పిల్లల నామధ్యేయం.. కొత్తధనం | Changing Trend On Child Naming | Sakshi
Sakshi News home page

పిల్లల నామధ్యేయం.. కొత్తధనం

Published Mon, Oct 19 2020 7:51 AM | Last Updated on Sun, Oct 17 2021 1:52 PM

Changing Trend On Child Naming - Sakshi

ఓ 30 లేదా 40 ఏళ్లు వెనక్కి వెళ్లండి. మన ముందు తరాల వారి పేర్లన్నీ గ్రామదేవతలు, కులదైవాలు కలిసొచ్చేలా ఉండేవి. ఇప్పుడలా కాదు.. నవతరం తల్లిదండ్రులు తమ పిల్లలకు పేర్లు పెట్టడానికి ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారు. అందుకే పుస్తకాలు, ఇంటర్‌నెట్‌లో అన్ని రకాలుగా వడపోత పట్టి మరీ పేర్లు వెతుకుతున్నారు. పేరు పలకడానికి సులువుగా, వినసొంపుగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అందుకే నామకరణం చేసేటప్పుడు అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. నక్షత్రం, ఇష్టదైవం, అభిరుచి, తదితర అంశాల ఆధారంగా ఉత్తమ పేరు ఎంచుకుంటున్నారు. తక్కువ అక్షరాలు, అర్థవంతమైన వాటితో నామకరణం చేస్తున్నారు. ‘మీ అబ్బాయా..’ ‘మీ అమ్మాయా..’ ‘ఏం పేరు..?’ ‘మీ పిల్లల్లాగే పేర్లూ ముద్దు ముద్దుగా ఉన్నాయి..’ అని ఎవరైనా అంటే ఆ క్షణం తల్లిదండ్రులు సంబరపడిపోతున్నారు.

సాక్షి, వెలిగండ్ల: సాధారణంగా పుట్టిన పాప.. బాబుకు పేరు పెట్టడానికి 21 రోజులకు నామకరణ మహోత్సవం నిర్వహిస్తారు. వీలుకానివారు 3వ నెలలో ఆ కార్యక్రమం చేస్తారు. జన్మ నక్షత్రం, ఇష్టదైవం, పూరీ్వకులు, ప్రదేశాల ప్రాధాన్యత ఆధారంగా తమ అభిరుచికి అనుగుణంగా తల్లిదండ్రులు పేరు ఎంపిక చేస్తున్నారు. నామకరణ మహోత్సవం రోజున పాప చెవి వద్ద ఆ పేరుతో పిలవడం ఆనవాయితీగా వస్తోంది. 

పూర్వీకులు, దేవుళ్లు, సినీ నటులు  
గతంలో ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండేవి. తల్లిదండ్రులు, తాత, ముత్తాతలు అంటే అపారమైన భక్తి, గౌరవం, ప్రేమ. వారి మరణానంతరం కుటుంబంలోని వారికి సంతానం కలిగితే తమ పూర్వీకులే మళ్లీ పుట్టారని భావించి వారి పేరే పెట్టేవారు. మరికొందరు తమ ఇష్టదైవం పేరు పెట్టడానికి ఆసక్తిచూపేవారు. సంతానం కలిగితే ‘స్వామి.. మీ పేరు పెట్టుకుంటాం..’ అని తల్లిదండ్రులు ముందే మొక్కుకుని పిల్లలు కలిగాక దేవుని పేరు పెట్టేవారు. దేశభక్తి మెండుగా ఉన్నవారు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన నేతల పేర్లను తమ పిల్లలు, మనుమలు, మనుమరాళ్లకు పెట్టడం గర్వంగా భావించేవారు. ఇంకొందరు తమ అభిమాన సినీ నటులు పేర్లు పిల్లలకు పెట్టి మురిసిపోతుంటారు. అంతటివారు కావాలని కోరుకునేవారు. ఈ పేర్లన్నీ దాదాపు పొడవుగా(అక్షరాలు ఎక్కువగా) ఉండేవి. 

మారుతున్న దృక్పథం  
క్రమేణా పాత సంప్రదాయం కనుమరుగైంది. కట్టూబొట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లలకు పెట్టే పేరులోనూ ఆధునికత కనిపించేలా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెండు లేదా మూడు అక్షరాలు కలిగిన పేర్లు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

ముద్దు పేర్లు 
పేరుతో కాకుండా పిల్లలను ముద్దుపేరుతో పిలవడం ఇటీవల కాలంలో సాధారణమైంది. ఇదీ ప్రతి ఇంటిలోనూ కనిపిస్తోంది. మిన్ని, బన్ని, డాలి, హనీ, బబ్లూ, పింకూ, చింటు, టింకు, చిన్న, పింకి, యాపిల్, చెర్రీ, సన్నీ, అమ్ములు, ఫ్రూటీ తదితర పేర్లు మనకు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement