ప్రపంచంలో రకరకాల పురాతన వస్తువులకు మ్యూజియంలు ఉన్నాయి. ఇప్పటి వరకు నెక్‌టైలకు మాత్రం ఎక్కడా మ్యూజియం లేదు. ఆ లోటు తీర్చడానికి క్రొయేషియాలో కొందరు ఔత్సాహికులు నెక్‌టైల కోసం ప్రత్యేకంగా ‘క్రావాటికం’ పేరుతో ఒక మ్యూజియంను ఇటీవల ప్రారంభించారు. నాలుగు శతాబ్దాల కిందట నెక్‌టైల వాడుక మొదలైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు రకరకాల నెక్‌టైలను సేకరించి ఇందులో ప్రదర్శనకు ఉంచారు. వీటిలో ప్రముఖులు ధరించినవి, వివిధ కాలాల్లో ఫ్యాషన్లలో వచ్చిన మార్పులకు అద్దంపట్టేవి, ప్రపంచంలో పేరు పొందిన ఫ్యాషన్ డిజైనర్లు ప్రత్యేకంగా రూపొందించినవి– ఇలా ఎన్నో రకాల నెక్‌టైలు ఇక్కడ కొలువు దీరాయి.
క్రొయేషియాలోని జగ్రేబ్ నగరంలో 130 చదరపు మీటర్ల స్థలంలో ఏర్పాటైన ఈ మ్యూజియంలో నెక్ టైల చరిత్రకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కూడా పొందుపరచారు. నెక్‌టైల తయారీకి వాడిన పట్టుదారపు పోగులను, పట్టుగూళ్లను కూడా ఇందులో భద్రపరచారు. ఈ మ్యూజియంను తిలకించడానికి పిల్లలకు ప్రవేశం పూర్తిగా ఉచితం. విద్యార్థులకు టికెట్ ధర 5 యూరోలు (రూ. 453), పెద్దలకు టికెట్ ధర 8 యూరోలు (రూ.725). ఈ మ్యూజియం ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకుల కోసం తెరిచి ఉంటుంది.
అమ్మకానికి దయ్యాల దీవి..
దీవుల అమ్మకాలు, కొనుగోళ్లు ప్రపంచంలో కొత్తేమీ కాదు. సాధారణంగా అమ్మకానికి వచ్చే దీవులు ఆహ్లాదభరితంగా, నివాసయోగ్యంగా ఉంటాయి. కొన్నిచోట్ల పురాతన కట్టడాలు ఉన్నప్పటికీ, కొద్దిపాటి మరమ్మతులు చేయించుకుంటే, ఉపయోగించుకోవడానికి భేషుగ్గా ఉంటాయి. అయితే, తాజాగా అమ్మకానికి వచ్చిన దీవి మాత్రం అలాంటిలాంటి దీవి కాదు, దయ్యాల దీవిగా పేరుమోసిన దీవి.
ఇది ఇంగ్లండ్ వాయవ్య ప్రాంతంలోని ప్లిమత్ తీరానికి ఆవల ఉన్న డ్రేక్స్ దీవి. ఆరు ఎకరాల విస్తీర్ణం మాత్రమే ఉన్న ఈ చిన్న దీవి కొన్ని శతాబ్దాల పాటు సైనిక అవసరాలకు ఉపయోగపడింది. బ్రిటిష్ సైన్యం ఈ దీవిని వ్యూహాత్మక రక్షణ స్థావరంగా ఉపయోగించుకుంది. మొదటి ప్రపంచ యుద్ధానికి చాలాకాలానికి ముందే బ్రిటిష్ సైన్యం దీనిని విడిచిపెట్టేసింది. ఈ దీవిలో పద్దెనిమిదో శతాబ్ది నాటి సైనికుల స్థావరాలు, సొరంగ మార్గాలు, అప్పట్లో వారు ఉపయోగించిన ఫిరంగులు, ఇంకా ఉపయోగించని ఫిరంగి గుళ్లు నేటికీ ఇక్కడ పడి ఉన్నాయి.
రెండు శతాబ్దాలకు పైగా ఖాళీగా పడి ఉన్న ఈ దీవిని ఫిలిప్ మోర్గాన్ అనే బ్రిటిష్ వర్తకుడు 2019లో 6 మిలియన్ పౌండ్లకు (రూ.64.59 కోట్లు) కొనుగోలు చేశాడు. ఈ దీవిలో 43 గదుల హోటల్ నిర్మించడానికి అనుమతి కూడా పొందాడు. ఇక్కడ ఆకస్మిక సంఘటనలు జరగడం, సైనికుల ఆత్మలు సంచరిస్తున్నాయనే ప్రచారం ఎక్కువ కావడంతో ఫిలిప్ మోర్గాన్ తన ప్రణాళికలను విరమించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఈ దీవిని అమ్మకానికి పెట్టాడు. దీనిని కొనుగోలు చేయడానికి గుండెధైర్యం ఉన్నవాళ్లు ఎవరు ముందుకు వస్తారో చూడాలి మరి!
Comments
Please login to add a commentAdd a comment