ఇటీవలి ఫ్యాషన్లలో భాగంగా కొందరు విపరీతమైన బరువుండే ఇయర్ రింగ్స్ వాడటం కూడా చూస్తుంటాం. ఇలా ఫ్యాషనబుల్ ఇయర్ రింగ్స్ లేదా హ్యాంగింగ్స్ వేసుకునే క్రమంలో అత్యంత బరువైనవి వాడుతూ ఉంటే... వాటి బరువు కారణంగా క్రమంగా చెవి రంధ్రం సాగి, పెద్దదైపోయి తెగిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా ఎక్కువ బరువుండే ఇయర్ రింగ్స్ లేదా హ్యాంగింగ్స్ వేసుకోవడం బాగా సాగిపోయిన చెవి రంధ్రాలు లేదా పూర్తిగా తెగిపోయిన చెవి తమ్మెను ప్లాస్టిక్ సర్జరీ ప్రక్రియ ద్వారా రిపేర్ చేయడం సాధ్యమవుతుంది. దీనికోసం రోగికి పూర్తి మత్తు ఇవ్వనవసరం లేదు. కేవలం ఆ ప్రాంతం వరకే మొద్దుబారేందుకు మత్తు (లోకల్ అనస్థీషియా) ఇస్తే చాలు. రెండుగా తెగినట్లుగా ఉన్న చెవి తమ్మెను నేరుగానైనా లేదా మానిన తర్వాత గాయం మార్కు కనపడకుండా ఉండేలా వంకరటింకరగా (జిగ్‌జాగ్)నైనా చెవి తమ్మె రిపేర్ జరుగుతుంది.
అయితే ఇలా చెవి తమ్మెలను అతికించే ప్రక్రియ అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. చెవి రంధ్రం చీరుకున్న తీరును బట్టి పేషెంట్‌కు ఎలాంటి ప్రక్రియ అవసరమో వాళ్లతోనే మాట్లాడి వాళ్లకు అవసరమైన ప్రక్రియను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇందులో రెండుగా చీరుకున్న రంధ్రానికి కుట్లు కోసం అత్యంత నాణ్యమైన, బయటకు కనపడనంత సున్నితమైన దారాన్ని ఉపయోగిస్తారు. ప్రక్రియ అంతా పూర్తయ్యాక చికిత్స నిర్వహించిన చోట కొన్నాళ్ల పాటు పైపూతగా ఉపయోగించే యాంటీబయాటిక్ క్రీమ్‌ను కొంతకాలం పాటు రాయాల్సి ఉంటుంది. కాకపోతే గాయం అంతా మానాక కూడా పెన్సిల్‌తో గీత గీసినంత సన్నగా ఒక గీత మాత్రం కనబడుతుంటుంది. ఈ అతికింపు ప్రక్రియ పూర్తయ్యాక మళ్లీ చెవిని కుట్టించుకోవాలంటే... చెవి రంధ్రం పూడ్చాక కనీసం రెండు వారాలు ఆగి, ఆ తర్వాత చెవి కుట్టించుకోవచ్చు. అయితే మళ్లీ మాటిమాటికీ రంధ్రం పెద్దది కాకుండా మాత్రం తప్పక జాగ్రత్త వహించాలి. ఈమారు మునపటిలా బరువైన రింగులు వేసుకోరాదు.
Comments
Please login to add a commentAdd a comment