పెళ్లి కుదిరిందంటే చాలు అలంకరణ వస్తువుల ఎంపికలో హడావిడి మొదలవుతుంది. వాటిలో అందమైన దుస్తులదే అగ్రస్థానం. నవ వధువు అన్ని సమయాల్లో అందంగా ఉండటం అంటే ఆమె భావి జీవితం ఆనందంగా ఉండబోతోందనడానికి సూచిక. పెళ్లిరోజు మాత్రమే కాదు ముందు జరిగే ఎంగేజ్‌మెంట్, ఆ తర్వాత జరిగే రిసెప్షన్.. ప్రతి వేడుక ఘనంగా ఉండాలని చూస్తారు. అందుకు మరో ఎంపిక అవసరం లేని కళా వైభవాన్ని పంకజ్.ఎస్ డిజైన్లు అందిస్తాయి.
రాచకళలో సమైక్యత
రాజసం, కవిత్వం, ఆధ్యాత్మికం, కళాత్మకం గురించి ఒకేసారి వివరించాలంటే పంకజ్.ఎస్ డ్రెస్ డిజైన్స్‌ను చూస్తే చాలు. భారతీయ చిత్రకళా సోయగం, కళాకారుల పనితనానికి గౌరవం తన డిజైన్స్ ద్వారా చూపుతారని ఎవ్వరైనా ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
కృష్ణ సౌందర్యం
రాధాకృష్ణుల ప్రణయ సౌందర్యాన్ని డిజైన్స్‌లో రూపుకట్టాలంటే అందుకు ఇతిహాస ఘట్టాలు చాలా ప్రధానమైనవి అంటారు ఈ డిజైనర్. ఢిల్లీలోని నోయిడాలో ఉంటున్న ఈ డిజైనర్ తన డిజైన్స్‌కి ఉదయపూర్‌లోని కళాకారులచే శ్రీకృష్ణుని చిత్రాలను ఫ్యాబ్రిక్‌పై డిజైన్స్‌గా తీసుకున్నారు. రాధాకృష్ణుల నృత్యం, ఆవులు, మర్రి ఆకులు, ఆలయ శిల్పకళా సౌందర్యాన్ని అంచులుగా కళ్లకు కడతారు.
ఈ డిజైన్స్‌లో విలువైన పచ్చలు, ముత్యాలు, జర్దోసి, గోటాపట్టీలు గ్రాండ్‌గా అమరిపోతాయి. కృష్ణుడి గురించి శ్లోకాలను కాలిగ్రాఫిక్ పద్ధతిలో దారంతో తీసుకు వచ్చిన డిజైన్స్ వీటిలో చూడవచ్చు. శ్యామవర్ణంలో గొప్పగా అలంకరించిన బెనారసీ టిష్యూ చీరపైన యమునానది, నాట్యం చేస్తున్న నెమళ్లు, వికసించే తామరల మధ్య వేణువు వాయిస్తున్న శ్రీకృష్ణుడి చిత్రంతో భారీగా అలంకరించిన పల్లూ ఉంటుంది. బ్లౌజ్ డిజైన్స్ మీద జరీతో చేసిన నవరత్న భూషితమైన ఎంబ్రాయిడరీ నవవధువులను మరింత గ్రాండ్‌గా చూపుతాయి.
Comments
Please login to add a commentAdd a comment