ఇద్దరు మహిళల వల్ల దేశంలోకి చీతాలొచ్చాయి. ఇకపై మధ్యప్రదేశ్ అడవుల్లో అవి చూపులు రిక్కించి వాయువేగంతో వేటాడనున్నాయి. నమీబియా నుంచి చీతాలు భారత్‌లో అడుగు పెట్టడానికి ఇరు దేశాల మధ్య కోఆర్డినేటర్‌గా పని చేసిన డాక్టర్ లారీ మార్కర్ ఒక కారణం. అలాగే చీతాల సంరక్షణలో తర్ఫీదు పొందిమన దేశంలో ఏకైక ‘చీతా లేడీ’గా గుర్తింపు పొందిన ప్రద్న్యా గిరాడ్కర్ కృషి మరో కారణం. చీతాల ప్రవేశ ప్రయోగం విజయవంతం అవుతుందని అంటోంది ప్రద్న్యా.
70 ఏళ్ల క్రితం నేటి చత్తిస్‌గఢ్‌లోని చివరి మూడు చీతాలను అక్కడి రాజు వేటాడి చంపడంతో మన దేశంలో చీతాలు అంతరించిపోయాయి. అప్పటినుంచి వాటిని తిరిగి దేశంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఉపయోగం లేదని ఒక వర్గం, చీతాలు వృద్ధి చెందితే పర్యావరణానికి మేలు అని ఒక వర్గం వాదులాడుకున్నాయి.
‘అంతరించిపోయిన చీతాలను తిరిగి దేశంలో ప్రవేశపెట్టడం ద్వారా అవి బతికి బట్టకడతాయనడానికి అధ్యయనాలు ఏమిటో చెప్పండి’ అని సుప్రీంకోర్టు ఈ ప్రయత్నాన్ని ప్రశ్నించింది. అన్ని అడ్డంకులు ఇన్నాళ్లకు తీరి నమీబియా నుంచి విమానంలో ఎగిరొచ్చిన 8 చీతాలు మధ్యప్రదేశ్‌లోని కూనో అభయారణ్యంలో రెండు పాయింట్లలో విడుదలయ్యాయి. ఈ మొత్తం కార్యక్రమం వెనుక ఇద్దరు స్త్రీలు ఉన్నారు.
‘మనుషుల చేతుల్లో చీతాలు అంతరించిపోయాయి. ఇవాళ మనుషులే వాటిని కాపాడాలి. ఎందుకంటే చీతాలు తాము నివసించే వాతావరణానికి అలవాటుపడటానికి ఐదు నుంచి పదేళ్లు తీసుకుంటాయి’ అంటారు లారీ మార్కర్. అమెరికాకు చెందిన ఈ జువాలజిస్టు ప్రపంచంలోనే ‘చీతా నిపుణురాలి’గా గుర్తింపు పొందారు. చీతాల సంరక్షణ కోసం ‘చీతా కన్సర్వేషన్ ఫండ్’ అనే సంస్థ స్థాపించి ఆఫ్రికన్ దేశాలలో వాటి సంరక్షణకు కృషి చేస్తున్నారు.
గత 12 సంవత్సరాలుగా మన దేశంలో చీతాల ప్రవేశానికి సాగిన ప్రయత్నంలో నమీబియాకు, మన దేశానికి మధ్య సంధానకర్తగా పని చేశారు. ‘రాబోయే సంవత్సరకాలంలోని దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి మరిన్ని చీతాలు భారత్‌కు చేరుకుంటాయి’ అని తెలిపారామె. ‘నమీబియాలో గడ్డి మైదానాలు కూనో అభయారణ్యంలో పొదలకు దగ్గరగా ఉంటాయి. చీతాలు వేగంగా పరిగెత్తి వేటాడేంత విశాలత ఇక్కడ లేకపోవచ్చు. కాని అవి పొంచి ఉండి కూడా వేటాడతాయి. అది సమస్య కాదు. జనావాసాల వైపు వచ్చినప్పుడు వాటిని కాపాడే చైతన్యమే కావాల్సింది’ అంటారు లారీ మార్కర్.
చీతా కూడా రాజే
‘పులి అడవికి రాజైతే చీతా గడ్డిమైదానాలకు రాజు. చీతాను కాపాడా లంటే గడ్డి మైదానాలను కూడా కాపాడాలి. అలా కాపాడితే గడ్డి మైదానాలపై ఆధారపడే జంతువులన్నీ కాపాడబడతాయి. దానివల్ల జీవ వైవిధ్యం కొనసాగుతుంది’ అంటారు ప్రద్న్యా గిరాడ్కర్. ఈమె ‘వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ’ అనే సంస్థను స్థాపించి వన్యప్రాణుల సంరక్షణలో శాస్త్రీయమైన విజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో చీతాల పునఃప్రవేశాన్ని గట్టిగా సమర్థించిన పర్యావరణ నిపుణురాలు ఈమె.
‘పులుల సంరక్షణ విధానాల గురించి నేను ముంబై యూనివర్సిటీలో పిహెచ్‌డి చేశాను. చీతాలు దేశానికి తేవాలి అనే వాదనకు నేను సమర్థింపు ఇచ్చాను. 2011లో నమీబియాలో చీతాల సంరక్షణ గురించి లారా పార్కర్ నిర్వహించిన శిక్షణా శిబిరానికి మన దేశం నుంచి నేను ఎంపికయ్యాను. నమీబియా వెళ్లి అక్కడి ఒట్టిఒరోన్గో అభయారణ్యంలోని 52 చీతాల సంరక్షణలో పాటించవలసిన విధానాలను తెలుసుకున్నాను. మనిషికీ మృగానికీ మధ్య ఉండే వైరం తెలిసింది. అలాగే మనిషి, మృగం కలిసి బతకక తప్పని స్థితిని కూడా తెలుసుకున్నాను’ అంటారు ప్రద్న్యా గిరాడ్కర్.
చీతాలు మనదేశం రావడానికి కావలసిన మొత్తం ప్లాన్‌ను లారీ మార్కర్ తయారు చేస్తున్నప్పుడు ప్రద్న్యా ఆ పనిలో పాల్గొన్నారు. ‘చీతాలకు తక్కువ స్వేచ్ఛ ఆ తర్వాత ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. వాటిని శాటిలైట్ కాలర్స్ ద్వారా గమనిస్తూ వస్తాం. మరీ అడవికి దూరంగా వెళ్లిపోయినప్పుడు వాటిని తిరిగి సురక్షిత ప్రాంతానికి చేర్చడం ముఖ్యం. నమీబియాలోని చీతాల ఆహారం మన కూనోలో దొరికే ఆహారానికి దగ్గరే. కూనో అభయారణ్యంలో లేళ్లు, దుప్పులు, కృష్ణ జింకలు దండిగా ఉన్నాయి. అవి చీతాలకు సరిపోతాయి’ అంటారామె.
‘చీతాలు మన దేశంలో నిలదొక్కుకుంటే పులులకు సంబంధించిన ఆరు జాతులూ మన దగ్గర ఉన్నట్టవుతుంది. అంతేకాదు టూరిజం పెరుగుతుంది. ఇప్పుడు చేసిన ఖర్చు సులభంగా తిరిగి వస్తుంది. అయితే సవాళ్లు కూడా ఉంటాయి. మన దేశంలో గతంలో చీతాలు ఉన్నాయి కనుక ఆఫ్రికా చీతాలకు మన చీతాలకు జన్యుపరంగా చాలా తక్కువ వ్యత్యాసం ఉంది కనుక అవి ఇక్కడ మనుగడ సాధిస్తాయనే ఆశిస్తాను’ అంటారామె. ఒక ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ ఘట్టంలో ఉన్న ఈ ఇద్దరు స్త్రీలు అభినందనీయులు.
Comments
Please login to add a commentAdd a comment