‘మా నాన్న ఎలా బతకాలో నాకు చెప్పలేదు. తానెలా బతికాడో నన్ను చూడనిచ్చాడు’ అన్నాడు అమెరికన్ రచయిత క్లారెన్స్ బడింగ్టన్ కెలాండ్. పెద్దలు చెబితే పిల్లలు వినరు. వాళ్లు పెద్దలను గమనిస్తారు, అనుకరిస్తారు. పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే, తండ్రులు ఊరకే నీతిపాఠాలు చెబితే చాలదు. నిజాయితీగా బతికి చూపించాలి. అప్పుడు మాత్రమే పిల్లలు సరైన దారిని ఎంచుకోగలుగుతారు. తండ్రులకు గర్వకారణంగా మనగలుగుతారు. ఇంటి బరువు బాధ్యతలను మోసే తండ్రి పిల్లలకు తొలి హీరో! ఉన్నత వ్యక్తిత్వాన్ని, విలువలను పిల్లలు తండ్రి నుంచే నేర్చుకుంటారు. ఒక కుటుంబంలో తండ్రి దారి తప్పితే, పిల్లలు సరైన దారిని ఎంచుకోలేరు. రేపటి పౌరులు దారి తప్పితే, రేపటి సమాజం విలువలు కోల్పోయిన జనారణ్యంగా మిగులుతుంది.
కుటుంబంలో తల్లిదండ్రులిద్దరూ సమానమే అయినా, ప్రపంచ సాహిత్యంలో తల్లులకు దక్కిన ప్రశస్తి తండ్రులకు దక్కలేదు. అరుదుగానైనా తండ్రుల గురించి అద్భుతమైన కవిత్వం వెలువడింది. తండ్రిని త్యాగానికి ప్రతీకగా, మార్గదర్శిగా కొనియాడిన కవులు లేకపోలేదు. తన సంతానం ఉన్నతిని సమాజం పొగిడినప్పుడు పొంగిపోయే తొలి వ్యక్తి తండ్రి! ‘పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ’ అని శతకకారుడు అందుకే అన్నాడు. తండ్రులకు పుత్రోత్సాహం పుత్రుల వల్లనే కాదు, పుత్రికల వల్ల కూడా కలుగుతుంది.
చరిత్రలోను, వర్తమానంలోను అందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. సుప్రసిద్ధులైన తండ్రులు, వారికి పుత్రోత్సాహం కలిగించిన వారి పిల్లల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. అంతకంటే ముందు తండ్రుల దినోత్సవం జరుపుకోవడం వెనుకనున్న కథా కమామిషును కూడా తెలుసుకుందాం. తండ్రుల దినోత్సవం వెనుకనున్న మహిళ అంతర్జాతీయంగా మాతృ దినోత్సవం జరుపుకోవడం 1872 నుంచి మొదలైంది.
తల్లుల కోసం ప్రత్యేకంగా ఒక రోజును జరుపుకొంటున్నపుడు బాధ్యతకు మారుపేరైన తండ్రుల కోసం కూడా ఒక ప్రత్యేకమైన రోజు ఉండాలని అమెరికన్ మహిళ సొనోరా స్మార్ట్ డాడ్ తండ్రుల దినోత్సవం కోసం ప్రచారం ప్రారంభించింది. ఆమె ప్రచారం ఫలితంగా 1910లో తొలిసారిగా అమెరికాలో తండ్రుల దినోత్సవం జరిగింది. దీంతో ఆమె ‘మదర్ ఆఫ్ ఫాదర్స్ డే’గా గుర్తింపు పొందింది. క్రమంగా దీనికి ఆదరణ పెరగడంతో అంతర్జాతీయ స్థాయికి విస్తరించి, 1972 నుంచి ఏటా జూన్ నెల మూడోవారం అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం జరుపుకోవడం మొదలైంది.
జవహర్‌లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ
జవహర్‌లాల్ నెహ్రూ ఇందిరా గాంధీ ఒక తండ్రి, ఆయన సంతానం దేశాధినేతలుగా కొనసాగిన సందర్భాలు అరుదు. స్వాతంత్య్ర భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తన కూతురు ఇందిరను తనంతటి నేతగా తీర్చిదిద్దారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను జైలులో పెట్టినప్పుడు ఆయన జైలు నుంచి తన కూతురికి స్ఫూర్తిమంతమైన ఉత్తరాలు రాసేవారు. తన తండ్రి తనకు రాసిన ఉత్తరాలు తనను ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు, మనుషులపై ఆపేక్షను, ప్రకృతిపై ప్రేమను పెంచుకునేందుకు దోహదపడ్డాయని ఇందిరా గాంధీ ఒక సందర్భంలో చెప్పారు.
బ్రిటిష్ పాలన నుంచి మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన నెహ్రూ 1964 మే 27న కన్నుమూసే వరకు ప్రధానిగా కొనసాగారు. స్వాతంత్య్ర భారత దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఆయన అహరహం పాటుపడ్డారు. దేశ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఊతమిచ్చే అనేక నిర్ణయాలు తీసుకున్నారు. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఇందిర తోటి కాంగ్రెస్ నాయకుడైన ఫిరోజ్ గాంధీని ప్రేమించి పెళ్లాడారు. తండ్రి ప్రధాని పదవిలో ఉండగానే, 1959లో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.
నెహ్రూ మరణానంతరం లాల్‌బహదూర్ శాస్త్రి ప్రధాని పదవి చేపట్టగా, ఆయన మంత్రివర్గంలో ఇందిరా గాంధీ తొలిసారిగా మంత్రి పదవి చేపట్టారు. లాల్‌బహదూర్ శాస్త్రి ఆకస్మిక మరణానంతరం ప్రధాని పదవి చేపట్టిన ఇందిరా గాంధీ 1975 ఎమర్జెన్సీని అమలులోకి తెచ్చి, ఆ తర్వాత 1977లో వచ్చిన ఎన్నికల్లో జనతా పార్టీ చేతిలో ఓటమి చవిచూశారు. జనతా పార్టీ పూర్తికాలం అధికారంలో కొనసాగలేక కుప్పకూలిపోవడంతో 1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ తిరిగి అధికారంలోకి వచ్చారు. బ్యాంకుల జాతీయీకరణ వంటి సాహసోపేతమైన చర్యలతో ఇందిరా గాంధీ దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేసి, తండ్రికి తగ్గ కూతురిగా పేరుపొందారు.
పండిట్ రవిశంకర్ అనౌష్కా శంకర్
భారతీయ సంగీత దిగ్గజాల్లో పండిట్ రవిశంకర్ ప్రముఖుడు. సితార్ వాద్యానికి పర్యాయపదంగా మారిన రవిశంకర్ సంగీతరంగంలో ఎన్నో అద్భుతాలు చేశారు. తొలినాళ్లలో తన సోదరుడు ఉదయ్‌శంకర్‌తో కలసి నృత్యం చేసుకుని, దేశ విదేశాల్లో నృత్య ప్రదర్శనల్లో పాల్గొన్నా, అనతి కాలంలోనే నృత్యాన్ని విడిచిపెట్టి, సంగీతాన్ని తన రంగంగా ఎంచుకున్నారు. నాటి ప్రఖ్యాత విద్వాంసుడు అల్లాఉద్దీన్ ఖాన్ వద్ద సితార్ నేర్చుకున్నారు. ప్రస్తుత సంగీతరంగంలో ప్రాచుర్యం పుంజుకున్న ఫ్యూజన్ ప్రయోగాలను రవిశంకర్ దశాబ్దాల కిందటే చేశారు. ఎందరో పాశ్చాత్యులకు హిందుస్తానీ సంగీతం నేర్పించారు. సంగీతంపై అభిరుచి కనబరచిన తన కూతురు అనౌష్కా శంకర్‌ను అద్భుతమైన విద్వాంసురాలిగా తీర్చిదిద్దారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల్లో మాదిరిగా సంగీత రంగంలో వారసత్వం పెద్దగా పనిచేయదు. పిల్లలకు స్వతహాగా అభిరుచి, ఆసక్తి ఉంటే తప్ప తండ్రుల అడుగుజాడల్లో ఈ రంగంలో రాణించలేరు. పండిట్ రవిశంకర్ కూతురు అనౌష్కా శంకర్ తండ్రి అడుగుజాడల్లోనే సితార్ విద్వాంసురాలిగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తుండటం ఒక అరుదైన విశేషం. అనౌష్కా తొమ్మిదేళ్ల వయసులోనే తన తండ్రి రవిశంకర్ శిక్షణలో సితార్‌పై సరిగమలు పలికించడం నేర్చుకున్నారు. హైస్కూల్ చదువు పూర్తయ్యాక, కాలేజీలో చేరకుండా పూర్తిగా సంగీతానికే అంకితం కావాలని నిర్ణయించుకుని, తండ్రి ఆధ్వర్యంలో రోజుకు ఎనిమిది గంటలు సాధన చేస్తూ విద్వాంసురాలిగా ఎదిగారు. ఎన్ని శైలీభేదాలు ఉన్నా, సంగీతం విశ్వజనీనమైనదని తన తండ్రి నమ్మేవారని, ఆయన నుంచే విభిన్న శైలులకు చెందిన సంగీతాన్ని సమ్మేళనం చేయడం నేర్చుకున్నానని, సంగీతంలో తనకు గురువు, దైవం, మార్గదర్శి, స్ఫూర్తిప్రదాత తన తండ్రేనని అనౌష్కా శంకర్ చెబుతారు.
ధీరూభాయ్ అంబానీ ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ
భారతీయ పారిశ్రామిక రంగంలో టాటా, బిర్లాల ఆధిపత్యం కొనసాగుతున్న కాలంలో ధీరూభాయ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా చరిత్ర సృష్టించారు. సామాన్య గ్రామీణ ఉపాధ్యాయుడి కొడుకుగా పుట్టిన ధీరూభాయ్ ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నారు. ఉపాధి వేటలో భాగంగా యెమెన్ వెళ్లి, అక్కడ కొంతకాలం ఒక పెట్రోల్ పంపులో పనిచేశారు. యెమెన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చేశాక తన సమీప బంధువు చంపక్‌లాల్ దమానీతో కలసి ‘మజిన్’ పేరుతో ఎగుమతులు దిగుమతుల వ్యాపారం ప్రారంభించారు.
కొంతకాలానికి చంపక్‌లాల్‌తో భాగస్వామ్యాన్ని వదులుకుని ధీరూభాయ్ సొంతగా వ్యాపారంలోకి దిగారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించి, తొలుత పాలియెస్టర్ వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తర్వాత అంచెలంచెలుగా దాన్ని వివిధ రంగాలకు విస్తరించారు. ధీరూభాయ్ తన కొడుకులు ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీలకు వ్యాపార నిర్వహణలోని మెలకువలను నేర్పించారు. ధీరూభాయ్ 2002లో మరణించే నాటికి రిలయన్స్ గ్రూప్ భారతీయ పారిశ్రామిక రంగంలోనే అగ్రస్థానంలో ఉండేది.
తండ్రి మరణం తర్వాత అన్నదమ్ముల మధ్య పొరపొచ్చాలు ముదరడంతో 2004లో రిలయన్స్ గ్రూప్ రెండుగా విడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముకేశ్ అంబానీ చేతికి, రిలయన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్ అనిల్ అంబానీ చేతికి వచ్చాయి. అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని గ్రూప్ కొంత వెనుకబడినా, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అగ్రగామిగా కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment