Cyber Crime Prevention Tips: Protect Yourself From Loan App Online Gift Fraud - Sakshi
Sakshi News home page

Cyber Crime Prevention Tips: రుణం కోసం అడ్వాన్స్‌.. చెల్లిస్తున్నారా?! అయితే ప్రమాదంలో పడ్డట్లే! ఈ జాగ్రత్తలు పాటించండి!

Published Thu, Jul 14 2022 12:43 PM | Last Updated on Fri, Jul 15 2022 11:14 AM

Cyber Crime Prevention Tips: Protect Yourself From Loan App Online Gift Fraud - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాగర్‌ బిటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ‘లోను తీసుకోండి, నెలా నెలా ఆ మొత్తాన్ని తీర్చేయండి’ అని ఫోన్‌లో మెసేజ్‌ చూసి ఎగిరిగంతేసినంత పని చేశాడు. తండ్రి ఫీజు కోసం ఇచ్చిన డబ్బు ఖర్చు అయిపోయింది. ఎలా అనుకున్న సమయంలో కరెక్ట్‌గా వచ్చింది అనుకున్నాడు.

లింక్‌ ద్వారా తన వివరాలన్నీ ఇచ్చాడు. తర్వాత ఫోన్‌ కాల్‌ వచ్చింది. కాలర్‌ మాట్లాడుతూ ‘ముందస్తుగా ఫీజు నిమిత్తం కొంత అమౌంట్‌ కడితే లోన్‌ మొత్తం మీ అకౌంట్‌లో చేరుతుంది’ అని చెప్పాడు. దీంతో స్నేహితుల దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకొని ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఆ తర్వాత ఎటువంటి ఫోన్‌ కాల్‌ రాలేదు. 
∙∙ 
రాజీ సొంతంగా డబ్బు సంపాదించి అమ్మనాన్నలకు సాయం చేయాలనుకుంది. అందుకోసం ఇంటర్నెట్‌లో ఆప్షన్ల కోసం వెతికింది.అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలో ఉన్న ప్రకటనలోని నెంబర్‌కు ఫోన్‌ చేసింది. ఫోన్‌ మాట్లాడిన కాలర్‌ తమ‘యాప్‌’ను డౌన్‌లోడ్‌ చేయమని అడిగాడు.

అలాగే, అతను చెప్పినట్టు రిజిస్ట్రేషన్‌ ఫారమ్‌ను పూర్తి చేసింది. ఆ యాప్‌ అకౌంట్‌ లో రూ.4.50 లక్షలు కమీషన్‌ ఉంది. చెప్పలేనంత ఆనందం వేసింది రాజీకి. టాస్క్‌ పూర్తి చేస్తే, రూ.2.50 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చు అని ఉంది. కానీ, టాస్క్‌ ఆప్షన్స్‌ పూర్తి చేయలేకపోయింది.

కంపెనీ మెంబర్‌షిప్‌ కార్డ్‌ కోసం ముందుగా రూ.70 వేలు కడితే రిజిస్టర్‌ అయిపోవచ్చని, రెండు రోజులే గడువు అని చెప్పడంతో తన స్నేహితుల నుంచి, తల్లి, తండ్రి నుంచి డబ్బు సేకరించి ఆ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఆ తర్వాత సదరు యాప్‌ నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ లేదు. ఫోన్‌ లేదు. మోసపోయానని అర్ధమైంది.
∙∙ 
ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ వేదికగా అడ్వాన్స్‌ చెల్లించమని ఊరించే రుణాలు, లాటరీలు, గిఫ్ట్‌లు, షాపింగ్‌ మోసాలు.. అధికంగా ఉన్నాయి. 

రుణ మోసాలు
►చాలా మందికి డబ్బు అత్యవసరం అయినప్పుడు ఆన్‌లైన్‌ లోన్‌ తక్షణ పరిష్కారంగా కనిపిస్తుంది. అయితే, కొంతమంది మోసగాళ్లు మీ తక్షణ అవసరం నుంచి లాభం పొందడానికి పొంచి ఉంటారు. నాన్‌–పబ్లిక్‌ లోన్‌ స్కామ్‌ల గురించి తెలుసుకుంటే మోసాల బారిన పడే అవకాశం ఉండదు. 

►రుణం తీసుకోవడానికి ముందస్తుగా మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. రుణం మంజూరు చేయడానికి రుసుమును అడగడం అంటే స్కామ్‌ అని గుర్తించాలి. మీ క్రెడిట్‌ లావాదేవీల స్కోర్‌తో పాటు అనేక అంశాలపైన ‘రుణం ఇవ్వడం’ అనేది ఆధారపడి ఉంటుంది. 

►బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లను చాలా రుణ స్కామ్‌ వెబ్‌సైట్‌లు అనుకరిస్తాయి. అందుకని, మీరు ఎల్లప్పుడూ నెట్‌ అడ్రస్‌ను చెక్‌చేసుకోవాలి. ఆఫర్‌ పరమిత కాలానికి మాత్రమే, త్వరలో గడువు ముగిసే అవకాశం ఉన్నందున రుణం వెంటనే పొందండి అని ఇ–మెయిల్‌ లేదా మెసేజ్‌లు, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు కనిపించినా జాగ్రత్త పడండి. బ్యాంకులు ఇటువంటి అత్యవసర మార్గాన్ని సృష్టించి మిమ్మల్ని మోసగించవు. 

►మోసగాళ్లు అత్యవసరంగా డబ్బు అవసరమయ్యే వ్యక్తులకు మెసేజ్‌లు, ఇ–మెయిల్‌లు పంపుతారు, ఫోన్‌ కాల్స్‌ చేస్తారు. ఇటువంటివారి ఉద్దేశ్యం మీ వివరాలను సేకరించడం, డబ్బు దొంగిలించడం. 

లాటరీ మోసాలు 
►ఇటీవల జరిగిన లాటరీ స్కామ్‌లలో మోసగాళ్లు అధికంగా ఎరగా వేసేది కౌన్‌ బనేగా కరోడ్‌పతి లాటరీ. మీ మొబైల్‌ నెంబర్‌ గెలిచినట్టు తెలియని నంబర్ల నుండి బాధితులకు వాట్సప్‌ సందేశాలను పంపుతున్నారు. లాటరీ గురించి చెప్పడానికి వాట్సప్‌ సందేశంలో ఉన్న నంబర్‌కి ఫోన్‌ చేయమని ఉంటుంది.

►బాధితుడు ఆశపడి ఆ నెంబర్‌ను సంప్రదించినప్పుడు మోసగాడు లాటరీ ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్టీ చెల్లించాలని చెబుతాడు. బాధితుడు ఆ డబ్బును చెప్పిన అకౌంట్‌లో డిపాజిట్‌ చేసిన తర్వాత మరేదో సాకుతో ఎక్కువ మొత్తాన్ని డిమాండ్‌ చేస్తారు.

►బాధితుడి చేత వివిధ బ్యాంకు ఖాతాలలో డబ్బు జమ చేయించేలా వారి మాటల ద్వారా ప్రేరేపిస్తారు. మోసం వారాలు, నెలల తరబడి కూడా కొనసాగుతుంది. చివరకు బాధితులు డబ్బు చెల్లించమని పట్టుబడినప్పుడు తమ ఫోన్‌ నెంబర్లను బ్లాక్‌ చేస్తారు. 

గిఫ్ట్‌ మోసాలు
►సోషల్‌మీడియాలో అప్పటికే ఉన్న అకౌంట్ల్‌ నుంచి కొన్ని ఆకర్షణీయమైన వాటిని ఎంపిక చేసుకొని, వాటి పేరుతో నకిలీ సోషల్‌ మీడియా ఖాతాలను సృష్టిస్తాడు. వాటి నుంచి సభ్యుల స్నేహితులకు రిక్వెస్ట్‌లు పంపిస్తూ ఉంటారు.

►ఎవరైతే యాక్సెప్ట్‌ చేసి, రిప్లై చేస్తున్నారో గమనించి ఆ తర్వాత వారితో మెసేజ్‌లు చేస్తుంటారు. అలా, నెమ్మదిగా వారితో కనెక్ట్‌ అయ్యేలా చేసుకొని, వ్యక్తిగత విషయాలను రాబట్టి, మోసానికి పాల్పడతారు. 

ఆన్‌లైన్‌ షాపింగ్‌ మోసాలు
►ఆన్‌లైన్‌లో కొనుగోళ్ల కోసం ప్రజలు తరచూ శోధించే ఉత్పత్తులను మోసపూరిత ప్రకటల ద్వారా పోస్ట్‌ చేస్తుంటారు. ఈ మోసగాళ్ల తాత్కాలిక వెబ్, సోషల్‌ మీడియా పోస్ట్‌లు చాలా సార్లు నిజమైన వ్యాపార సంస్థలను పోలి ఉంటాయి
►కొన్ని బ్రాండ్ల పేరుతో నకిలీ వెబ్‌ సైట్‌లను సృష్టించి, వాటిని అతి చౌకగా అందిస్తామని ప్రకటనల్లో చూపుతారు. ఆన్‌లైన్‌లో డబ్బు చెల్లించేలా ప్రేరేపిస్తారు. డబ్బు పూర్తిగా కట్టినా ఆర్డర్‌ చేసిన ప్రొడక్ట్‌ని మాత్రం పొందలేరు. 

►ఆన్‌లైన్‌లో .. ఎక్కువ ఖరీదు చేసే వస్తువును కొంటే అంతే విలువైన బహుమతిని ఉచితంగా పొందవచ్చు అనే ఆఫర్లు వస్తుంటాయి. ఎవరైనా ఆ వస్తువుని కొనుగోలు చేస్తే కస్టమర్‌ సర్వీస్‌ నుండి కాల్‌ వస్తుంది. బహుమతిని పొందడానికి ప్రాసెసింగ్‌ ఫీజు, జీఎస్టీ వంటి పేర్లు చెప్పి కొంత మొత్తాన్ని చెల్లించమని కోరుతారు. సందేహించని కొనుగోలుదారు నుంచి వివిధ బ్యాంకు ఖాతాలకు వేల రూపాయలను జమ చేసేలా ప్రేరేపిస్తారు. 
►చాలా వరకు మోసపోయిన వ్యక్తులు చెప్పే వాటిల్లో.. కోరుకున్న వస్తువు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి, ఆ¯Œ లైన్‌లోనే డబ్బులు చెల్లించినా పొందే వస్తువు అత్యంత చౌక ధర లేదా ఎందుకూ పనికిరానిది డెలివరీ అవుతుంది. 

ముందస్తు జాగ్రత్తలు
►మీరు లాటరీ లేదా బహుమతి గెలుచుకున్నారని మెసేజ్‌ వస్తే అది మోసం కావచ్చు. 
►మెసేజ్‌ను పరిశీలిస్తే సరిగా లేని డ్రాఫ్టింగ్, వ్యాకరణ లోపాలు.. వంటివి కనిపిస్తాయి. 

►∙ఈ–మోసాలు మీ దురాశను ఉపయోగించుకుంటాయి. 
►ఏదైనా నిజమైన లాటరీ లేదా బహుమతి అయితే టాక్స్‌ లేదా ఇతర ఛార్జీలు వారే కట్‌ చేసుకొని, మొత్తాన్ని చెల్లిస్తారు. కానీ, ముందస్తు ఛార్జీలు చెల్లించమని అడగరు. 
►ఫోన్లో అవతలి వ్యక్తి వివరాలు చెప్పమని, ముందస్తు చెల్లింపుల గురించి మాట్లాడుతున్నప్పుడు వారి మాటలను జాగ్రత్తగా గమనించాలి. మిమ్మల్ని తమ మాటల వలలో వేస్తున్నారా అనే విషయాన్ని సందేహించాలి.

ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌.
చదవండి: ఆన్‌లైన్‌ డేటింగ్‌కు బానిసైన డాక్టర్‌.. పట్టమంటాడు... వదలమంటాడు!
ఎథికల్‌ హ్యాకింగ్‌ అంటే ఏమిటి? దీనికెంత డిమాండ్‌ ఉందో తెలుసా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement