షుగర్, బీపీ వంటి జీవనశైలికి సంబంధించిన రుగ్మతలు వస్తే జీవితాంతం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అసవరం. ఆహారంలో ఉప్పు, చక్కెరలు తగ్గించి తీసుకోవడంతోబాటు ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. వీటితోపాటు మన వంటింట్లో దొరికే కొన్ని రకాల మసాలా దినుసులను తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచవచ్చు. అవేమిటో తెలుసుకుందాం.
అధికంగా దాహం వేయడం, ఆకలి, తరచు మూత్రవిసర్జన చేయవలసి రావడం, బరువు తగ్గడం, చూపు మసకబారడం, చేతులు, కాళ్ళు తిమ్మిరిగా ఉండడం, గాయాలైనప్పుడు త్వరగా మానకపోవడం వంటి కొన్ని లక్షణాలను బట్టి షుగర్‌ను గుర్తించవచ్చు. ఇది అదుపులో ఉండకపోతే కాలేయం, మూత్రపిండాలు, గుండె, మెదడు, కంటికి సంబంధించిన సమస్యలొస్తాయి. అయితే, బ్లడ్ షుగర్‌ని నియంత్రణలో ఉంచే కొన్ని మసాలా దినుసులున్నాయి. వాటిని సక్రమంగా వాడటం వల్ల ఎటువంటి ఇతర దుష్ఫలితాలూ లేకుండా షుగర్‌ను అదుపులో ఉంచవచ్చు.
దాల్చిన చెక్క
ఆహార పదార్థాలకు సువాసనను, రుచిని ఇచ్చే దాల్చిన చెక్క జీవక్రియల వేగాన్ని పెంచడానికి దోహద పడుతుంది. కొన్ని రకాల వ్యాధులకు ఆయుర్వేదంలో దీనిని విరివిగా వాడతారు. దాల్చిన చెక్క ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. దీనిని కషాయంలా చేసుకుని తాగడం మంచిది.
మిరియాలు
మిరియాలు, వాటి ఆకుల్లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తం లో ఇన్సులిన్ సీరమ్‌ని పెంచుతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులను అదుపు చేయడంలో సహకరిస్తాయి. వీటిని ఏదో ఒక విధంగా ఆహారంలో చేర్చుకోవడం మంచిది. కుదరని పక్షంలో మిరియాల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగొచ్చు.
మెంతులు
మధుమేహాన్ని అదుపు చేసి, బరువు తగ్గించడంలో మెంతులు బాగా పనిచేస్తాయి. వీటిని తీసుకోవడం జుట్టుకి కూడా మంచిది. ఉదయాన్నే పరగడపున మెంతులు నానబెట్టిన నీటిని తాగితే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. ఇందులోని పీచుపదార్థం, కర్కుమిన్లు రక్తంలో చక్కెరస్థాయులను తగ్గిస్తాయి.
యాలకులు
పరమాన్నానికి, ఇతర రకాల స్వీట్లకు యాలకుల పొడిని జత చేస్తే వచ్చే రుచే వేరు. పచ్చి యాలకులని మనం బిర్యానీ, టీలో కలిపి తాగొచ్చు. ఇందులో ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్నాయి. యాలకులని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు తగ్గుతాయి. ఇది లివర్ పని తీరును మెరుగు పరుస్తుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
జీలకర్ర
డయాబెటిస్ లక్షణాలను, ప్రభావాలను జీలకర్ర తగ్గిస్తుంది. యాంటీడయాబెటిక్ ఔషధాల్లో కూడా దీనిని వినియోగిస్తారు. ఇన్సులిన్‌కు మీ శరీరం స్పందించే తీరును ప్రభావితం చేస్తే యూరియా స్థాయిని కూడా ఈ జీలకర్ర తగ్గిస్తుందని పరిశోధకులు తేల్చారు. అంతేకాకుండా రక్తంలో బ్లడ్ షుగర్ స్థాయి నార్మల్ రేంజ్‌లో ఉండేలా చేస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. అందువల్ల ఆహారం లో జీలకర్రను విరివిగా ఉపయోగించాలి. రోజూ ఒక స్పూను జీలకర్రను గ్లాసు నీటిలో నానబెట్టి ఆ నీటిని వడగట్టి తాగడం మధుమేహులకు మంచి మందులా పని చేస్తుంది.
లవంగాలు
షుగర్ వ్యాధిగ్రస్తులు లవంగాలను వాడటం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా ఆహారంలో లవంగాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు లవంగం నూనెను పై పూతగా రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. మధుమేహం ఉన్న వారు రోజు విడిచి రోజు లవంగాలతో చేసిన టీ తాగడం సత్ఫలితాలనిస్తుంది.
పైన చెప్పుకున్న మసాలా దినుసులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలూ లేకండా డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment