
కలర్,. కల్చర్..కట్టుబాట్లు
మడిసర్ కట్టు
కొడగు కట్టు
కున్బీ స్టైల్ కట్టు
చీర.. దాన్ని కట్టుకుంటే వచ్చే అందమే వేరు! దాని ముందు ఎన్ని మోడర్న్ డ్రెస్‌లు అయినా దిగదుడుపే.. అవెంత సౌకర్యాన్నిచ్చినా! అందుకే అందం, అనుకూలత రెండిట్లోనూ అన్నితరాలకూ చీర ఆల్‌టైమ్ ఫేవరెట్ అండ్ ఫ్యాషన్ కాస్ట్యూమ్‌గా మారింది. అలాంటి మన సంప్రదాయ కట్టుకు ప్రాంతానికో తీరు ఉంది. కొన్నిటికి వాటి వెనుక పర్యావరణహితాలు కారణాలైతే కొన్నిటికి వాతావరణ పరిస్థితులు కారణాలుగా కనపడుతున్నాయి. ఇంకొన్నిటికి భౌగోళిక స్వరూపాలు కారణంగా నిలుస్తున్నాయి.
కేరళలో కనిపించే ఆఫ్ వైట్ విత్ గోల్డెన్ బార్డర్ శారీ (ముండు)నే తీసుకుంటే.. ఆ ప్యాటర్న్ రంగుల్లో కనిపించదు. కేవలం క్రీమ్ కలర్‌లోనే కనిపిస్తుంది. కేరళ తీరప్రాంతం కాబట్టి.. రంగుల అద్దకంతో ఆ నీటిని కలుషితం చేసుకోకూడదనే పర్యావరణ స్పృహతో ముండును పర్మినెంట్‌గా క్రీమ్‌కలర్‌లో ప్యాక్ చేశారు. కూర్గ్‌కి వెళితే అక్కడ కొడగు కట్టు కనిపిస్తుంది.
పశ్చిమ కనుమల్లో ఉన్న కూర్గ్‌ను కన్నడాలో కొడగు అని పిలుస్తారు. కొడగు చీర కట్టులో పమిట కుడివైపు, కుచ్చిళ్లు వెనుకవైపు ఉంటాయి. ఇది హిల్ స్టేషన్ కాబట్టి.. నడవడానికి, రోజూవారి పనులకు సౌకర్యంగా ఉండేందుకే ఇక్కడి స్త్రీలు చీరను అలా కట్టుకుంటారు. తమిళనాడులోని బ్రాహ్మణ స్త్రీలు మడిసర్ చీరకట్టులో కనిపిస్తారు. ఇది తొమ్మిది గజాల చీర. ఇదీ అంతే... రోజూవారీ పనులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. తొమ్మిది గజాలంటే గుర్తొచ్చింది.. తెలంగాణలోని కొన్నిప్రాంతాల్లో.. మహారాష్ట్రలోనూ తొమ్మిది గజాల చీరకట్టు కనపడుతుంది. దీనికి గోచీ చీర అనే వ్యవహార నామమూ ఉంది. ఈ చీరకట్టు కనిపించే ప్రాంతంలోని స్త్రీలు (దాదాపుగా) పొలాల్లో పనిచేసేవారే! చేలల్లో దిగి పనిచేయడానికి అనువుగా ఉండేలా ఈ కట్టును కనిపెట్టుకున్నారని శారీ చరిత్రలో కనిపిస్తున్న సాక్ష్యం.
గోవాకు వెళితే.. కున్బీ కట్టు కనిపిస్తుంది. ఇది తొమ్మిది గజాల కట్టుకు ఆధునిక రూపం. మూలాలను మరవకుండా ఆధునికతనూ అలంకరించుకోవాలనే ఆసక్తిగల ఆడవాళ్లకు ఇష్టమైన కట్టు కున్బీ. ఇలాంటి వైవిధ్యమైన కట్టులతపాటు దేశం మొత్తమ్మీద 21 రకాల టెక్స్‌టైల్స్ కూడా ఉన్నాయని, ఇక్కడ కనిపించే రంగులకూ మన ప్రకృతి, పండే పంటలే ప్రేరణ, స్ఫూర్తి అని చెబుతారు రచయిత, హిస్టారియన్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, శారీ లవర్ మాళవికా సింగ్.
Comments
Please login to add a commentAdd a comment