కారాన్ని అందుకుంది. ఒకప్పుడు చదువుకోవచ్చనే విషయం కూడా తెలియని ఈ గ్రామాల్లో ఇప్పుడు పర్యటిస్తే రూపాలి వంటి అమ్మాయిలు ఎందరో కనిపిస్తారు. వీరందరి ఎదుగుదల నాకు కూడా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెట్టింది’’ అని చెప్పారు 2019లో గ్లోబల్‌ కాంపాక్ట్‌ ఇండియా నెట్‌వర్క్‌ పురస్కారం అందుకున్న డాక్టర్‌ నీలమ్‌ గుప్తా. ఈ సందర్భంగా డాక్టర్‌ గుప్తా తాను బాల్యంలో ఈ ప్రదేశాల్లో పర్యటించినప్పుడు కంటపడిన సన్నివేశాలు, సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

స్వెటర్‌ అమ్మితే 
‘‘నేనక్కడ అడుగుపెట్టేనాటికి అక్కడి పరిస్థితులు భయానకంగా ఉండేవి. మధ్యాహ్నం రెండు తర్వాత తెల్లవారు ఝామున ఐదింటి మధ్య బయటకు రావడం క్షేమకరం కాదు. అది తెలిసి మా పేరెంట్స్‌ నా ఆలోచనను అంగీకరించలేదు. అయితే అక్కడి యువతను చేరదీసి వారి ఆలోచన ధోరణిని మార్చడం ద్వారా నేను అనుకున్నది సాధించగలిగాను. అసలు నేను ఇంత మొండిగా ఈ పని తలకెత్తుకోవడానికి బలమైన కారణమే ఉంది. నా చిన్నప్పుడు ఒకసారి సెలవుల్లో మా నాన్నతో కలిసి ఇక్కడ పర్యటించాను. డిసెంబర్‌ చలిలో ఓ పదేళ్ల పాప చిరిగిన దుస్తులతో రోడ్డు పక్కన నిలబడి చలికి వణుకుతూ ఉంది. అప్పుడు నా స్వెటర్‌ ఇచ్చి వేసుకోమన్నాను.

ఆ మరుసటి రోజు ఆ పాప మళ్లీ అలాగే చిరిగిన దుస్తులతోనే రోడ్డు పక్కన కనిపించింది. స్వెటర్‌ వేసుకోలేదేమని అడిగినపుడు నాకు మతి చలించిపోయే సమాధానం వచ్చింది. ఆ స్వెటర్‌ను పాప తండ్రి తీసుకువెళ్లి సంతలో అమ్మేసి ఇంట్లోకి తినడానికి సరుకులు తెచ్చాట్ట. కడుపు నింపుకోవడానికి ఇంక మరో దారి లేదు వాళ్లకప్పుడు. హాలిడే వెకేషన్‌ పూర్తి చేసుకుని నగరానికి వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ సంఘటన నన్ను వెంటాడుతూనే ఉండేది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, అగ్రికల్చర్‌ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పూర్తి అయిన తర్వాత నా ఆలోచనను ఇంట్లో చెప్పాను. ఇంట్లో వాళ్లందరూ కోప్పడ్డారు. మొండిగానే నా ప్రయత్నం మొదలుపెట్టాను. స్థానికుల సహకారంతో విజయపథంలో ముందుకు సాగుతున్నాను’’ అన్నారామె. 

ఆంక్షల వలయం
ఒడిషాలోని కోరాపుట్‌ జిల్లాలో ఓ కుగ్రామం మాది. నేను ఇప్పుడిలా కనిపిస్తున్నాను. కానీ, నా చిన్నప్పుడు అక్కడ నాగరకత తెచ్చే సౌకర్యాలేవీ లేవు. మా జీవనం మీద ఎన్నో నిబంధనలుండేవి. చీకటి పడితే వీథిలోకి అడుగుపెట్టడానికి వీల్లేదు. ఎలక్ట్రిసిటీ, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్‌ వంటివన్నీ నిషేధం. ఈ నిషేధం పైకి కనిపించేది కాదు, కానీ అమల్లో ఉండేది. హింస, దాడులు నిత్యకృత్యం. నేను చదువుకోవడానికి స్కూలుకు వెళ్తానంటే మా పేరెంట్స్‌ వణికిపోయారు. ప్రపంచంతో సంబంధం లేనట్లు జీవించడమే అక్కడి వారికి తెలిసిన జీవితం. – రూపాలీ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement