ఆ పక్షులు మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి | Harakiri Birds End Their Life In Assam Jatinga Village | Sakshi
Sakshi News home page

అంతుచిక్కని పక్షి కథ!

Published Mon, Feb 15 2021 8:35 PM | Last Updated on Sat, Dec 3 2022 4:21 PM

Harakiri Birds End Their Life In Assam Jatinga Village - Sakshi

అస్సాం అనగానే మనకు ‘అస్సాం టీ’ గుర్తుకు వస్తుంది. అందమైన అమ్మాయి వెదురుబుట్టను వీపునకు కట్టుకుని ముని వేళ్లతో టీ ఆకును కోస్తున్న టీ పౌడర్‌ యాడ్‌ను మర్చిపోలేం. ఈశాన్య రాష్ట్రాలనగానే అదో కొత్త లోకం అనిపిస్తుంది. కానీ మన తమిళనాడు, కేరళలను తలపించే దృశ్యాలు అక్కడ ఎక్కువగానే కనిపిస్తాయి. మనం ఊటీని నీలగిరులు అన్నట్లుగానే అస్సాంలోని నీలిరంగు కొండలను ‘బ్లూ మౌంటెయిన్స్‌’ అంటారు. ఇక్కడ హఫ్లాంగ్‌ అనే చిన్న కొండ ఆ రాష్ట్రానికి ఉన్న ఏకైక హిల్‌స్టేషన్‌. హఫ్లాంగ్‌ అంటే తెల్ల చీమల గుట్ట అని అర్థం. 

తూర్పు స్విట్జర్లాండ్
హప్లాంగ్‌ చిన్న పట్టణం, జనాభా నలభై వేలకు మించదు. సముద్ర మట్టానికి 680 మీటర్ల ఎత్తులో, గువాహటి నగరానికి 355 కి.మీ.ల దూరాన ఉంది. పాశ్చాత్య టూరిస్టులు ఈ ప్రదేశాన్ని స్విట్జర్లాండ్‌తో పోలుస్తూ ‘స్విట్జర్లాండ్‌ ఆఫ్‌ ఈస్ట్‌’ అన్నారు. నాగాలాండ్‌ను కూడా ఇదే విశేషణంతో చెప్పుకుంటారు. హఫ్లాంగ్‌ టూర్‌లో ప్రధానమైన విశేషం హఫ్లాంగ్‌ సరస్సు. ఇది మంచి నీటి సరస్సు. నీళ్లు, పడవ కనిపిస్తే పిల్లలు ఊరుకోరు కాబట్టి పిల్లలతో టూర్‌కెళ్లిన వాళ్లు ఎలాగూ బోటు షికారు చేసి తీరతారు. కానీ మేఘాలు చేతికి అందుతాయేమో అన్నట్లుండే హఫ్లాంగ్‌ కొండ మీద బోటు షికారు చేయడం పెద్దవాళ్లకు కూడా మధురానుభూతిగా మిగులుతుంది.

హప్లాంగ్‌ పూర్తిగా ఆదివాసీల నేల. మిజో, నాగా, దిమాసా, మిమార్, కుకి, హ్రాంగ్‌కోల్‌ వంటి తెగల వాళ్లుంటారు. అక్కడి దుకాణాల వాళ్లకు తమ స్థానిక ఆదివాసీ భాషలతోపాటు హిందీ, ఇంగ్లిష్, అస్సామీ కూడా వచ్చి ఉంటుంది. వాళ్లు ఇంగ్లిష్‌ మాట్లాడినప్పటికీ స్థానిక యాసలోనే ఉంటుంది. కాబట్టి దక్షిణాది వాళ్లకు అంత సులువుగా అర్థం కాదు. అస్సాం పర్యటనను ఎక్కువగా ఏప్రిల్‌ నెలలో ప్లాన్‌ చేసుకుంటుంటారు. అస్సామీల క్యాలెండర్‌ ప్రకారం ఏడాది మొదలయ్యే బోహాగ్‌ నెల దాదాపుగా మార్చి లేదా ఏప్రిల్‌ నెలలో వస్తుంది. మన ఉగాదిలాగ. ఈ పండుగ సందర్భంగా బిహు ఫెస్టివల్‌ వేడుకగా నిర్వహిస్తారు. అప్పుడు అస్సామీ సంప్రదాయ నృత్యాన్ని చూడవచ్చు. 

పరిశోధకుల పర్యటన
హఫ్లాంగ్‌ పట్టణానికి తొమ్మిది కిలోమీటర్ల దూరాన ఉన్న జతింగ గ్రామాన్ని మిస్‌ కాకూడదు. ఇది చాలా చిన్న గ్రామం. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో పక్షులు వలస వస్తాయి. ఇప్పటి వరకు నలభై నాలుగు రకాల వలస పక్షులను గుర్తించారు. ఇక్కడికి వచ్చే హరికిరి పక్షులు మంటల్లోకి దూకుతాయి. అవి ఎందుకు వస్తాయో, ఎందుకు మంటల్లో దూకుతాయో ఎంతకీ అంతుపట్టని మర్మంగానే ఉంది. పొగమంచులో చక్కర్లు కొడుతూ కాలుతున్న మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి. 

ఈ పక్షుల మీద అధ్యయనం చేయడానికి యూరప్, అమెరికా, జపాన్‌దేశాల నుంచి ఏటా ఆర్నిథాలజిస్టులు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొల్లేరుకి వచ్చే కొంగలు, పులికాట్‌ సరస్సుకి గూడబాతులు సీజన్‌లో ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి పొదిగి పిల్లలతోపాటు తిరిగి వెళ్లిపోతాయి. అలా చక్కగా వచ్చి వెళ్తుంటే చూడడానికి ఆహ్లాదంగా ఉంటుంది. కానీ జతింగకు వచ్చే పక్షులు తుదిశ్వాస కోసమే వస్తున్నాయని తెలిసినప్పుడు మనసుకు బాధ కలుగుతుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement